ఆర్ధిక మూలాలపైనా ఆరా తీయాలి!

పారదర్శకతకు దూరంగా రాజకీయ పార్టీలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆయా పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. విధానాలను రూపొందిస్తారు. పాలనను అందించడానికి, సామాన్యుల జీవితాలను మెరుగుపర్చడానికి బాధ్యత వహిస్తారు. రాజకీయ పార్టీలకు వోటర్లను చేరుకోవడానికి, వారి లక్ష్యాలను, విధానాలను వివరించడానికి, ప్రజల నుండి వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు డబ్బు అవసరమవుతుంది. కానీ వారు తాము నిధులను ఎక్కడి నుండి సేకరిస్తున్నారో సామన్యులకు అంతు చిక్కదు. ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసే ఆదాయపన్ను రిటర్న్స్‌, వివరాల ప్రకటనలు విశ్లేషణల మూలాలు ఎక్కువగా తెలియవు. ఆ వివరాలు ఎందుకులే అని సామాన్యులు అనుకుంటారు.

ప్రజలు ఏదో ఒక విషయమై ఆకర్షితులై, నమ్మి వోట్లు వేస్తారు, తీరా రాజకీయ పార్టీలు అధికారంలోకి వొచ్చాక, తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటాయి. తమ భవిష్యత్‌ ఎన్నికలకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకుంటాయి. అంతవరకూ అనేక అక్రమాలకు పాల్పడిన పార్టీలు సత్యవాఖ్యాలను పలుకుతాయి. ఎన్నికల సమయం వచ్చే వరకూ రాజకీయ పార్టీలు అరాచకాలను ప్రజలు భరించాల్సిందే, వారు తీసుకునే నిర్ణయాలు, చేస్తున్న అప్పులు, ఇష్టారాజ్యంగా అమలు చేసే సంక్షేమ పథకాలు, విచ్చలవిడిగా చేసే దుబారా ఖర్చులు అన్నీ చూడాల్సిందే, ఎన్నికల సమయం వొచ్చే సరికి ఏదో ఒక సెంటిమెంట్‌తో మళ్లీ ప్రజలు తమ వోటు హక్కును వినియోగించుకుంటారు. అక్కడి నుండి మళ్లీ ‘రాజకీయ చిత్రం’ మొదలు. ఇలా  దశాబ్దాలు గడిచిపోయాయి, ఎన్నికల కోసం ఎదురుచూడటమే సగటు భారతీయుడి వంతైంది.

ప్రస్తుతం రాజకీయ పార్టీలు 50 రూపాయిలు కన్నా తక్కువ ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల పేర్లు వెల్లడిరచాల్సిన అవసరం లేదు. 20వేలు లేదా ఎలక్ట్రోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించినపుడు వారి వివరాలను కూడా తెలుసుకోవడం సాధ్యం కాదు. 2013 సీఐసీ తీర్పు ద్వారా జాతీయ రాజకీయ పార్టీలు ఆర్టీఐ కిందకు వచ్చినా ఇంకా ఆ నిర్ణయాన్ని పార్టీలు పాటించడం లేదు. పూర్తి పారదర్శకతకు దూరంగా ఉండటం దురదృష్టకరమే. ప్రస్తుత చట్టాలు అందుకు సహకరించడం లేదు, అయితే ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని పొందే వీలుంది. 2004 నుండి 2019 మధ్య జాతీయ రాజకీయ పార్టీలకు ‘తెలియని మూలాల’ నుండి 11,234.12 కోట్లు అందింది. ఇదో దిగ్భ్రాంతికర అంశం. ఇంత డబ్బు ఎవరు ఇచ్చారు? ఎందుకిచ్చారు ఇది సగటు భారతీయుడికి తెలియాల్సిన అవసరం లేదా ? అసోసియేషన్‌ ఫర్‌ డెముక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ జరిపిన విశ్లేషణలో ఈ సమాచారం వెలుగు చూసింది.

మనం విశ్లేషించుకోవల్సిందేనా? అసలు రాజకీయపార్టీలకు జవాబుదారీతనం లేదా? రాజకీయ పార్టీలకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి… ఎవరు ఇస్తున్నారు… వారికి ఆ డబ్బు ఎక్కడిది? నిధుల సేకరణ, నిర్వహణ, హామీలు, అమలు తీరును ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదా? ఇష్టానుసారం రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ హామీలను గుప్పించి , అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తే ప్రజలు ఏం చేయాలి? మరో ఐదేళ్లు భరించి తర్వాత వారిని ఇంటికి పంపించడమేనా మరో మార్గం ఉందా? రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తే రాజకీయ పార్టీల తీరుపై చట్టపరమైన చర్యలకు సామాన్యులకు అధికారం దక్కుతుంది కదా… ఎన్నికల్లో గెలిపించడం, ఓడిరచడం అనే రెండు అస్త్రాలను మాత్రమే సిద్ధంగా ఉంచుకున్న వోటర్లకు రానున్న రోజుల్లో సమాచార హక్కు పాశుపతాస్త్రం చేతికి వస్తే రాజకీయపార్టీలు గాడిన పడతాయా?

ఎన్నికలు జరిగినపుడు రాజకీయ పార్టీలు, నాయకుల గురించి విస్తృతంగా చర్చిస్తున్న భారతీయులు, ఎన్నికలు ముగిసిన తర్వాత వారి తీరుతెన్నులపై ఎలాంటి చర్చలకు అవకాశం ఉండటం లేదు, నాయకులు తమ పని తాము చేసుకుంటున్నారు, చివరికి నాయకులు ఏమీ చేయలేదనే నిందలు వేయడం వినా సామాన్యులు చేసేది ఏమీ ఉండటం లేదు. గ్రామాల్లో నాయకులను నిలదీసే శక్తి సామర్ధ్యాలు లేక మరోసారి రాబోయే ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజావాజ్య పిటీషన్‌ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆయన బాధ్యులను చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951లోని సెక్షన్‌ 29ఏ కింద రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రస్తుతం గుర్తిస్తోంది. అలా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం -2005లోని సెక్షన్‌ 2(హెచ్‌) కింద పబ్లిక్‌ అథారిటీగా గుర్తించాలనేది ఈ ప్రజావాజ్య పిటీషన్‌ ఉద్ధేశ్యం.

గుర్తింపు పొందిన , గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు అన్నీ సమాచార హక్కు చట్టంలోని నిబంధనలను పాటిస్తూ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆపీసర్‌ను, అప్పిలెట్‌ అథారిటీని నియమించాలి, తద్వారా సామాన్యులకు ఆయా రాజకీయ పార్టీల కార్యకలాపాలపై అధీకృతంగా ప్రశ్నించే హక్కు కలుగుతుందని అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ వాదించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పార్టీల ఆర్ధిక స్థితిగతులు, ఖర్చులు, ఎన్నికలు, ఆదాయవనరుల మూలాలు, ఆదాయపన్ను చెల్లింపు తదితర వివరాలు కూడా పొందవొచ్చు, అలా వివరాలను ప్రకటించని పార్టీలను ఎన్నికల కమిషన్‌ రద్దు చేసే అవకాశాన్ని కూడా కల్పించాలని కోరుతున్నారు. రాజకీయ పార్టీలను సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలని ఎంతో కాలంగా ఎన్ని డిమాండ్లు ఉన్నా ఎన్నికల కమిషన్‌ మాత్రం ఉదారంగానే వ్యవహరిస్తూ వస్తోంది.     పార్టీ మారితే అనర్హత వేటు వేసే చట్టాలు ఉండటంతో పార్టీ మారినట్టు చెప్పకుండానే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో మొత్తం ఎన్నికైన వారంతా సమూహంగా వేరే పార్టీలోకి మారుతూ ఫిరాయింపుల చట్టానికే తలవంపులు తెస్తున్నారు.

ఎన్నికైన వ్యక్తి మరో పార్టీలోకి మారిన వెంటనే మిగిలిన సాంకేతిక అంశాలతో సంబంధం లేకుండా వారిని అనర్హులను చేసే నిబంధనలు రావల్సి ఉంది.  కొన్ని రాజకీయ పార్టీలు రిజిస్టర్‌ అయి కార్యకలాపాలు కొనసాగిస్తున్నా గత దశాబ్దంలో ఎక్కడా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయలేదని తేలింది అలాంటి 255 రాజకీయ పార్టీల వ్యవహారంపైనా, ఆర్ధిక మూలాలపైనా ఆరా తీయాలని ఎన్నికల కమిషన్‌ సీబీడీటీని కోరినపుడు దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూశాయి. ఆ పార్టీలకు పెద్ద ఎత్తున విదేశాల నుండి నిధులు వస్తున్నాయి, స్థానికంగా కూడా నిధుల సేకరణ జరుగుతోంది, ఖర్చు చేస్తున్నారు, కానీ అసలు లక్ష్యమైన ఎన్నికల్లో పోటీ మాత్రం చేయడం లేదు. నిజానికి ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్‌ 29సీ కింద రాజకీయ పార్టీలు తాము సేకరిస్తున్న నిధుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు ఒక నివేదిక రూపంలో ఇవ్వాలి. ఎన్నికల్లో ప్రచారానికి ప్రభుత్వ ప్రసార సాధనాల్లో స్లాట్‌లను ఉచితంగా ఇస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల నిర్మాణానికి అతి తక్కువ వ్యయానికే ఖాళీ స్థలాలను ప్రభుత్వాలు ఇస్తున్నాయి.

ఇన్ని ప్రయోజనాలు పొందుతున్నా పార్టీల తీరు మాత్రం మారడం లేదు. సామాన్యుడి ఆకాంక్షలను తీర్చే రాజకీయ పార్టీలు రావాలంటే చట్టాల్లో మార్పులు జరగాలి. సంక్షేమ పథకాలకు ఇచ్చేది ప్రభుత్వ సొమ్మే కదా మనకేమిటి అనే ధోరణికి పార్టీలు చరమాంకం పలికేలా చట్ట నిబంధనలు ఉండాలి. రాజకీయ పార్టీల అదాయంలో చాలా ఎక్కువ శాతం అసలు దాతలను గుర్తించలేం కనుక ఆర్టీఐ కింద ప్రజలందరి పరిశీలనకు దాతలందరి పేర్లు వారి పూర్తి వివరాలూ అందుబాటులోకి తేవాలి. జపాన్‌, నేపాల్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రెజిల్‌, బల్గేరియా, యూఎస్‌, జపాన్‌ దేశాల్లో నిధుల దాతల పేర్లు వెల్లడిస్తారు. ఈసీఐకి ఆదాయపన్నుశాఖకూ అందజేసే పత్రాల్లో పార్టీకి 50 రూపాయిలకు మించి డొనేషన్లు ఇస్తున్న వారి పేర్లు కూడా వెల్లడిరచాల్సిన అవసరం ఉంది.
-సమీర్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page