సభా సమయాన్ని విపక్షాలు వృథా

సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నం
నిర్మణాత్మక చర్చలతో బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలి
విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శ

న్యూ దిల్లీ, జూలై 22 : పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాను బరువెక్కిన హృదయంతో చెబుతున్నానని, కొందరు ఎంపీలు, ఇతరులను తమ నియోజకవర్గ సమస్యలపై సభలో మాట్లాడే సమయం ఇవ్వకుండా చేస్తున్నారని అన్నారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని ప్రధాని ప్రతిపక్షాలకు సూచించారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్‌ తొలి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా సోమవారం ప్రధాని మోదీ విూడియాతో మాట్లాడుతూ…ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసనలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారని మోదీ ఆరోపించారు. ఇదివరకు జరిగిన సభల్లో రెండున్నర గంటలు తనపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడాయన్నారు.

ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో ఇలాంటి వ్యాఖ్యలకు తావుండదని, వీటన్నింటినీ దేశం నిశితంగా పరిశీలిస్తుందని ప్రధాని అన్నారు. విపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరుతూ..కనీసం ఈ సమావేశాలైనా సజావుగా సాగుతాయని ఆశిస్తున్నానన్నారు. 2014 తర్వాత కొంతమంది ఎంపీలు ఒకసారి, మరికొందరు రెండోసారి గెలిచారని అన్నారు. కానీ.. విపక్షాల అరుపుల మధ్య వారిలో చాలా మంది వారి సమస్యలను సభాసాక్షిగా వినిపించలేకపోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నుంచైనా సమావేశాలను సజావుగా సాగనిస్తూ.. ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించనివ్వాలని కోరారు. 60 సంవత్సరాల తరువాత వరుసగా మూడు సార్లు ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారని, మూడోసారి అధికారం చేపట్టాక తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నామని మోదీ వ్యాఖ్యానించారు. సుపరిపాలనకు ఈ బడ్జెట్‌ ముఖ్యమైనదని, రాబోయే 5 ఏళ్లకు ఇది దిశానిర్దేశం చేస్తుందని, 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి బలమైన పునాది అవుతుందన్నారు. గత మూడేళ్లలో దేశం 8 శాతం ఆర్థిక వృద్ధిని సాధించిందని, దేశంలో పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఉందని, అందుకు తగినట్లు వేల సంఖ్యలో కంపెనీలు భారత్‌కి వొచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని, లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page