– సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ షాక్
- టీఎంసీ తిరుగుబాటు ఎంపీల గ్రూపులో చేరిక
– యూటర్న్ తీసుకున్న మరో ఎంపి కళ్యాణ్ బెనర్జీ
– అభిషేక్ బెనర్జీ తన కొడుకు లాంటి వాడంటూ కితాబు
న్యూదిల్లీ ,జూన్13: తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోంది. మరోవైపు అంతర్గత వ్యవహారాలు క్షణక్షణానికి మారుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి తాజాగా ఆ పార్టీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ షాక్ ఇచ్చారు. టీఎంసీ తిరుగుబాటు ఎంపీల గ్రూపులో శనివారంనాడు చేరారు. అనంతరం మరో అసమ్మతి ఎంపీ శతాబ్ది రాయ్‌తో కలిసి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. 19 మంది ఎంపీలతో కలిసి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను సోమవారం కలుసుకోనున్నట్టు రెబల్స్ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో సుదీప్ బందోపాధ్యాయ్ ఆ గ్రూపులో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 8 నుంచి టీఎంసీ అసమ్మతి ఎంపీల సంతకాల సేకరణ చేపట్టామని, 19 మంది ఎంపీలు సంతకాలు చేశారని రెబల్ ఎంపీ చంద్ర బర్మ బసునియా వెల్లడించారు. ఇప్పటికే ఒకసారి స్పీకర్‌ను కలిసిన తాము ఈనెల 15న మరోసారి కలిసి తమ గ్రూపునే నిజమైన టీఎంసీగా గుర్తించాలని కోరనున్నట్టు చెప్పారు. ఓంబిర్లాను కలవడానికి ముందు టీఎంసీ రెబల్స్ న్యూదిల్లీలో సమావేశం అవుతారని, అందులో పాల్గొనేందుకు 20 మంది ఎంపీలు న్యూఢిల్లీ చేరుకుంటారని అసమ్మతి వర్గ నేత ఒకరు చెప్పారు. కాగా, తిరుగుబాటు వర్గం వాదనను టీఎంసీ తోసిపుచ్చింది. వారి వాదనకు ఎలాంటి చట్టబద్ధత లేదని పార్టీ ఎంపీ మహువా మొయిత్ర తెలిపారు. పార్టీలో చీలిక ప్రొవిజన్‌ను రాజ్యాంగంలోని 91వ సవరణ తొలగించినట్టు చెప్పారు. 19 మంది ద్రోహులు పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయాలని సామాజిక మాధ్యమం ’ఎక్స్’లో మహువా మొయిత్ర పేర్కొన్నారు. ’ఆపరేషన్ లోటస్’ పేరుతో ఫిరాయింపులకు బీజేపీ వ్యూహరచన చేసిందని, పార్టీని చీల్చాలనే ప్రయత్నం ఏమాత్రం సఫలం కాదని టీఎంసీ మరో ఎంపీ కీర్తి ఆజాద్ అన్నారు.
ఇదిలావుంటే టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారం యూటర్న్ తీసుకున్నారు. ’అభిషేక్ నా కొడుకుతో సమానం. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం తండ్రికి ఉంటుంది’ అని అన్నారు. సంతకాల ఫోర్జరీ కోసులో అభిషేక్ తరఫున కల్యాణ్ బెనర్జీ వాదిస్తున్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి అభిషేక్ బెనర్జీకి హైకోర్టు తాత్కాలిక రక్షణ ఇచ్చింది. అయితే ఈ కేసులో కల్యాణ్ బెనర్జీ స్థానంలో మరొక లాయర్ వచ్చి చేరడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. అభిషేక్ అహంకారిగా మారిపోయాడని, ఎవరినీ గౌరవించడం లేదని, అభిషేక్ లేకుండా పార్టీ నడవదని మమతా బెనర్జీ భావిస్తే తాను పార్టీ నుంచి తప్పుకుంటానని ఆయన హెచ్చరించారు. దీనిపై అభిషేక్ ఆచితూచి స్పందించారు. కల్యాణ్ బెనర్జీ తనకంటే పెద్దవారని, ఆయన తన అభిప్రాయాలను చెప్పడంలో తప్పులేదని, చిన్నప్పటి నుంచి తనను ఆయన చూశారని, ఆయన గురించి తాను ఏ మాట్లాడలేనని అన్నారు. ఈ క్రమంలో అభిషేక్ తన కుమారుడి లాంటివాడని కల్యాణ్ బెనర్జీ ప్రకటించడంతో టీఎంసీ అధినాయకత్వం ఊపరి పీల్చుకుంది. కాగా, కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం కానుందంటూ కొందరు చేస్తున్న ఊహాగానాలను కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు తోసిపుచ్చారు. కాంగ్రెస్‌లో టీఎంసీ కలవబోవడం లేదని చెప్పారు. రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తారంటూ వస్తున్న వార్తలపై సూచిగా స్పందించారు. ’వాళ్లు ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చు. బీజేపీ గొడుకు కింద పనిచేయాలను కుంటున్నారు. ఇదంతా ఓ కుట్ర. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే బీజేపీతో పనిచేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. తమ నియోజకవర్గాలకు ఒక్కసారి కూడా వెళ్లని వాళ్లు ప్రజలకు చేసేదేముంటుంది? బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పీకనొక్కేసారు. గత నెలరోజుల్లో ఎలాంటి అభివృద్ధి చేశారు? మమ్మల్ని బీజేపీ వేధిస్తోంది, పోలీసులు వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఏ విపక్షానికి రాలేదు. 19 మంది ఎంపీలు వెళ్లిపోవాలనుకున్నా వాళ్లను బీజేపీ చేర్చుకోదని కల్యాణ్ బెనర్జీ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




