“ఒకవైపు బిజెపి తెలంగాణ ఏర్పాటును విమర్శిస్తూనే ఇక్కడ కాషాయ జండాను ఎగురవేయాలనుకుంటోంది. తెలంగాణ విషయం వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని చంపి పిల్లను బతికించారని, పార్లమెంటు తలుపులుమూసి బిల్లుపాస్ చేశారంటూ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్నాడు . అదే బిజెపి పక్క రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమిలో కలిసి పనిచేస్తున్నది. ఆ మూడు పార్టీలు కూడా తెలంగాణలో విస్తరించాలన్న ప్రణాళికతో ముందుకు పోయే ప్రయత్నాల్లో భాగమే మోదీ తాజా తెలంగాణ పర్యటన, అనంతరం మహానాడులో తెలంగాణపై వ్యాఖ్యలు. ఇందులో రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పాత్ర ఏమిటన్నదే ఇంకా అంతుబట్టకుండా ఉంది..”
ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే భవిష్యత్‌లో తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడు దశాబ్ధాల కాలంగా అలుపెరుగని పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రం మూనాళ్ళ ముచ్చటే అవుతుందా ? మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే విధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ మరోసారి ప్రాంతేతరుల పాలనను చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయా అన్న ఆందోళనలో తెలంగాణ ప్రజలున్నారు. గతంలో నిజాం కబంధ హస్తాల నుంచి విముక్తి పొందిన ఈ ప్రాంతాన్ని పదికాలాలపాటు ప్రత్యేక రాష్ట్రంగా బతకనివ్వకుండా ఎలాంటి కుట్రలు జరిగాయో, అలాంటి కుట్రలే మళ్ళీ పునరావృతం అయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ‘ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదే అన్న’ తెలంగాణలో ఒక సామెతలా ఉంది. ఆలాగే ఆనాడు తెలుగు వాళ్ళమంతా కలిసి ఉందామంటే సరే అన్నందుకు, చేసుకున్న బాసలు, రాసుకున్న ఒప్పందాలన్నిటినీ తుంగలో తొక్కి, తెలంగాణ పైనా, ఇక్కడి నాయకుల పైన దశాబ్ధాలుగా పెత్తనం సాగించి, తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసిన సీమాంధ్రుల గొడవను వదిలించుకుని పట్టుమని పన్నెండు ఏళ్ళు కాలేదు. అప్పుడే మళ్ళీ కుట్రలు, కుతంత్రాలు మొదలవుతున్నాయి. వద్దనుకున్న సీమాంధ్ర పెత్తనాన్ని శిరసావహించేందుకు స్థానికులే రెడ్ కార్పెట్ పర్చేందుకు సిద్దమవుతున్న వేళ, తెలంగాణ మరోసారి తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ పోరుబాట పట్టాల్సిందేనా అన్నది ఇప్పుడు కరుడుగట్టిన తెలంగాణ వాదుల్లో మెదులుతున్న ప్రశ్న.
దశాబ్ధాలుగా పోరాటాలు చేసిచేసి ఇక్కడి ప్రజలు అలిసిపోయినారు. ఇంటి పార్టీ అని నెత్తిన పెట్టుకుంటే గద్దె దించక తప్పని పరిస్థితిని స్వయంగా ఆ పార్టీయే కల్పించుకుంది. ఉద్యమ కాలంలో చెప్పిన సుద్దులు, చేసుకున్న బాసలకు భిన్నంగా అనేక అక్రమాల ఆరోపణలను మూటకట్టుకుంది. భవిష్యత్ తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటానన్న పార్టీ ప్రజల నమ్మకాలను వమ్ముచేసింది. ఫలితంగా ఇప్పుడు తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. మరోసారి రాజకీయ దాడికి సిద్దమవుతున్నాయి. తెలంగాణలో తెలంగాణ వైతాళికులకే గుర్తింపు లేకుండా పోతోంది. ఆనాటి నుండి నేటికీ అదే జరుగుతోంది. గతంలో మాదిరిగానే మనవాళ్ళతోనే మనను, మన ప్రాంతాన్ని హేళనచేసే పరిస్థితులు కల్పిస్తున్నారు. తెలంగాణ అనకుండా వెనుకబడిన ప్రాంతంగా పిలవాలన్న నాటి పాలకులు తమ కడుపులోఉన్న విషాన్ని మరోసారి తమ అనుమాయులతో కక్కిస్తున్నారు. అసలు తెలంగాణ అన్నపదమే లేదంటున్నారు. ఏ డిక్షనరీ లో వెతికినా ఆ పదమే కనిపించడంలేదట. అన్నదెవరు.. అనిపించిందెవరన్నది తెలియన్నంత అమాయకులేమీ కాదు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ఉద్యమకాలంలో ఇలాంటి మాటలే ఉద్యమకారులను రెచ్చగొట్టాయి.వీటిని జీర్ణించుకోలేక కొందరు బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలియంది కాదు. ఇప్పుడు మళ్ళీ అవేమాటల దాడులు. తెలంగాణ పాలకులు వివిధ పార్టీలకు చెందినవారే కావచ్చు. కాని తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడే విషయంలో ఒకటి కాలేకపోతున్నారు. అది పరాయి పార్టీలు మరోసారి కాలుమోపడానికి అవకాశంగా మారింది. వారికి పరోక్షంగా తలుపులు తెరుస్తున్నది కూడా పాలకులు కావడం దురదృష్టకరం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మనుగడలేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన మొదటి ఎన్నిక (2014)లో 15 స్థానాలను పొందిన టిడిపి, 2018లో మహాకూటమితో కలిసి పోటీ చేసి కేవలం రెండు స్థానాలను సంపాదించుకుంది. ఆ తర్వాత తెలంగాణలో పోటీ చేయడం మానేసింది. ఎవరు అవునన్నా కాదన్న ఆనాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో టిడిపిని రాకుండా అడ్డుకోగలిగిందనే చెప్పాలి. కాని, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలవుతున్నది. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే టిడిపి తిరిగి తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలన్న ప్రణాళికతో ముందుకు పోతున్నది. అందుకు తాజాగా ఆ పార్టీ మహనాడు ప్రత్యక్ష నిదర్శనం.
పూర్వం తెలంగాణ పదాన్ని ఉచ్చరించవద్దన్న చంద్రబాబు సమక్షంలోనే అదే వేదికనుండి తెలంగాణ నాయకుడితో తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీలో లేదని అనిపించడం వెనుక తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పులేదన్నది స్పష్టమవుతున్నది. దానికి తగినట్లుగా అదేపార్టీనుండి వచ్చి కాంగ్రెస్ పార్టీనుండి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఎనుముల రేవంత్‌రెడ్డి తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారీవిగ్రహాన్ని రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అట్టహాసంగా ప్రారంభించడమే కాదు, ఎవరు ఏమనుకున్నా నా స్ఫూర్తి దాత విగ్రహాన్ని పెట్టే తీరుతానన్నతీరు తెలంగాణ రాజకీయాలు ఎటువైపు మళ్ళుతున్నాయన్న అయోమయం ప్రజల్లో నెలకొంది. అంతేనా అంటే… ఆ విగ్రహావిష్కరణ సమావేశ మంతా పసుపు మయమైంది. పసుపు బ్యానర్లు, జెండాలతో, నినాదాలతో టిడిపి సభను తలపించింది. అధికార, విపక్ష పార్టీల్లో ఉన్న చాలామంది నేతలపేర్లను వినిపించి వీరందరికీ ఎన్టీఆరే రాజకీయ బిక్ష పెట్టాడని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొనడం కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టింది. ఎందుకంటే టిడిపి పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.
కుక్కమూతి పిందెలు, ఇంతింత బొజ్జలు పెంచుకున్నారంటూ నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ నేతలను తూర్పార పట్టారు. కాని ఇప్పుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ను పొగడటమేకాదు, ఆయన స్ఫూర్తే మా పాలన అనడం చూస్తే కాంగ్రెస్ పరిస్థితేమిటో అర్థం కాకుండా పోతున్నది. ఇప్పటికే రాజధానిలో మాజీ సీఎం రోశయ్య, సినీ నేపధ్యగాయకుడు బాల సుబ్రహ్మణ్యం విగ్రహాలను ప్రతిష్టించారు. తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం వారి విగ్రహాలెందుకన్న ఆక్షేఫణలు ఎదురవుతున్నాయి. అయినా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరించినట్లు, దీని వెనుక రేవంత్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి విగ్రహ ఆహ్వానం పట్ల ఎందుకు స్పందించలేదన్న పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే రానున్న జిహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లోని సెటిలర్స్ వోటర్లను ఆకట్టుకునేందుకు వేసిన ఎత్తుగడగానే ఎన్టీఆర్ విగ్రహా అవిష్కరణగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఏదిఏమైనా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణతో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో తలుపులు తెరిచి ఆహ్వానించడమే నంటున్నారు ఉద్యమకారులు. తెలంగాణ మహామహుల విగ్రహాలేవీ ఆంధ్ర ప్రాంతంలో కనిపించవు. కానీ, బలవంతంగానైనా ఆంధ్ర నేతలు, ఇతరుల విగ్రహాలను తెలంగాణ అంతటా ఇప్పటికే ప్రతిష్టించారు. ఒక విధంగా ఎన్టీఆర్ విగ్రహాలు కూడా తెలంగాణలో చాలాచోట్ల ఉన్నాయి. అయినా మైత్రివనం కూడలిలో తెలంగాణ ఏర్పడిన పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ వాదులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలపై ఇంకా ఆంధ్రప్రాంత ఆధిపత్యం కొనసాగుతున్నదనడానికి ఇది నిదర్శనమంటున్నారు. ఇది తెలంగాణ సంస్కృతిక విధ్వంసమేనంటున్నారు. ఒకవైపు బిజెపి తెలంగాణ ఏర్పాటును విమర్శిస్తూనే ఇక్కడ కాషాయ జండాను ఎగురవేయాలనుకుంటోంది. తెలంగాణ విషయం వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని చంపి పిల్లను బతికించారని, పార్లమెంటు తలుపులుమూసి బిల్లుపాస్ చేశారంటూ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్నాడు . అదే బిజెపి పక్క రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమిలో కలిసి పనిచేస్తున్నది. ఆ మూడు పార్టీలు కూడా తెలంగాణలో విస్తరించాలన్న ప్రణాళికతో ముందుకు పోయే ప్రయత్నాల్లో భాగమే మోదీ తాజా తెలంగాణ పర్యటన, అనంతరం మహానాడులో తెలంగాణపై వ్యాఖ్యలు. ఇందులో రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పాత్ర ఏమిటన్నదే ఇంకా అంతుబట్టకుండా ఉంది.





బొద్దింక “బౌద్ధిక “ధర్మం!?