- అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలి
- సిఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
రాష్ట్రంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని కేంద్రవ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 70లక్షల మంది రైతులుంటే.. ఇప్పటివరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయలేదని చెప్పారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికీ 9 లక్షల 80 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంజయ్ లేఖ రాశారు.‘40 లక్షల కొత్త రేషన్ కార్డులిస్తామని 42,267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదంగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ, నేటికీ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గు చేటు. ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బ్జడెట్‌లో రూ.7 వేల కోట్లకుపైగా కేటాయింపులు చేసినా.. నయా పైసా ఖర్చు చేయకపోవడం దారుణం. ముఖ్యమంత్రే ఇచ్చిన హామీలనే అమలు చేయలేకపోతే.. విూ నేతృత్వంలో పనిచేసే అధికారులు ఏ విధంగా జవాబుదారీతనంతో పని చేయగలరు?. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైంది. ఇకనైనా అర్హులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇళ్లను అందించాలి‘ అని లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు.