హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 25:డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. డెంగ్యూ నివారణలో భాగంగా వాలంటీర్ గా గుర్తించిన విద్యార్థులకు ఫిల్మ్ క్లబ్ వెంకటేశ్వర కాలనీ లో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… వాలంటీర్లుగా గుర్తించిన విద్యార్థులు తమ తమ కాలనీలలో డెంగ్యూ వ్యాధి రాకుండా పూర్తిగా అవగాహన కల్పించాలని అన్నారు. డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని పేర్కొన్నారు..
ఇంట్లో, ఇంటి చుట్టూ ఉన్న పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మిత్రులకూ కాలనీవాసులకు అవగాహన కల్పించాలని మేయర్ సూచించారు.ఇంటిలో పురాతన కూలర్లు, టైర్లు, మొక్కల కుండీలో నీరు నిలవకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించే విధంగా కాలనీవాసులకు వాలంటీర్లు అవగాహన కల్పించాలని మేయర్ విద్యార్థులకు సూచించారు.పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా ప్రార్థన సమయంలో పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరించాలన్నారు. నిలిచిన నీరులో దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని నీరు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఈ విషయంలో దోమల వ్యాప్తి నివారణకు జిహెచ్‌ఎంసి పెద్ద యెత్తున విస్తృత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వా మ్యంతోనే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని భావించి భావితరాల వారికి ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు ప్రదర్శన ద్వారా వాలంటీర్లకు వివరించారు.ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి సీనియర్ ఎంటమాలజీ లు తదితరులు పాల్గొన్నారు.