భూమండల పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
ఐక్యరాజ్యసమితి అనుబంధ అధ్యయన మండలి వారు ప్రపంచ మానవులకు మాంసం తినడం క్రమంగా తగ్గించి వేయాలంటోంది. మాంసాహారం భుజించడం తగ్గించడం భూమండల పరిరక్షణకు దోహదం చేయగలదన్నది ఇటీవల వెల్లడిరచిన తమ నివేదికలో ఈ ‘పర్యావరణ పరివర్తన వ్యవహారాల అంతర్జాతీయ అధ్యయన మండలి’ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్- ఐపిసిసి- వారు రూపొందించిన ప్రత్యేక నివేదికలో పేర్కొన్నారు. ఆకుపచ్చని సీమలు ఎడారులుగా మారిపోకుండా, భూసారం నష్టమైపోకుండా నిరోధించే ప్రక్రియ గురించి ప్రభుత్వం ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.
ప్రపంచంలోని వ్యవసాయ భూమి నిరంతరం నిస్సారమై, నిర్జీవమైపోతోందన్నది నివేదికలో వ్యక్తమైన ఆందోళన. ఇరవై మూడు శాతం ధరాతల విస్తీర్ణం నిర్జీవమైపోయి ఉందని, భారతదేశంలో ఈ నిర్జీవ నిస్సార భూమి వైశాల్యం ముప్పయి శాతానికి పైబడిరదని కూడ నివేదికలో పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లకు ఆరోగ్యానికి సంబంధం ఉందన్నది అనాది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఐక్యరాజ్యసమితి అధ్యయన మండలి వారు మరోసారి ధ్రువీకరించారు. మాంసాహారం విచక్షణ రహితంగా తినడం వల్ల అవిరళంగా ప్రతిరోజు ఆరగించడం వల్ల తింటున్న వారి ఆరోగ్యం క్రమంగా క్షీణించిపోతుందన్నది అందరికీ తెలిసిన సత్యం.
మన దేశంలో కాని ప్రపంచంలో కాని కేవలం శాకాహారం భుజించేవారి సంఖ్య చాలా తక్కువ. మాంసాహారం తింటున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. తరతరాలుగా ఇదే జీవన విధానం. అయితే తరతరాలు మాంసాహార సేవనంలో విచక్షణ నిహితమై ఉండేది. నెలకు రెండుసార్లు మాత్రమే మాంసం వండి భుజించడం కొన్ని కుటుంబాలలోని సంప్రదాయం. నెలకోసారి మాంసం తినడం లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాలలోను, పండుగల సమయంలో మాంసాహారం తినడం మన దేశంలో సాధారణ సంప్రదాయంగా కొనసాగింది.
కానీ ఈ తరతరాల సంప్రదాయం ఈ తరంలో భంగపడిరది. వారానికోసారి మాంసం తినడం మొదలైంది. క్రమంగా ఈ మాంస భక్షణ నిత్యకృత్యమైపోయింది. ఇదీ వైపరీత్యం. మాంసాహారం తినడం ఒక భోగం. మిఠాయిలు, పిండివంటలు తినడం కూడ భోగం. ‘భోగం’ తరచూ అనుభవించి అనుభూతి పొందగల సుఖం మాత్రమే. ప్రతిరోజూ దాన్ని అనుభవించినట్టయితే అది ‘భోగం’ కాదు, ‘రోగం’ అవుతుంది. విచక్షణ రహితంగా పిండివంటలను, మిఠాయిలను, అంగడి తిండిని ప్రతిరోజూ తింటున్న శాకాహారులు, రోజూ మాంసం తింటున్న మాంసాహారులు ఇలా రోగగ్రస్తులవుతున్నారు.
పులిహోర, పాయసం, గారెలు, బూరెలు వంటివి, మాంసాహారం ప్రతిరోజూ తినరాదన్నది భారతీయ జీవన సత్యం. సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వీటిని ఆరగించాలన్నది జీవన రీతి. ఈ రీతి చెడిపోయి ఉండడం వర్తమాన సమాజ రుగ్మతకు కారణం… మధుమేహం, హృదయ భారం వంటివి విచక్షణ రహితమైన భోజన ప్రవృత్తివల్ల దాపురించిన కొన్ని జబ్బులు మాత్రమే.. అందువల్లనే ‘‘న మాంస భక్షణే దోషః’’- మాంసం తినడం తప్పుకాదు- అని చెప్పిన ధర్మశాస్త్రాలు ‘‘ప్రవృత్తిరేవ భూతాని’’- ఇది మానవ ప్రవృత్తి- అన్న వాస్తవాన్ని కూడ అంగీకరించాయి. కానీ ‘‘నివృత్త్యస్తు మహాఫలాః’’ – తినడం మానుకోవడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయి’’ అని కూడ ధర్మశాస్త్రాలు జీవన ధర్మాన్ని బోధిస్తున్నాయి. ఈ బోధనకు పునరావృత్తి ఐక్యరాజ్యసమితి అధ్యయన బృందం వారి నిర్ధారణ.. ‘‘మాంసం తినడం తగ్గించడం భూపరిరక్షణకు దోహదకరం’’అన్నది ఈ నిర్ధారణ.
మాంసం తినడం కోసం పాడి పశువులను, ఇతర జంతువులను, పక్షులను, జలచరాలను చంపడం వేరు ! కానీ మాంసాన్ని డబ్బాలలో భద్రపరచి విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల దశాబ్దులుగా మన దేశంలో ఆవుల వధ, ఇతర పాడి పశువుల వధ విచక్షణ రహితంగా కొనసాగింది. ఒంటెల పాలు తాగడం ఆరోగ్యకరమట. అందువల్ల ఒంటె పాలకు గిరాకీ పెరిగింది, కానీ ఒంటెలను చంపి మాంసం మెక్కడం వల్ల ఒంటెలు అంతరించిపోతున్నాయి. గ్రామాలలో పట్టణాలలో నిత్యం దర్శనమిచ్చిన గాడిదలు ఇప్పుడు కన్పించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్లతరబడి గాడిదలను విచక్షణ రహితంగా వధించి మాంసం వ్యాపారం చేసిన ముఠాల గురించి ప్రచారమైంది. నెమళ్లను, జింకలను చంపి భోంచేసిన ‘‘పెద్ద మనుషుల’’ను న్యాయస్థానాలు శిక్షించకపోలేదు. కానీ బయటపడని జంతుహత్యలు ఎన్నన్నది ఎప్పటికీ తేలదు. ఏమయినప్పటికీ మాంసాహారం తగ్గించడం వల్ల, మానుకోవడం వల్ల భూమికి మేలన్న ‘ఐక్యరాజ్యసమితి’ మాటను మనం ఇప్పటికైనా ఆచరించాలి.
భూమి ప్రధానంగా- వ్యవసాయ భూమి నిస్సారమై నిర్జీవమైపోతుండడానికి కారణం విరివిగా, విచక్షణ రహితంగా కృత్రిమ విష రసాయనపు ఎరువులను వాడడం! నిస్సారం అవుతున్న భూమిని సారవంతం చేయడానికి ఇబ్బడిముబ్బడిగా రసాయన విషాలను వాడేశారు. ఫలితంగా భూమి మరింత నిర్జీవమైపోతోంది. ఈ వైపరీత్యం మొదలుకావడానికి కారణం భూమికి అనాదిగా లభించిన సహజమైన ఎరువులు గత ముప్పయి ఏళ్లుగా లభించకపోవడం… ఇలాంటి సహజమైన ఎరువులు అడవి ఆకులు, ఆవుపేడ, పశువుల పేడ… ఆవులు, పశువులు, అడవి, జంతువులు, పక్షులు నశించిపోవడానికి ప్రధాన కారణం విచక్షణ రహితంగా వాటిని దశాబ్దుల తరబడి చంపివేయడం.. తినడం కోసం కొందరు చంపారు.
అమ్మడం కోసం అనేక మంది చంపారు! ఫలితంగా సహజమైన ‘గవ్యాలు’- ఆవుపేడ, మూత్రం, పాలు పెరుగు నెయ్యి-, ఇతర పశువుల వ్యర్థాలు, ఆకులు లభించడం లేదు! భూసారం నష్టమైపోవడానికి ఇదంతా నేపథ్యం… మాంసాహారం కోసం ఆవులను, పశువులను, వన్య మృగాలను, పక్షులను, జలచరాలను బహిరంగంగా వధించడం వల్ల ప్రకృతి, పరిసరాలలోని నీరు, గాలి కలుషితం అవుతుండడం మరో వైపరీత్యం. జంతు కళేబర వ్యర్థాలను ప్రకృతి జీర్ణించుకోలేక పోతోంది. అంత పెద్ద పరిమాణంలో ఈ జంతు కళేబర వ్యర్థాలు విస్తరించిపోతున్నాయి. మానవులు మాంసభక్షణను క్రమంగా తగ్గించుకున్నట్టయితే వారి శరీర ఆరోగ్యంతోపాటు పరిసరాల ఆరోగ్యం, వ్యవసాయ భూముల ఆరోగ్యం పెంపొందగలవన్నది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అధ్యయనం చేసిన వివిధ దేశాలకు చెందిన శాస్తవ్రేత్తల నిర్ధారణ!!
-కె.ఎస్