నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు
అధికారులతో సమీక్ష సిఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్(హైడ్రా) విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సవి•క్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…హోర్డింగ్స్, ప్లెక్సీల తొలగింపు బాధ్యత హైడ్రాకు ఇవ్వాలని సూచించారు. జోన్ల విభజనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు.
ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని, అందుకు అవసరమైన ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా హైడ్రా విధివిధానాలపై చర్చ జరిగింది. హైడ్రా విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల చదరపు కి.వి• పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ప్లెక్సీలు తొలగించాలని, అపరాధ రుసుము వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలని ఆదేశించారు. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్‌లో వొచ్చేలా జాగ్రత్త వహించాలన్నారు.
నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, వాటర్ వర్కస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలని, ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని, అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని, అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించండని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.