బీజేపీలో బీఆర్ఎస్‌ ‌విలీనం తథ్యం

వెంటనే కేసీఆర్‌కు గవర్నర్‌…‌కేటీఆర్‌కు కేంద్ర మంత్రి
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా హరీష్‌ ‌రావు
దిల్లీలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

న్యూదిల్లీ, ఆగస్ట్ 16 : ‌బీఆర్ఎస్‌ ‌పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..తన వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ ‌నేతలు ఖండించినా.. అది ఎప్పటికీ జరుగి తీరుతుందని అన్నారు. విలీనం అయిన వెంటనే కేసీఆర్‌కు గవర్నర్‌ ‌పదవి, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి వొస్తుందని అన్నారు. రాష్ట్రంలో హరీష్‌ ‌రావు ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు. విలీనం, పదవులు రాగానే.. కవితకు నాలుగు రాజ్యసభ సీట్లతో సమానంగా బెయిల్‌ ‌వొస్తుందని వెల్లడించారు. అదే విధంగా బీఆర్ఎస్‌ ‌రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని రేవంత్‌ ‌వ్యాఖ్యానించారు.

కాగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. శుక్రవారం దిల్లీలో ఫాక్స్‌కాన్‌-‌యాపిల్‌ ‌మ్యానుఫ్యాక్చరర్స్ ‌కంపెనీ ప్రతినిధులతో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌ ‌రెడ్డి సొంత దేశంలో వొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

ఫాక్స్‌కాన్‌-‌యాపిల్‌ ‌మాన్యుఫ్యాక్చరర్స్ ‌కంపెనీ ప్రతినిధులతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగంలోని పెద్దలను కూడా కలిశారు. ఇక కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ ‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు సీఎం రేవంత్‌ ‌రెడ్డితో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ ‌చర్చించనున్నారు. వరంగల్‌లో జరిగే రైతు కృతజ్ఞత సభకు రాహుల్‌ ‌గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. రాజీవ్‌ ‌గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రెండు మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌ ‌దిల్లీలోనే ఉండనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *