“ఆంక్షల అసలు లక్ష్యం రష్యా యుద్ధ సామర్థ్యాన్ని తగ్గించి, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా ఒత్తిడి తీసుకురావడం. కానీ ఆంక్షల ప్రభావం అమెరికా, భారత్ సహా ఇతర దేశాల ఆర్థిక ప్రయోజనాలపై కూడా పడుతున్నప్పుడు వాటిని యథాతథంగా కొనసాగించడం అంత సులభం కాదు. అందుకే ట్రంప్ సిద్ధాంతపరమైన కఠిన వైఖరి కంటే ప్రయోజనాల ఆధారిత విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇంధన ధరలను నియంత్రించాలన్న ప్రయత్నం.. రష్యాపై ఒత్తిడిని బలహీనపరచకూడదు. భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంటూనే దిగుమతుల వైవిధ్యాన్ని పెంచుకోవాలి. అమెరికా కూడా మిత్రదేశాల ప్రయోజనాలను గౌరవిస్తూ, ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు దోహదపడే స్పష్టమైన విధానాన్ని అనుసరించాలి. లేకపోతే ఆంక్షలు శిక్షించే సాధనాలుగా కాకుండా, అవసరాన్ని బట్టి మార్చుకునే రాజకీయ ఆయుధాలుగా మాత్రమే మిగిలిపోతాయి..”
రష్యాపై ఆంక్షలు వెనక్కి తీసుకోవడం ట్రంప్ నిర్ణయంపై పలు సందేహాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి… నా నిర్ణయం వెనుక అసలు అర్థం ఎవరికీ తెల్వదని ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేసిండు. దీంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన కఠిన ఆంక్షల చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రష్యా చమురు కొనుగోలు చేసే భారత్ లాంటి దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశానికి కూడా అమెరికా తెరదించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆర్థిక ప్రయోజనాలతోపాటు వ్యూహాత్మక లెక్కలూ కనిపిస్తున్నాయి. రష్యాను శిక్షించాలన్న లక్ష్యం కంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలే ప్రస్తుతానికి ముఖ్యమయ్యాయా? భారత్‌తో సంబంధాలను దెబ్బతీయకుండా ఒత్తిడిని కొనసాగించడమే అమెరికా అసలు వ్యూహమా?
రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన లిండ్సే గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్-2026కు ట్రంప్ సెప్టెంబరు 18న ఆమోదం తెలిపారు. రష్యా ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. అయితే, అక్టోబరు 16న జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా చట్టంలోని కీలక ఆంక్షలు, సుంకాల అమలుకు మినహాయింపు ఇచ్చిండ్రు.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్షుడికి ఉన్న అధికారాలను ఇందుకు వినియోగించిండ్రు. ఈ పరిణామం భారత్‌కు తక్షణ ఊరటనిచ్చింది. అయితే, ఇది రష్యాపై ఇప్పటికే ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేసినట్లు కాదు. కొత్త చట్టం కింద ప్రతిపాదించిన చర్యల అమలును నిలిపివేయడమే ప్రధానాంశం. భవిష్యత్తులో పరిస్థితులను సమీక్షించి మళ్లీ చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా అమెరికాకు ఉంది.
అమెరికా నిర్ణయం వెనుక ప్రధాన కారణాల్లో ఇంధన మార్కెట్లపై ఒత్తిడి ఒకటి. అంతర్జాతీయంగా చమురు, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు, ద్రవ్యోల్బణం పెరుగుతాయి. దాని ప్రభావం అమెరికా వినియోగదారులపైనా పడుతుంది. ముఖ్యంగా మధ్యంతర ఎన్నికలు వస్తున్న వేళ ఇంధన ధరల పెరుగుదల ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా, ఇబ్బందికరంగా మారతాయి. రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తే సరఫరా వ్యవస్థ దెబ్బతిని ధరలు మరింత పెరిగే ప్రమాదముంది. అందుకే ఆంక్షల విషయంలో ఆచరణాత్మక వైఖరిని అనుసరించడం ద్వారా దేశీయ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ మినహాయింపు ఒక్కటే చమురు ధరలను తగ్గిస్తుందని చెప్పలేం. అంతర్జాతీయ సరఫరా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఉత్పత్తి నిర్ణయాలు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి.
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. తక్కువ ధరకు ముడిచమురు లభించడం భారత ఇంధన భద్రతకు, దిగుమతి వ్యయాల నియంత్రణకు ఉపయోగపడుతుంది. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ సుంకాలు విధిస్తే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినడమే కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడే అవకాశముంది. అమెరికా కూడా భారత్‌ను కీలక వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తోంది కాబట్టి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయాలన్న అమెరికా లక్ష్యంలో భారత్ పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో చమురు కొనుగోళ్ల అంశంపై తీవ్ర ఘర్షణకు బదులుగా, అవసరమైనప్పుడు ఒత్తిడి.. లేనప్పుడు వెసులుబాటు అనే విధానాన్ని ట్రంప్ అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుత మినహాయింపు భారత్‌కు ఉపశమనం కలిగించినప్పటికీ, భవిష్యత్తులో అమెరికా ఒత్తిడి పూర్తిగా తొలగిపోయిందని భావించడం సరికాదు.
ఆంక్షల మినహాయింపు వల్ల రష్యా చమురు ఎగుమతులకు డిమాండ్ కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా మాస్కోకు ఆదాయం లభించి, ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యానికి పరోక్షంగా ఉపయోగపడొచ్చు. అందుకే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మరోవైపు, అమెరికా తన ఆంక్షల సాధనాన్ని పూర్తిగా వదులుకోలేదు. ఏ దేశంపై ఎప్పుడు, ఎంత మేరకు ఒత్తిడి పెంచాలి, ఎప్పుడు మినహాయింపు ఇవ్వాలి అన్న నిర్ణయాధికారాన్ని తన చేతుల్లోనే ఉంచుకుంది. ఇదే ఈ వ్యవహారంలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనం. అయితే, ఇలాంటి అనిశ్చిత వైఖరి మిత్రదేశాల్లో అమెరికాపై సందేహాలను పెంచే ప్రమాదమూ ఉంది
ఆంక్షల అసలు లక్ష్యం రష్యా యుద్ధ సామర్థ్యాన్ని తగ్గించి, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా ఒత్తిడి తీసుకురావడం. కానీ ఆంక్షల ప్రభావం అమెరికా, భారత్ సహా ఇతర దేశాల ఆర్థిక ప్రయోజనాలపై కూడా పడుతున్నప్పుడు వాటిని యథాతథంగా కొనసాగించడం అంత సులభం కాదు. అందుకే ట్రంప్ సిద్ధాంతపరమైన కఠిన వైఖరి కంటే ప్రయోజనాల ఆధారిత విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇంధన ధరలను నియంత్రించాలన్న ప్రయత్నం.. రష్యాపై ఒత్తిడిని బలహీనపరచకూడదు. భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంటూనే దిగుమతుల వైవిధ్యాన్ని పెంచుకోవాలి. అమెరికా కూడా మిత్రదేశాల ప్రయోజనాలను గౌరవిస్తూ, ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు దోహదపడే స్పష్టమైన విధానాన్ని అనుసరించాలి. లేకపోతే ఆంక్షలు శిక్షించే సాధనాలుగా కాకుండా, అవసరాన్ని బట్టి మార్చుకునే రాజకీయ ఆయుధాలుగా మాత్రమే మిగిలిపోతాయి…
పట్ట. హరి ప్రసాద్,
ఫోన్: 8790843009





