ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం-2026 థీమ్:
“ఆకర్షణల ముసుగు తొలగిద్దాం… నికోటిన్, పొగాకు పరిశ్రమల ఎత్తుగడలను తిప్పికొడదాం”

సీనియర్,మెడికల్ ఆంకాలజిస్ట్,హెమటో-ఆంకాలజిస్ట్
రెనోవా,సెంచరీ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్.
పొగాకు… నేటి సమాజాన్ని నిశ్శబ్దంగా కబళిస్తున్న ప్రమాదకర వ్యసనం. సిగరెట్లు, బీడీలు, చుట్టలు మాత్రమే కాదు… గుట్కా, ఖైనీ, జర్దా వంటి నమిలే ఉత్పత్తులు కూడా లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటిలో ఉండే ‘నికోటిన్’ అనే రసాయనం మనిషిని బానిసగా మార్చేస్తుంది. దీని ప్రభావం కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా గుండె, మెదడు, రక్తనాళాలు, సంతానోత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్రంగా పడుతుంది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ ప్రత్యేకంగా యువతను లక్ష్యంగా చేసుకుని, డిజిటల్ ముసుగులో నికోటిన్ ఉత్పత్తులను ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న పరిశ్రమల ఎత్తుగడలపై హెచ్చరిస్తోంది. “సాంప్రదాయ సిగరెట్లకు దూరమవుతున్న నేటి యువతను ఆకర్షించేందుకు పొగాకు పరిశ్రమలు ఇప్పుడు వేప్స్, ఈ-సిగరెట్లు, ఫ్లేవర్డ్ నికోటిన్ ఉత్పత్తుల రూపంలో కొత్త ఉచ్చులు వేస్తున్నాయి”
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకు పైగా మంది పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. ప్రతి ఏడాది దాదాపు 80 లక్షల మంది ఈ వ్యసనం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
- పరోక్ష ధూమపానం (Passive Smoking): తాము ధూమపానం చేయకపోయినా, ఇతరులు వదిలిన పొగను పీల్చడం వల్ల ఏటా 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
- యువతలో పెరుగుతున్న పొగాకు వినియోగం: 13-15 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 4 కోట్ల మంది యువత ఏదో ఒక రూపంలో పొగాకు లేదా నికోటిన్ ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారు.
- భారత్‌లో పరిస్థితి: ‘గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే’ ప్రకారం దేశంలో 28.6% మంది పెద్దలు (సుమారు 26.7 కోట్ల మంది) పొగాకు వినియోగిస్తున్నారు. స్కూల్ విద్యార్థుల్లో 8.5% మంది ఈ అలవాటుకు గురవుతున్నారు.
- తెలుగు రాష్ట్రాల్లో: తెలంగాణలో 17.8% మంది, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 20% మంది పెద్దలు పొగాకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీడీలు కాల్చడం, పొగాకు నమలడం వల్ల వచ్చే నోటి (ఓరల్) క్యాన్సర్లు గణనీయంగా పెరుగుతున్నాయి.
డిజిటల్ ముసుగులో నికోటిన్ ఉచ్చు!
ఒకప్పుడు గోడల మీద పోస్టర్లు, హోర్డింగుల ద్వారా సాగిన పొగాకు ప్రచారం.. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల రూపంలో కొత్త రూపు దాల్చింది.
- ఫ్లేవర్డ్ ఉత్పత్తులు: ఈ-సిగరెట్లు (E-Cigarettes), వేప్‌లు (Vapes) ఇప్పుడు మామిడి, పుదీనా, చాక్లెట్, బబుల్ గమ్ వంటి వందలాది ఫ్లేవర్లలో దొరుకుతున్నాయి. ఇవి పొగాకు ఉత్పత్తులే కాదనే భ్రమను యువతలో కల్పిస్తున్నాయి.
- గ్యాడ్జెట్ తరహా డిజైన్లు: పెన్‌డ్రైవ్‌లు, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా కాస్మెటిక్ ఉత్పత్తుల్లా కనిపించేలా వీటిని రూపొందిస్తున్నారు. దీంతో విద్యార్థులు వీటిని సులభంగా దాచుకుని వినియోగిస్తున్నారు.
- సోషల్ మీడియా ప్రభావం: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, లైఫ్‌స్టైల్ వ్లాగ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారాల ద్వారా వేపింగ్‌ను “స్టైలిష్ కల్చర్”గా చూపిస్తున్నారు. ఫలితంగా యువత సులభంగా నికోటిన్ వ్యసనంలోకి జారిపోతోంది.
వ్యసనం నుండి క్యాన్సర్ దాకా..
పొగాకు వినియోగం నివారించదగిన క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణంగా మారింది. దీని ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవంపైనా పడుతుంది.
- క్యాన్సర్ల ముప్పు: నోరు, గొంతు, ఊపిరితిత్తులు, ఆహారవాహిక, జీర్ణాశయం, ప్యాంక్రియాస్, కాలేయం, మూత్రాశయం, మూత్రపిండాలు, గర్భాశయ ముఖద్వారం, ప్రేగుల క్యాన్సర్లకు పొగాకు ప్రధాన కారణం.
- నోటి క్యాన్సర్లు: మనదేశంలో గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వంటి నమిలే పొగాకు వల్ల చిన్న వయసులోనే నోటి (ఓరల్) క్యాన్సర్ బారినపడుతున్న బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
- ఇతర ఆరోగ్య సమస్యలు: గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక శ్వాసకోస వ్యాధులు వచ్చే ప్రమాదం అధికమవుతోంది.
- పిల్లలపై ప్రభావం: ఇంట్లో పెద్దలు ధూమపానం చేస్తే పిల్లల్లో ఆస్తమా, శ్వాసకోస ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. టీనేజర్లలో నికోటిన్ మెదడు ఎదుగుదల, జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
పొగాకు నియంత్రణకు తక్షణ చర్యలు
పొగాకు పరిశ్రమల కొత్త వ్యూహాలను అడ్డుకోవడానికి సమాజం, ప్రభుత్వం, విద్యాసంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
- పన్నుల పెంపు: ఈ-సిగరెట్లు, నికోటిన్ ఉత్పత్తులపై అధిక పన్నులు విధించాలి.
- ప్రకటనల నియంత్రణ: సోషల్ మీడియా ద్వారా జరిగే పరోక్ష ప్రచారాలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలి.
- డిజిటల్ నిఘా: మైనర్లకు ఆన్‌లైన్ ద్వారా విక్రయాలను అడ్డుకునేందుకు డిజిటల్ నిఘా పెంచాలి.
- పాఠశాలల్లో స్క్రీనింగ్, కౌన్సిలింగ్: పాఠశాలలు, కళాశాలల్లో వేపింగ్ ప్రమాదాలపై అవగాహన పెంచేలా ప్రత్యేక పాఠ్యాంశాలను, అవగాహన సదస్సులను నిర్వహించాలి.
వ్యసనం నుండి బయటపడటం సాధ్యమే
పొగాకు అలవాటు మానడం కొందరికి కష్టంగా అనిపించవచ్చు. అలాంటి వారు వైద్యుల పర్యవేక్షణలో నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT), కౌన్సిలింగ్, అవసరమైన మందులు ఉపయోగించడం ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడవచ్చు.
తదుపరి తరాన్ని కాపాడదాం!
నేటి పరిస్థితుల్లో మన ముందున్న అసలైన సవాలు… ఇప్పటికే వ్యసనంలో ఉన్న వారిని బయటపడేయడం మాత్రమే కాదు… భావితరాలు ఈ నికోటిన్ ఉచ్చులో పడకుండా ముందుగానే నిరోధించడం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ అవగాహన కల్పించాలి. డిజిటల్ వినోదం, ఆధునిక జీవనశైలి పేరుతో వస్తున్న ఈ కొత్త తరహా వ్యసనాలపై సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది థీమ్ సూచిస్తున్నట్లుగా, ఆకర్షణీయమైన ప్రచారాల వెనుక దాగి ఉన్న వ్యూహాలను గుర్తించి వాటి ముసుగును తొలగించినప్పుడే భావితరాలను నికోటిన్ బారినుంచి కాపాడగలం. పొగాకు రహిత సమాజ నిర్మాణమే భావితరాలకు మనం అందించే నిజమైన ఆరోగ్య వారసత్వం.





బొద్దింక “బౌద్ధిక “ధర్మం!?