దేశానికి గొప్ప విజయం 

ఇస్రో వందో రాకెట్‌ ప్రయోగం స‌క్సెస్‌: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు
ఇస్రో వందో ప్రయోగం విజయవంతంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో వందో రాకెట్‌ ప్రయోగం భారతదేశానికి ఒక గొప్ప విజయమని ప్రశంసించారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌.. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎన్వీఎస్‌-02 ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ అని.. దీంతో మన సైంటిస్టుల ప్రతిభ అని పేర్కొన్నారు. దేశానికి గర్వకారణమైన రోజు ఇవాళ అని హరీశ్‌రావు ప్రశంసించారు.

భారత నావిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ సిరీస్‌లోని ఈ రెండో ఉపగ్రహం కచ్చితమైన పొజిషన్‌, వేగం, టైమింగ్‌తో భారత ఉపఖండం అవతల 1500 కి.మీ పరిధి వరకు యూజర్లకు కచ్చితమైన గమన సూచనలు(నావిగేషన్‌, ముఖ్యంగా నౌకాయానం) అందిస్తుంది. 50.9 మీటర్ల పొడవైన రాకెట్‌ జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌12 మిషన్‌లో ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని గతేడాది మే 29 విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. నేడు నింగిలోకి దూసుకెళ్లిన 2,250 కిలోల బరువైన ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌ను యూఆర్‌ శాటిలైట్‌ కేంద్రంలో రూపొందించి అభివృద్ధి పరిచారు.

ఇందులో రేజింగ్‌ పేలోడ్‌కు అదనంగా ఎల్‌1, ఎల్‌5 నావిగేషన్‌ పేలోడ్లు ఉన్నాయి. ఈ ఉపగ్రహం అందించే నావిగేషన్‌ సమాచారాన్ని గగనతల, భూతల, జల మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. విమానాల నిర్వహణకు, మొబైల్స్‌లో స్థాన ఆధారిత సేవలకు, ఉపగ్రహాల కక్ష్య నిర్ధారణకు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఆధారిత అప్లికేషన్లకు, ఈ ఉపగ్రహపు నావిగేషన్‌ను వాడుకోవచ్చని ఇస్రో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page