ముగ్గురు విద్యార్థుల దుర్మరణంతో చర్యలు
న్యూదిల్లీ,జూలై 29: కాలువలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలపై దిల్లీ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలు చేపట్టింది. దేశ రాజధానిలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లో వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడా లను, పాత్‌వేలను బుల్డోజర్‌తో కూల్చివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల వరద నీరు డ్రైనేజీలోకి వెళ్లకుండా రహదారులపై నిలుస్తుందని తెలిపారు.
భారీగా వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రమాదాలను నివారించడానికి ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ బుల్డోజర్ చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ డియాలో వైరల్‌గా మారుతు ండడంతో నెటిజన్లు మున్సిపల్ అధికారులను విమర్శిస్తున్నారు. ’ఈ పనులేవో ముందే చేస్తే విద్యార్థుల ప్రాణాలు పోయేవి కావు కదా.. ఏమైనా జరిగితేనే కళ్లు తెరుచుకుంటాయా?’ అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు.
మరో నెటిజన్ స్పందిస్తూ.. ’డ్రైనేజీ సమస్యలపై ఇంత ఆలస్యంగా చర్యలు తీసుకుంటారా?.. ఇవన్నీ ఏదో పేరు కోసం చేస్తున్న చర్యలు.. కొద్ది రోజులు పోతే మళ్లీ సమస్యలు పునరావృతం అవుతాయి’ అంటూ విమర్శించారు. శనివారం సాయంత్రం రావూస్ స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు విద్యార్థులు తాన్యా సోని, శ్రేయా యాదవ్, నవిన్ డెల్విన్ ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కోచింగ్ సెంటర్ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే కౌన్సిలర్‌కు తెలియజేశామని, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.