ఎక్కడ చూసినా చెత్తకుప్పల దర్శనం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : హైదరాబాద్‌లో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని వెల్లడిరచారు.
చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతున్నదని చెప్పారు. పర్యవేక్షించాల్సిన పార్ట్`టైమ్ మున్సిపల్ మంత్రేమో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, దిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని ప్రభుత్వానికి కెటిఆర్ సూచించారు.





