సబితా ఇంద్రారెడ్డిపై సిఎం తీవ్ర వ్యాఖ్యలు
తమ్ముడని ఆశీర్వదిస్తే అవమానిస్తావా అంటూ సబిత ఆవేదన
అసెంబ్లీలో గందరగోళం
మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్, జూలై 31 : బుధవారం నాటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు చాలా వాడిగా వేడిగా కొనసాగాయి. సభలో ప్రవేశపెట్టిన బిల్లులపై జరుగాల్సిన చర్చ కాస్తా వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. దీంతో సభలో తీవ్ర గందగోళ పరిస్థితి ఏర్పడిరది. బిఆర్‌ఎస్ శాసన సభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు పెద్ద పెట్టున ఆందోళన చేయడంతో సభ ఆర్డర్‌లో లేకుండా పోయింది. అలాగే తనపై చేసిన ఆరోపణలపై తాను సమాధానం చెప్పేందుకు అవకాశమియ్యాల్సిందిగా సబితా ఇంద్రారెడ్డి పదేపదే స్పీకర్‌ను కోరినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకురావడంతో సభను పదిహేను నిమిషాలపాటు వాయిదా వేయాల్సివచ్చింది. తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ బిఆర్‌ఎస్ సభ్యులు తమ పటువీడలేదు. వారికి అవకాశం కల్పిస్తానని చెబుతూనే సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పాస్ అయినట్లు ప్రకటించిన సభాపతి సభను గురువారానికి వాయిదా వేశారు.
ఏడవ రోజు కొనసాగుతున్న తెలంగాణ శాసనసభ సమావేశంలో ద్రవ్యవినిమయ బిల్లుపై బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కెటిఆర్) చర్చిస్తుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలో కల్పించుకుని చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీసాయి. పాలనలో ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని కెటిఆర్ చెప్పినదానిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతనే సభకు రానప్పుడు సహకారం ఉంటుందని తాము ఎలా నమ్మాలంటూనే, మీ వెనుక కూర్చున్న అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారని, వారి మాటలు వింటే కెటిఆర్ జూబ్లీ బస్టాండ్ ముందు కూర్చోవాల్సి వొస్తుందనటంతో సభలో ఉద్రిక్తతకు దారితీసింది. దాంతో బిల్లుపై చర్చ పక్కతోవ పట్టి, వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. ముఖ్యమంత్రి మాటలు తనను ఉద్దేశించి చేసినవేనంటూ సబితా ఇంద్రారెడ్డి దానిపైన తీవ్రంగా స్పందించారు. చాలా కాలంగా సిఎం రేవంత్‌రెడ్డి తనను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడంటూ సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురైనారు. ఇక్కడ ముంచి అక్కడ తేలిందన్న వ్యాఖ్యను ఊటంకిస్తూ తాను ఎవరిని ముంచానో చెప్పాలన్నారు. తన వల్ల ఎవరికి నష్టం జరిగిందో స్పష్టం చేయాలంటూ సిఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తానే రేవంత్‌రెడ్డిని ఆహ్వానించానని, కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పి, ఆ పార్టీ ఆశాకిరణం నువ్వేనని, సిఎం అవుతావంటూ తమ్ముడిగా ఆశీర్వదిస్తే ఒక అక్కగా, ఆడబిడ్డగా తనకిచ్చే గౌరవమిదేనా అంటూ ఆమె జీరబోయిన గొంతుతో, కన్నీటి పర్యంతమై ప్రశ్నించారు. ఇవ్వాళ రేవంత్‌రెడ్డిని ఒక విధంగా సిఎం సీట్లో కూర్చోబెట్టింది తానేనని, ఆయినా ఒక సోదరిగా తనపట్ల ఆయన ఎందుకు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాడో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాను పార్టీ మారినందుకు పలు సందర్భాల్లో ఆయన తనను కించపరిచినట్లు మాట్లాడుతున్నారంటూ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. చాలామంది పార్టీలు మారారని, పార్టీ మారిన వారు కాంగ్రెస్‌లో లేరా అంటూనే ‘ఆ ఇంటిమీది కాకి, ఈ ఇంటి మీద వాలితే కాల్చిపారేస్తా’ అన్నావు. మరి మీ పార్టీలో ఇతర పార్టీల నుంచి వొచ్చిన వాళ్ళను ఏం చేస్తూన్నావంటూ రేవంత్‌రెడ్డిని సభా ముఖంగా నిలదీశారు. దానిపై సిఎం రేవంత్‌రెడ్డి సమాధానమిస్తూ, సబితా ఇంద్రారెడ్డి తనను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అలాగే 2019 నాటి ఎన్నికల్లో తాను మల్కాజిగిరి నుంచి పోటీచేస్తే గెలిపించే బాధ్యత కూడా తనదేనని వాగ్ధానం చేసిన సబితక్క తీరా కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వగానే బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరిందని విమర్శించారు.
అయితే దీనిపై బిఆర్‌ఎస్ నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న దశలోనే రాష్ట్రానికి వొచ్చిన నూతన గవర్నర్ పదవీ బాధ్యతలను చేపడుతున్న కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉందని, వొచ్చిన తర్వాత దాని గురించి మరింత వివరంగా మాట్లాడుతానంటూ ఆయన సభ నుంచి నిష్క్రమించారు. అనంతరం మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా సబితా ఇంద్రారెడ్డిని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు మంచి హోదాగల మంత్రి పదవులిచ్చి, 2014లో కూడా టికెట్ ఇస్తే, పార్టీ మారడాన్ని ఎత్తి చూపుతూ, పార్టీ విడిచి పోవద్దని తాను ప్రాధేయపడినా వినిపించు కోలేదన్నారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ ఏ దళితుడికి ఇవ్వని విధంగా తనకు సిఎల్‌పి, ఎల్‌ఓపిగా బాధ్యతలిస్తే, తన వెనుక ఉండి నడిపించాల్సిందిపోయి పదవుల కోసం పార్టీ మారిందని సబితపై విరుచుకుపడడంతో సభలో మరోసారి గందరగోళ పరిస్థితి ఏర్పడిరది.
దీంతో సభాధ్యక్షుడు పదిహేను నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభంకాగానే తనపై సిఎం, డిప్యూటీ సిఎం ఇద్దరు చేసిన ఆరోపణపై సమాధానం చెప్పేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సబితతోపాటు ఆ పార్టీ ముఖ్యనేత కెటిఆర్, ఇతర ఎంఎల్‌ఏలు ఎంత అరిచినా లాభం లేకుండాపోయింది. ఎంఐఎం పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఆమెను మాట్లాడనివ్వాలని కోరినా సభాధ్యక్షుడు కాంగ్రెస్ శాసన సభ్యుడు వివేక్‌తో మాట్లాడిరచి బిల్లు పాసైనట్లుగా ప్రకటించి, సభను గురువారానికి వాయిదా వేశారు.