గాడిలో పెడుతున్నాం..
కెసిఆర్ సభకు వొచ్చి ఉంటే సాక్ష్యాలతో సమాధానం చెప్పేవాళ్లం
ఎంత దొరికితే అంత దోచుకోవడమే మీ ఆలోచన
అక్కడ రాహుల్ గాంధీని చూపించిన దానికంటే ఎక్కువగా ఇక్కడ మిమ్మల్ని చూపిస్తున్నాం
ఎంఎల్ఏ హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు ధీటైన జవాబు
బడ్జెట్‌పై అసెంబ్లీలో వాడీవేడి చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : గత పదేళ్ల బిఆర్ఎస్ సాలనలో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారశ్రీతీ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అస్తవ్యస్థంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను తాము ఇప్పుడిప్పుడే దారికి తెస్తున్నామని అన్నారు. తాము రాష్ట్రాన్ని బాగు చేసే బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని..బీఆర్ఎస్ నేతలకు అది కంటగింపుగా ఉందన్నారు. వారిలాగా తాము వివిధ మార్గాల్లో నిధులు మళ్లించడం లేదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం బడ్జెట్‌పై రసవత్తర చర్చ నడిచింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హావిూలు మొదలు..గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ వాడీవేడీగా జరిగింది. ఈ సందర్భంగా ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు…మరోవైపు సీఎం, మంత్రులు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది.
బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైన తరువాత అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు తమ ప్రభుత్వ ఘనతను వివరిస్తుండగా..విపక్షం నుంచి హరీష్ రావు తనదైన శైలిలో ప్రభుత్వంలోని లోపాలను, తప్పులను ఎత్తి చూపారు. సభలో బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ..శనివారం ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వొస్తారని భావించామని, ఆయన వొస్తే అన్నింటికీ సమాధానం చెబుదాం అనుకున్నామని..కానీ ఆయన సభకు రాలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని ఒకే కుటుంబం చేతిలో పెట్టారని ఆరోపించారు. ఎక్సైజ్‌పై హరీష్ రావు వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇస్తూ..గత ఏడాదే వైన్ షాపులు వేలం వేశామని హరీష్ రావు అంటున్నారని, ఈ సంవత్సరం పెట్టాల్సిన యాక్షన్ గత ఏడాదే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఎంత దొరికితే అంత దోచుకోవడమే వారి ఆలోచన అని దుయ్యబట్టారు.
టానిక్ లాంటి షాపులకు అనుమతి ఇచ్చి ఆదాయాన్ని ఒకే కుటుంబ సభ్యుల చేతికి మళ్లించారని, తాము అలా కానివ్వమని హరీష్ రావుకు మంత్రి భట్టి కౌంటర్ ఇచ్చారు. తాను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు టీవీలో చూపించడం లేదని, హరీష్ రావు చేసిన తదితర ఆరోపణలకు స్పీకర్, మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తాము లోక్ సభలో రాహుల్ గాంధీని చూపించిన దాని కంటే పదిరెట్లు ఎక్కువగా ఇక్కడ చూపిస్తామన్నారు. రాహుల్ గాంధీ బాటలోనే తాము నడుస్తామన్నారు. ప్రతిపక్ష నాయకులను టీవీలో చూపిస్తున్నామని చెప్పారు. సభలో తానను మాట్లాడనివ్వడం లేదని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇస్తూ…తాము ఎవరికీ భయపడమన్నారు. ఇప్పటికే హరీష్ రావు గంట మాట్లాడారరని, ఆయన సమయం మాట్లాడే సమయం అయిపోయిందని, సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సూచించారు.