భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

పలు గ్రామాల రాకపోలకు అంతరాయం
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం
పొంగుతున్న వాగులు, వంకలు
గోదావరికి ఉధృంతగా వరద నీరు
పరీవాహకాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ
శ్రీశైలానికి ఉరకలెత్తుతున్న కృష్ణా ప్రవాహం
మేడిగడ్డ వద్ద భారీగా వరదనీరు… గోదావరి పరివాహకంలో సీతక్క పర్యటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పగటివేళ ముసురు వాన కురుస్తుండగా.. రాత్రిళ్లు వాన దంచికొడుతుంది. హైదరాబాద్‌ నగరంతోపాటు జిల్లాలు తడిసిముద్దయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా నదుల పరీవాహకాల్లోని ప్రాజెక్టులకు ప్రవాహం పెరిగింది. వరద పరిస్థితులపై రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం సవిూక్ష నిర్వహించారు.  అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో 14 సెం.విూ. వర్షం కురిసింది. గోదావరి ఉగ్రరూపం దాల్చి.. భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చింది. దీంతో కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ ఈ సీజన్‌లో తొలిసారిగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 48 అడుగులకు చేరితే  రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామానికి చెందిన పశువుల కాపరి పంతంగి లక్ష్మయ్య(55) ఆదివారం భారీ వర్షానికి తడిసి.. చలి తీవ్రతకు మృతి చెందారని స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం బొప్పరికుంటకు చెందిన టేకం లక్ష్మణ్‌(22) గంగాపూర్‌ సవిూపంలోని వంకతుమ్మ వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం దాటుతున్న సమయంలో నీటి ప్రవాహంలో పడి గల్లంతయ్యారు. మరోవైపు వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. పలుచోట్ల ములుగు జిల్లా వాజేడు మండలంలో తెలంగాణ`ఛత్తీస్‌గఢ్‌ జాతీయ రహదారిపై గోదావరి వరద సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా సోమవారం ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఒడిశా`ఛత్తీస్‌గఢ్‌ మధ్య అల్పపీడనం కేంద్రీకృతమైందని వెల్లడిరచింది.మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చిన్న చిన్న వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్ల మండలంలో ఈత వాగు ప్రవాహంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి, లింగాపురం, గొంపల్లిలకు మండల కేంద్రమైన చర్లతో సంబంధాలు తెగిపోయాయి. ఇదే జిల్లా దుమ్ముగూడెం మండలంలో సీతవాగు, గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్టాల్రకు వెళ్లే ప్రధాన రహదారిపై చట్టి వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ`ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని జాతీయ రహదారిపై గోదావరి వరద పోటుతో నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనదారులను పోలీసులు అనుమతించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో వాగుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ప్రమాదకరంగా ఉన్న ప్రవాహాలను దాటనివ్వడం లేదు. భద్రాచలం నుంచి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లాలో దాదాపు 20 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వాజేడు మండలం టేకుపల్లి వద్ద 163వ జాతీయ రహదారిపైకి గోదావరి వరద వచ్చి చేరడంతో తెలంగాణ`ఛత్తీస్‌గఢ్‌ రాష్టాల్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరు వద్ద సాయంత్రం 5 గంటల వరకు గోదావరి 15.83 విూటర్లతో ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలంలో గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉంది. పేరూరు`చండ్రుపట్ల గ్రామాల మధ్య మరివాగు, వాజేడు`గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య కొంగాల వాగు ఉప్పొంగుతున్నాయి. కలిపాక, సీతారాంపురం, ముత్తారం పరిధిలోని వాగుల్లో భారీగా వరదతో ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జంపన్న వాగుకు వరద పోటెత్తుతోంది. భూపాలపల్లి జిల్లాలో వరదల కారణంగా 15 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. గోరికొత్తపల్లి మండలం సుల్తాన్‌పూర్‌ సవిూపంలోని వాగుపై నిర్మిస్తున్న వంతెన బైపాస్‌ రోడ్డు వరద ధాటికి కొట్టుకుపోయింది. టేకుమట్ల మండలంలోని మానేరు, చలివాగు పొంగుతుండడంతో సవిూపంలోని గ్రామాలతో పాటు ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు రవాణా స్తంభించింది. మహబూబాబాద్‌ జిల్లాలోని కొత్తగూడ, గూడూరు, బయ్యారం మండలాల్లో వాగులు పొంగుతుండడంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని కొత్తవాడ(పద్మశాలి) కాలనీ వరదతో ముంపునకు గురైంది.  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగా నది జోరుగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చర జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సింగరేణి బొగ్గు గనుల్లో.. ప్రధానంగా ఉపరితల గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. సాధారణ రోజుల్లో సింగరేణి 2.1 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. గత మూడు రోజులుగా రోజువారీ ఉత్పత్తి 90 వేల టన్నులు సాధించడం గగనంగా మారింది.

పొంగుతున్న వాగులు, వంకలు…నదీ పరీవాహకాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన నదులు కృష్ణా, గోదావరులు పొంగుతున్నాయి. ప్రధానంగా గోదావరికి వరద పోటెత్తుతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గత మూడు రోజులుగా ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరుల నుంచి వరద వచ్చి చేరుతుంది. గోదావరి పరీవాహకంలో భారీ వర్షాలు పడుతుండటంతో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ`అన్నారం బ్యారేజీల మధ్య వాగుల నుంచి పెద్దఎత్తున వరద వొచ్చి గోదావరి నదిలో కలుస్తుంది. దీంతో ప్రవాహం పెరుగుతుంది. మేడిగడ్డ వద్ద 5.52 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంది. అన్నారం బ్యారేజీకి 16,850 క్యూసెక్కుల ప్రవాహం వొస్తుండడంతో 66 గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇంద్రావతి కలిసిన అనంతరం సమ్మక్క బ్యారేజీ వద్ద 8.23 లక్షల క్యూసెక్కులు, దుమ్ముగూడెం సీతమ్మసాగర్‌ ఆనకట్ట వద్ద 9.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి(43 అడుగులు)ని నది దాటింది. నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గక పోవడంతో మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరామసాగర్‌ జలాశయంలోకి ఎగువ నుంచి 18,518 క్యూసెక్కుల వరద చేరుతుంది. నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి జలాశయంలో ఆదివారం ఉదయం నాలుగు వరద గేట్లు ఎత్తారు. మధ్యాహ్నానికి వరద తగ్గడంతో ఒక గేటు మూసేసి మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా నదిలో ఎగువన వరద పెరుగుతుంది. కర్ణాటకలో ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాల కింద అప్రమత్తత ప్రకటించారు. ఆదివారం సాయంత్రానికి ఎగువ నుంచి భారీ ప్రవాహాలు వస్తుండటంతో ఆలమట్టి నుంచి దిగువకు 1.50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభించారు. ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కర్ణాటక జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. నారాయణపూర్‌ నుంచి 25 గేట్లు తెరిచి 1.45 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు వరద పెరిగింది. ప్రాజెక్టు 22 గేట్లను తెరిచారు. శ్రీశైలం జలాశయం వద్ద 96 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో నమోదవుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది పరీవాహకంలోని లోతట్టు ప్రాంతాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని పరీవాహక జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వరద పరిస్థితులపై ఆదివారం హైదరాబాద్‌లో అధికారులతో ఆయన సవిూక్ష నిర్వహించారు. నదులు, వాగుల ప్రవాహాలతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి.. సమన్వయం చేయాలని కోరారు. రెస్క్యూ బృందాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సాయాన్ని తీసుకోవాలని సూచించారు.

మేడిగడ్డ వద్ద భారీగా వరదనీరు…గోదావరి పరివాహకంలో సీతక్క పర్యటన
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్‌ మండల పరిధిలోని అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు వరద ప్రవాహం పోటెత్తుతుంది. తెలంగాణతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సోమవారం బరాజ్‌ ఇన్‌ప్లో 8,68,850 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీలో 85 గేట్లు ఎత్తి 8,68,850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదే విధంగా అన్నారం బరాజ్‌కు 17,200 క్యూసెక్కుల వరద ప్రవాహం వొచ్చి చేరుతున్నది. భారీ వర్షాల నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్ట్‌లు జలకళలను సంతరించుకుంటున్నాయి. వరద నీటి తీవ్రతకు పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కాగా, ములుగు జిల్లాలో కురిసిన వర్షాలకు రాళ్లవాగు ప్రవాహానికి బండారు పల్లి వద్ద రహదారి కొట్టుకు పోయింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్‌, గ్రావిూణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్‌.తో కలసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోనేం దుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంత్రి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పి. శ్రీజ, ఆర్‌ అండ్‌ బీ డీఈ. రఘువీర్‌, తహసిల్దార్‌, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page