మే చివరనాటికి 2 బిహెచ్‌కెల కేటాయింపు పూర్తవ్వాలి

– ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు
– సరిహద్దు వివాదాలకు స్వస్తి పలకాలి
– రెవెన్యూ, ఫారెస్టు జాయింట్ సర్వే
– ఉమ్మడి మెదక్, కరీంనగర్ ప్రజాప్రతినిధులతో పొంగులేటి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నా మే నెల చివరి నాటికి లబ్దిదారులను గుర్తించి కేటాయించాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. అసంపూర్తి ఇండ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి తదుపరి అవసరమైన వ్యయాన్ని రూ.5 లక్షల లోపు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందచేస్తామని వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న 2 బిహెచ్‌కెలను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని, ఈ ఇండ్ల నిర్మాణాలకు గ్రీన్ ఛానల్‌లో నిధులు విడుదల చేస్తామని తెలిపారు. హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ రెవెన్యూ, ఫారెస్టు అధికారాలతో రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అసంపూర్తి డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని, విద్యుత్, మంచినీరు, డ్రైనేజి, రోడ్లు వంటి కనీస వసతులు కల్పించాలని, చాలా ఇండ్లలో అనర్హులు ఉన్నారని, వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ తక్షణమే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలని, అర్హులకు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందులో ఎమ్మెల్యేలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. రూ.400 కోట్లతో 2 బిహెచ్‌కె కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు తీసుకుని అక్కడ నివసించని వారి పేర్లు రద్దు చేసి అర్హులైన ఇతరులకు వాటిని మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. 2 బిహెచ్‌కె బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడితే సస్పెండ్‌తో సరిపెట్టనని, సర్వీసు నుంచి తొలగించడానికి కూడా వెనకాడబోమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని, ఎల్-1, ఎల్-2, ఎల్-3 దరఖాస్తు ఇప్పుడు చేశారు, అప్పుడు చేశారనేది ముఖ్యం కాదనీ, పేదరికమే అర్హత.. అర్హులైన వారికి ఇండ్లను ఇవ్వడమే కలెక్టర్ల బాధ్యత అని అన్నారు. మొదటి విడతలో వివిధ కారణాలతో ఇండ్లను నిర్మించుకోని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని సూచించారు. లబ్దిదారుల ముసుగులో ఉచిత ఇసుక పథకం అక్కడక్కడా దుర్వినియోగం అవుతున్నదన్న సమాచారం ఉన్నదని, అర్హులకు ఇసుక అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరానికి దూరంగా 2బిహెచ్‌కె కాలనీలను నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఇష్ట పడటం లేదని, అక్కడ నివసిస్తే తమ జీవనోపాథికి ఇబ్బందికి కలుగుతుందని లబ్దిదారులు వెళ్లడం లేదు.. తీసుకున్న ఇండ్లను అద్దెకు ఇచ్చి నగరంలోనే ఉంటున్నారు.. ఇలాంటి వారిని గుర్తించి, వారి స్థానంలో ఆయా కాలనీలకు సమీపంలో నివసించే వారికి కేటాయించాలన్న ఆలోచన చేస్తున్నామని, దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టామని వెల్లడించారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు

ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడబోమని మంత్రి స్పష్టం చేశారు. భూముల ఆక్రమణలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రెవెన్యూ, ఫారెస్టు విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. శాస్త్రీయ పద్ధతుల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేలు నిర్వహించి స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలని సూచించారు. భూ రికార్డుల్లో పాదర్శకత, ఖచ్చితత్వం తీసుకుని రావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఎక్కడా కలపడం కానీ, తీసివేయడం గానీ లేదన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని, అలాగే ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాలు కూడా నిర్మిస్తున్నామని, వీటికి అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్లకు సూచించారు.

లక్ష్యాల మేరకు ముందుకు సాగాలి : మంత్రి శ్రీధర్‌బాబు

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎట్టి పరిస్థితుల్లోను నిర్దేశించిన లక్ష్యాల మేరకు ముందుకు సాగాలని, దీనిపై కలెక్టర్లు మరింత ఫోకస్ పెట్టాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దిశానిర్దేశం చేశారు. మంజూరైన ప్రతీ ఇల్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలన్నీ పరిష్కారమయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఏటా 3,500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. అటవీ భూములకు సంబంధించిన అంశాలను ఆ శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. అటవీ క్లియరెన్సుల కారణంగా ఇళ్ల నిర్మాణం కుంటుపడటానికి వీలు లేదని స్పష్టం చేశారు. కలెక్షర్లు తమ విచక్షణాధికారాలను ఉపయోగించి అటవీ భూముల పరిహారం వంటి అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్లు నిబంధనల పేరుతో జాప్యం చేయకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. గృహ నిర్మాణాల లక్ష్యాలను చేరుకోలేని అధికారులను ఉపేక్షించేది లేదని శ్రీధర్‌బాబు హెచ్చరించారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, హౌసింగ్ ఎండీ గౌతం, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, కలెక్టర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం

హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో 30 కె.వి. ఉత్పాదన సామర్ధ్యంతో నెలకొల్పిన సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంట్‌ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. దీని ద్వారా నెలకు సుమారు 4500 యూనిట్ల మేర విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. హౌసింగ్ కార్పొరేషన్ భవనంలో వినియోగించే విద్యుత్‌లో ఈ మేరకు ఆదా అవుతుందని ఎండీ గౌతం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *