భట్టి బడ్జెట్ ఒక రాజకీయ ప్రసంగం
ఆదాయాం చూపకుండా కేటాయింపులు
42 వేల కోట్టు రావాలంటే గల్లీకో బెల్ట్ షాపు పెట్టాలి
బెల్ట్ షాపులు ఎత్తేసి ఆదాయం ఎలా పెంచుకుంటారు
నాడు భూములు అమ్మితే రచ్చ చేసి నేడు ఎలా అమ్ముతారు
రైతు రుణ మాఫీకి మిగిలిన 5 వేల కోట్ల పరిస్థితి ఏమిటి..?
కరెంట్ సరఫరాపై ప్రజలనే అడుగుదాం
అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : అసెంబ్లీలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆదాయం చూపకుండా కేటాయింపులు చేశారని, ఎక్సైజ్ ఆదాయం గతం కన్నా మిన్నగా చూపారని, అభూత కల్పనలతో మసిపూసి మారేడుగాయ చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు. రూ.4.5 లక్షలు లేని జీఎస్డీపీని రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై సాధారణ చర్చను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. పదేండ్ల పాలనలో ఉన్న సమాచారాన్ని తొలగించారని, కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ, ప్రజల మెదడు నుంచి తొలగించలేరని పేర్కొన్నారు.
అక్షరాలను తొలగిస్తారేమో కానీ, అనుభవాల్ని తొలగించలేరన్నారు. బీఆర్ఎస్ శ్రమను, కాంగ్రెస్ ఎనిమిది నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం అవాస్తవాలతో నిండి ఉందని, ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వొస్తుందని బడ్జెట్లో పెట్టారన్నారు. పన్నేతర ఆదాయంలో రూ.35 వేల కోట్లు వొస్తుందని చూపించారని ఎలా వొస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. విధానాల రూపకల్పన కంటే బీఆర్ఎస్ను తిట్టడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారన్నారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు విమర్శించారని, ఇప్పుడు రూ.10 వేల కోట్ల విలువ చేసే భూములు అమ్మి నిధులు సవిూకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటపై గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సాధ్యంకాని తరహాలో ఆదాయం ఎక్కువ చూపించారని, తప్పనిసరి ఖర్చులను తక్కువ చేసి చూపించారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారని, బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే వొస్తున్నదని, ఆలస్యం అయిందని రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం ఆలస్యం చేసిన వడ్డీ భారాన్ని రైతులపై మోపుతున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 వందల పింఛన్ ఇస్తే బీఆర్ఎస్ పాలనలో రూ.2వేలకు పెంచామని తెలిపారు. అధికారంలోకి రాకముందు రూ.4 వేలు పింఛన్ ఇస్తామన్నారని, ఆ 4 వేల పింఛన్ ఇంకా నాలుక విూదనే ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది అబద్ధాల బ్జడెట్ అని, రూ. 18,228 కోట్లు ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్టేష్రన్స్ ద్వారా ఎలా వొస్తుందని బిఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. ఆదాయం ఎలా పెంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖను చూస్తే కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 2023`24లో ఎక్సైజ్ ప్రతిపాదిత ఆదాయం రూ. 19,884 కోట్లు కాగా..ఇప్పుడు రూ. 25,617 కోట్లు పెట్టారని, పోయిన సంవత్సరం కంటే రూ. 7,773 కోట్లు అదనపు ఆదాయం వొస్తుందని ప్రభుత్వం చెబుతుందని, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ. 42 వేల కోట్లు రావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టాలని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట చెబుతుందని దుయ్యబట్టారు. ప్రజలను పీల్చి పిప్పి చేసి ఆదాయం రాబడతమని మంత్రి జూపల్లి ఒప్పుకున్నారంటూ..ఎక్సైజ్ విధానంపై తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికలప్పుడు బెల్ట్ షాపులు ఎత్తేస్తమని చెప్పారని, మరి బెల్ట్ షాపులు ఎత్తేసి ఎలా ఆదాయం పెంచుకుంటారో చెప్పాలన్నారు. నాన్ టాక్స్ రెవెన్యూ గత ఏడాది రూ. 23 వేల కోట్లు వొచ్చిందని, ఈసారి రూ. 35 వేల కోట్లు వొస్తుందని బ్జడెట్లో పెట్టారని అన్నారు.
రైతు రుణాల కోసం తాము భూములు అమ్మామని ఆనాడు రేవంత్, భట్టి, శ్రీధర్ బాబు రచ్చ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ..ఇప్పుడు రూ. 10 వేల కోట్లు భూములు అమ్మి ఆదాయం సమకూర్చుంటామని చెప్పడం వారి ద్వంద్వ వైఖరి కాదా..అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. రూ. 14 వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబులైజేషన్ అన్నారని, ఆ బ్రహ్మ పదార్థం ఏంటి..అదెలా వొస్తుందనేది చెప్పాలన్నారు. రుణమాఫీకి బడ్జెట్లో రూ. 25 వేల కోట్లు మాత్రమే పెట్టారని, మరి మిగిలిన రూ. 5 వేల కోట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆలస్యం చేసిందని, వారు ఆలస్యం చేయడం వల్ల వొచ్చిన వడ్డీని రైతులు ఎందుకు కట్టాలని హరీష్ రావు ప్రశ్నించారు. నర్సాపూర్ నియోజక వర్గం కొత్తపేట గ్రామంలో సాధి ఆంజనేయులు అనే రైతుకు రూ. 90,575 అప్పు ఉందని, ఆయనకు డిసెంబర్ 9 తర్వాత నుంచి ఇప్పటి వరకు అయిన వడ్డీ కడితేనే రుణమాఫీ చేశారన్నారు. రూ. 72 వేల కోట్ల అప్పులు తాము అధికారంలోకి వొచ్చేనాటికి ఉన్నాయని, తాము పదేళ్లలో చేసింది రూ. 4.26 లక్షల కోట్లు కాగా..తాము రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేశామని భట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు హరీష్ రావు. కొరోనా, కేంద్ర విధాన నిర్ణయాల వల్ల రూ. 42 వేల కోట్ల అప్పులు అనివార్యంగా చేయాల్సి వొచ్చిందని, అవి కూడా తీసేస్తే తాము నికరంగా చేసిన అప్పు రూ. 3,86,890 మాత్రమేనని అని హరీష్ రావు వివరించారు.
ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని, ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తే.. అవి ప్రజల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఫీజ్ రీయింబర్స్మెంట్స్, ఆరోగ్య శ్రీ, 108 సేవలను మార్చకుండా అమలు చేశామని హరీష్ రావుమీ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హరీష్ రావు మధ్య సంవాదం నడిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హరీష్ రావు సవాల్ విసిరారు. భట్టి విక్రమార్క వొస్తే.. రాష్ట్రంలో కరెంట్ ఎలా ఉందో అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్ వద్ద నిలబడి.. దారిలో వెళ్లే ప్రజలను అడుగుదామని అన్నారు. కరెంట్ సరఫరా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బాగుందా..8 నెలల కాంగ్రెస్ పాలనలో బాగుందా..అని ప్రజలనే అడుగుదామన్నారు. తమ పార్టీలో ఉండి వెళ్లిన కేకే ఇంటికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వెళ్లినప్పుడు కరెంట్ పోయిందని గుర్తు చేశారు. ఇదే అంశాన్ని అన్ని పత్రికలు ప్రధాన శీర్షికలో ప్రచురించాయని పేర్కొన్నారు. ఇదే క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చురకలంటించారు.
సభలో పదే పదే అడ్డు తగలకుండా ఉంటే బాగుంటుందని చెప్పారు. జూపల్లిని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతూ…ఆయన లిక్కర్ కత, మద్యం లెక్కలు అన్నీ చెప్తానంటూ సెటైర్లు వేశారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడేటప్పుడు తమను టీవీలో చూపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీని చూపించడం లేదని అంటూ..ఇక్కడ తమపైనా అలాగే వివక్ష చూపిస్తున్నారని అన్నారు. కాగా, మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇస్తూ రాహుల్ బాటలో నడవటం కాదని, ఆయన చెప్పినట్లు ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు..సభలో తాను మాట్లాడటానికి సమయం ఇవ్వాలని హరీష్ రావు కోరారు. బడ్జెట్ కంటే ప్రధానమైనది సభకు ఏమీ ఉండదన్నారు. బడ్జెట్‌పై ప్రసంగానికి సమయం ఇవ్వం అంటే ఎలా…అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము చేసిన అప్పులు మాత్రమే చెబుతున్నారని..తాము పెంచిన ఆస్తుల గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
ఇవన్నీ చెప్పడానికి తనకు సమయం కావాలని హరీష్ రావు కోరారు. కాగా బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మేల్యేలు ఉన్నారని, ఆ సంఖ్య ప్రకారం తమకొచ్చే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని హరీష్ రావుకు స్పీకర్ సూచించారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బస్సులు లేని 15 వందల గ్రామాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహాలక్ష్మీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణలో 90 శాతం దొడ్డు వడ్లు పండిస్తారని, దొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలన్నారు. గృహజ్యోతి పథకంలో ఇబ్బందులున్నాయని, యువ వికాసం పథకంపై బ్జడెట్లో అసలు చర్చే లేదన్నారు. చేయూత గురించి ప్రభుత్వం మాటైనా మాట్లాడటం లేదని హరీష్ రావు విమర్శించారు.