“తెలంగాణ జెన్ జీలో నిస్తేజం ఎందుకు ఆవరించుకున్నది? రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, విద్యార్థి, విప్లవ ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించి చైతన్యానికి ప్రతీకలుగా నిలిచిన యువత జంతర్ మంతర్ ఉద్యమాలకు ఎందుకని స్పందించడం లేదు? రాజకీయ నైరాశ్యమా? ఆత్మసంతృప్తా? కెరీరిజమా? ఏ కారణంగా యువత ఉద్యమాలను భుజానికెత్తుకోవడం లేదు? దేశవ్యాప్తంగా వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై నిరసనలు వెల్లువెత్తుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో, వోట్లు తొలగించారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ తెలంగాణలో ఉద్యమం ఎందుకు ఉధృతం కావడం లేదు?..”
తెలంగాణ జెన్ జీలో నిస్తేజం ఎందుకు ఆవరించుకున్నది? రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, విద్యార్థి, విప్లవ ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించి చైతన్యానికి ప్రతీకలుగా నిలిచిన యువత జంతర్ మంతర్ ఉద్యమాలకు ఎందుకని స్పందించడం లేదు? రాజకీయ నైరాశ్యమా? ఆత్మసంతృప్తా? కెరీరిజమా? ఏ కారణంగా యువత ఉద్యమాలను భుజానికెత్తుకోవడం లేదు? దేశవ్యాప్తంగా వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై నిరసనలు వెల్లువెత్తుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో, వోట్లు తొలగించారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ తెలంగాణలో ఉద్యమం ఎందుకు ఉధృతం కావడం లేదు? ఒకప్పుడు అన్యాయాన్ని ఎదిరించేందుకు రోడ్లపైకి ఉప్పెనలా కదిలిన యువతరం ఇప్పుడు మౌన ప్రేక్షక పాత్రకు ఎందుకు పరిమితమవుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో తెలంగాణ యువత నాడిని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే యువతరానిదొక ప్రత్యేక అధ్యాయం. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాల నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం వరకు విద్యార్థులు పోషించిన పాత్ర అసాధారణమైనది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణాలు రాజకీయ చైతన్యానికి, సామాజిక పరివర్తనకు వేదికలయ్యాయి. పుస్తకాలు పట్టాల్సిన చేతులు జెండాలు పట్టాయి. భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులోనే కొందరు యువకులు తమ జీవితాలను ఉద్యమాలకు అంకితం చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడని తరం అది. ప్రాంతీయ ఆత్మగౌరవం, ఉపాధి అవకాశాలు, నీళ్లు, నిధులు, నియామకాలపై ఆగ్రహం యువతను ఏకం చేశాయి. అలాంటి నేలపై నేటి యువతలో కనిపిస్తున్న నిశ్శబ్దం సహజమైన పరిణామమా? లేక వ్యవస్థలో వచ్చిన మార్పులకు సంకేతమా?
యువత నిస్తేజానికి రాజకీయ నైరాశ్యం ప్రధాన కారణాల్లో ఒకటి కావచ్చు. ఉద్యమాలు అధికార మార్పిడికి దోహదపడినా, అవి ఆశించిన సామాజిక మార్పును తీసుకురాలేదనే భావన యువతలో బలపడితే పోరాట స్ఫూర్తి క్రమంగా క్షీణిస్తుంది. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తరువాత కనిపించే ఆచరణ మధ్య అంతరం పెరిగినప్పుడు రాజకీయాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది. పార్టీలు మారినా పాలనా పద్ధతులు మారడం లేదనే అభిప్రాయం ఏర్పడితే ఎవరి కోసం పోరాడాలనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కన్నా అధికార సాధన, వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలకే రాజకీయాలు పరిమితమయ్యాయని యువత భావిస్తే, వారి దూరం మరింత పెరుగుతుంది. అయితే ఈ నైరాశ్యాన్ని రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోవడంగా మాత్రమే చూడలేం. వ్యవస్థను మార్చగలమనే నమ్మకం కోల్పోవడం కూడా దానికి కారణం కావచ్చు.
మరోవైపు కెరీరిజం యువత జీవితాలను బలంగా ప్రభావితం చేస్తోంది. పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామకాలు, ప్రైవేటు రంగంలో అవకాశాలు, విదేశీ విద్య, అధిక వేతనాల ఆకర్షణ మధ్య యువత తన భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికే ప్రాధాన్యమిస్తోంది. కుటుంబాల ఆర్థిక ఒత్తిళ్లు, నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం యువతను మరింత వ్యక్తిగత ప్రయోజనాలవైపు నెడుతున్నాయి. ఒకప్పుడు ఉద్యమంలో పాల్గొనడం సామాజిక బాధ్యతగా భావిస్తే, ఇప్పుడు దానివల్ల చదువు దెబ్బతింటుందా, ఉద్యోగావకాశాలు తగ్గుతాయా, పోలీసు కేసులు ఎదురవుతాయా అనే లెక్కలు ముందుకొస్తున్నాయి. ఇందులో యువతను మాత్రమే తప్పుపట్టడం సరికాదు. స్థిరమైన ఉపాధి కల్పించలేని వ్యవస్థ, సామాజిక భద్రత లేని కుటుంబ పరిస్థితులు కూడా ఈ మనస్తత్వానికి కారణమే. బతుకుదెరువు కోసం పోరాడుతున్న యువకుడిని ప్రజా ఉద్యమంలోకి రమ్మని పిలిచే ముందు అతడి అభద్రతను కూడా అర్థం చేసుకోవాలి.
“తెలంగాణ సాధన ఉద్యమం యువతకు ఒక చారిత్రక బాధ్యతను అప్పగించింది. ఆ బాధ్యతను గత వైభవంగా మాత్రమే చెప్పుకుంటూ వర్తమానంలో మౌనంగా ఉండిపోతే చరిత్ర స్ఫూర్తి నినాదాలకే పరిమితమవుతుంది. ఉద్యమాలు ఎప్పుడూ ఒకే రూపంలో ఉండవు; కానీ అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం మాత్రం సజీవంగా ఉండాలి. తెలంగాణ యువతలో నిస్తేజం శాశ్వతం కాకూడదంటే, నిరాశకు కారణమైన వ్యవస్థలను ప్రశ్నించడంతోపాటు మార్పు సాధ్యమేననే నమ్మకాన్ని కూడా మళ్లీ ప్రోధి చేసుకోవాలి..”
ఇదే సమయంలో సౌకర్యవాదం, వ్యక్తిగత విజయమే జీవిత లక్ష్యమనే భావన కూడా పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, పోస్టులు పెట్టడం, ప్రభుత్వాలను విమర్శించడం సులభమైంది. కానీ ఒక సమస్య కోసం నిరంతరం పనిచేయడం, వీధుల్లోకి రావడం, అరెస్టులకు సిద్ధపడడం వేరు. డిజిటల్ ఆగ్రహం క్షణాల్లో వ్యక్తమవుతుంది; క్షేత్రస్థాయి పోరాటం మాత్రం సమయం, శ్రమ, త్యాగాన్ని కోరుతుంది. తెరపై వేలాది మంది మద్దతు కనిపించినా, ఆచరణలో కొద్దిమందే ముందుకు రావడానికి ఇదొక కారణం. అయినప్పటికీ సామాజిక మాధ్యమాలను పూర్తిగా తక్కువ అంచనా వేయలేం. వాటిని ప్రజా సమస్యలపై సమాచారాన్ని పంచుకోవడానికి, యువతను సమీకరించడానికి, ఉద్యమాలకు దిశానిర్దేశం చేయడానికి ఉపయోగించగలిగితే అవే శక్తిమంతమైన సాధనాలవుతాయి.
విప్లవ కార్యాచరణకు సంబంధించి కూడా తెలంగాణ యువతలో వచ్చిన మార్పును విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు సామాజిక అసమానతలు, భూస్వామ్య దోపిడీ, కులవివక్ష, కార్మికుల హక్కుల ఉల్లంఘన, ప్రభుత్వ అణచివేత వంటి అంశాలపై యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించిన విప్లవ భావజాలం నేడు ఎందుకు అంతటి ప్రభావాన్ని చూపడం లేదు? విప్లవం అంటే కేవలం ఆయుధాలు పట్టడం, రాజ్యాధికారాన్ని సవాలు చేయడం మాత్రమే కాదు; అన్యాయానికి మూలమైన వ్యవస్థలను ప్రశ్నించడం, అణగారిన వర్గాలకు అండగా నిలవడం, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం కూడా విప్లవ కార్యాచరణలో భాగమే. ఒకప్పుడు గ్రామీణ పేదరికం, భూమి సమస్యలు యువతను ఉద్యమాలవైపు నడిపిస్తే, నేడు నిరుద్యోగం, విద్యా వ్యాపారీకరణ, కాంట్రాక్టు ఉద్యోగాల అభద్రత, రైతుల సంక్షోభం, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు కొత్త తరహా ప్రతిఘటనకు పునాదులు కావాల్సి ఉంది. కానీ విప్లవ భావజాలానికి, ప్రజల దైనందిన సమస్యలకు మధ్య సంబంధం బలహీనపడటం, సిద్ధాంతపరమైన చర్చలు పరిమిత వర్గాలకే పరిమితం కావడం, యువత ఆకాంక్షలకు అనుగుణమైన ప్రజాస్వామిక కార్యాచరణ రూపుదిద్దుకోకపోవడం ఈ దూరానికి కారణాలై ఉండవచ్చు. మార్పు కోసం తపనను హింసాత్మక మార్గాలకు పరిమితం చేయకుండా, ప్రజాస్వామిక ఉద్యమాలు, కార్మిక సంఘీభావం, విద్యార్థి సమీకరణ, సామాజిక న్యాయ పోరాటాలు, రాజ్యాంగబద్ధ నిరసనల ద్వారా కార్యరూపంలోకి తీసుకురావడం నేటి అవసరం. విప్లవం పట్ల ఆసక్తి తగ్గిపోయిందా, లేక విప్లవానికి అవసరమైన సామాజిక పరిస్థితులు కొత్త రూపంలో మన ముందున్నా వాటిని గుర్తించే రాజకీయ దృష్టి కొరవడిందా? తెలంగాణ జెన్ జీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ప్రశ్న ఇదే.
ఎస్ఐఆర్ అంశం ఈ పరిస్థితిని మరింత స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. వోటు అనేది కేవలం ఎన్నికల రోజున ఉపయోగించే హక్కు కాదు; ప్రజాస్వామ్యంలో పౌరుడి ఉనికిని గుర్తించే ప్రాథమిక సాధనం. అర్హులైన వోటర్ల పేర్లు తొలగిపోతే వారి రాజకీయ ప్రాతినిధ్యమే ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా వలస కార్మికులు, పేదలు, చిరునామాలు మారిన కుటుంబాలు, అణగారిన వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల వోటర్ల జాబితాల సవరణలో పారదర్శకత, అభ్యంతరాలు తెలిపే అవకాశం, తొలగింపులకు స్పష్టమైన కారణాలు అత్యంత అవసరం. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ అంశంపై రాజకీయ పార్టీలు, పౌరసంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. అయితే తెలంగాణలో అదే స్థాయిలో యువత కదలకపోవడానికి స్థానిక స్థాయిలో సమస్య తీవ్రతపై అవగాహన లోపం, విశ్వసనీయమైన సమాచార కొరత, రాజకీయ పార్టీల మధ్య సమన్వయ లేమి కారణాలై ఉండవచ్చు.
తెలంగాణలో వోట్లు తొలగించారనే ఆరోపణలు ఎక్కడైనా వినిపిస్తే వాటిని రాజకీయ నినాదాలకే పరిమితం చేయకుండా ఆధారాలతో పరిశీలించాలి. ఎంతమంది అర్హులైన వోటర్ల పేర్లు తొలగించబడ్డాయి? ఏ ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంది? తొలగింపులకు కారణాలేమిటి? బాధితులు తిరిగి తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఎలాంటి సహాయం అవసరం? ఈ ప్రశ్నలకు సమాధానాలు సేకరించకుండా ఉద్యమాన్ని నిర్మించడం కష్టం. వోటు హక్కు పరిరక్షణను పార్టీ ప్రయోజనాలకే పరిమితం చేస్తే యువతలో విశ్వసనీయత పెరగదు. రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పౌరుడి వోటును కాపాడాలనే విస్తృత లక్ష్యం ముందుండాలి. ఎన్నికల కమిషన్ స్వతంత్రత, జవాబుదారీతనం, వోటర్ల జాబితాల విశ్వసనీయతపై చర్చ కూడా వాస్తవాల ఆధారంగా సాగాలి.
మరో ముఖ్యమైన అంశం నాయకత్వం. తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులకు స్పష్టమైన లక్ష్యం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ఉమ్మడి భావన వారిని ఏకం చేసింది. నేడు నిరుద్యోగం, విద్యా ప్రమాణాలు, పరీక్షల నిర్వహణ, ఫీజుల భారం, పర్యావరణం, డిజిటల్ గోప్యత, ప్రజాస్వామ్య హక్కులు వంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని కలిపే సమగ్రమైన యువజన వేదికలు బలహీనంగా కనిపిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా మాత్రమే మిగిలిపోతే స్వతంత్రంగా ప్రశ్నించే సామర్థ్యం తగ్గుతుంది. యువతకు ఉపన్యాసాలు ఇవ్వడం కంటే వారి సమస్యలను వినే నాయకత్వం అవసరం. ఆగ్రహాన్ని వోట్లుగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే రాజకీయాలకు బదులుగా, యువతలో ప్రజాస్వామిక విలువలను పెంపొందించే ప్రయత్నాలు జరగాలి.
అయితే నేటి యువత మౌనాన్ని పూర్తిగా చేతగానితనంగా భావించడం కూడా పొరపాటే. ఉద్యమాల రూపం మారుతోంది. పాత తరానికి వీధి పోరాటం ప్రధాన సాధనమైతే, నేటి తరానికి సమాచార సేకరణ, న్యాయపోరాటం, ఆన్లైన్ ప్రచారం, స్థానిక సమస్యలపై సామూహిక చర్యలు కూడా మార్గాలవుతున్నాయి. వాటిని ఉద్యమాలుగా గుర్తించాలంటే వాటి ప్రభావాన్ని పరిశీలించాలి. అదే సమయంలో తెరమీద స్పందన ప్రజా జీవితంలో మార్పును తీసుకురాకపోతే దానికి పరిమితులు ఉన్నాయని అంగీకరించాలి. ప్రశ్నించడం, సంఘటితం కావడం, నిరంతరంగా పనిచేయడం అనే మూడు లక్షణాలు కలిసినప్పుడే యువత చైతన్యం సమాజాన్ని కదిలించగలదు.
తెలంగాణ జెన్ జీకి ఇప్పుడు అవసరమైనది మరో రాజకీయ నినాదం కాదు; తమ భవిష్యత్తుపై తిరిగి విశ్వాసం. ప్రజాస్వామ్యం తమకు దూరమైన వ్యవస్థ కాదని, దాని దిశను మార్చగల శక్తి తమ చేతుల్లోనూ ఉందని యువత గుర్తించాలి. వోటు హక్కు పరిరక్షణ నుంచి ఉపాధి హామీ వరకు, విశ్వవిద్యాలయాల స్వేచ్ఛ నుంచి పాలనా పారదర్శకత వరకు ప్రతి సమస్యపై వాస్తవాలను తెలుసుకుని ప్రశ్నించాలి. అదే సమయంలో రాజకీయ పార్టీలు యువతను జనసమీకరణకు ఉపయోగించుకునే వనరుగా కాకుండా స్వతంత్ర ఆలోచన కలిగిన పౌరులుగా గౌరవించాలి. తెలంగాణ సాధన ఉద్యమం యువతకు ఒక చారిత్రక బాధ్యతను అప్పగించింది. ఆ బాధ్యతను గత వైభవంగా మాత్రమే చెప్పుకుంటూ వర్తమానంలో మౌనంగా ఉండిపోతే చరిత్ర స్ఫూర్తి నినాదాలకే పరిమితమవుతుంది. ఉద్యమాలు ఎప్పుడూ ఒకే రూపంలో ఉండవు; కానీ అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం మాత్రం సజీవంగా ఉండాలి. తెలంగాణ యువతలో నిస్తేజం శాశ్వతం కాకూడదంటే, నిరాశకు కారణమైన వ్యవస్థలను ప్రశ్నించడంతోపాటు మార్పు సాధ్యమేననే నమ్మకాన్ని కూడా మళ్లీ ప్రోధి చేసుకోవాలి.
పెండ్యాల కొండల్





