కాకా ఆశయాలను ముందుకు తీసుకెళతాం..

  • 95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • మూసీ ప్రక్షాళనపై సీఎం సంచనల వ్యాఖ్యలు
  • మీరు ఫామ్ హౌస్ ల‌లో జమీందారుల్లా ఉంటే..
  • పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా?
  • బిఆర్ఎస్, బిజేపీ నేత‌లపై ఘాటు విమ‌ర్శ‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 5 : తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరని, కాకా పేద‌ల మ‌నిషి అని, పేదోళ్ల‌కు ఆయ‌న ధైర్యమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రవీంద్ర భారతిలో శ‌నివారం దివంగ‌త మాజీ మంత్రి జి.వెంక‌ట‌స్వామి (కాకా) 95వ జయంతి వేడుక‌ ( Venkataswamy Birth Anniversary ) ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్,
ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు, నాగరాజు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఈసంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఉన్నవారు కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూశారో.. లేక ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదు. కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని అధికారులను ఆదేశించాన‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా సోనియమ్మను ఒప్పించారని, ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆనాడు ఎన్నికల్లో గెలిచేందుకు కాకా సహకారం తీసుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించారని తెలిపారు. కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 80వేల మందికి పైగా నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత కాకాది అని కొనియాడారు. ఆనాడు సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచార‌ని, జాతీయ స్థాయిలో నెహ్రూను చాచా అని పిలిస్తే.. రాష్ట్రంలో గడ్డం వెంకటస్వామిని కాకా అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకుంటార‌ని తెలిపారు. జాతీయ కాంగ్రెస్ కార్యాలయానికి తన ఇంటిని ఇచ్చేసిన కాంగ్రెస్ వాది కాకా అని గుర్తుచేశారు. కాకా ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కాకా కుటుంబ సభ్యుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలన్నది పార్టీ ఆలోచన అని తెలిపారు.

మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలకు అండ

మూసీ పరీవాహక ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు.
ప్రభుత్వం మిమ్మల్ని అనాథలను చేయదు.. మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్నవారిని ఆదుకుంటామ‌ని సీఎం భ‌రోసా ఇచ్చారు. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు… ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుంద‌ని, ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకు పేదల ముసుగు అడ్డుపెట్టుకునే వారి మాటలు వినొద్దని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల‌ మంచి కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తోంద‌ని, మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురికావద్దని చెప్పారు. నిర్వాసితుల కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు ఇవ్వండి..

ప్ర‌తిపక్ష నేత‌లు ఈట‌ల రాజేంద‌ర్‌, కేటీఆర్‌, హ‌రీష్ రావుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌లు చేశారు. త‌మ‌ ప్రభుత్వానికి ఎవరిపై కోపం లేదని, ప్రజలకు మేలు చేయడమే త‌మ ఎజెండా అని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వాల‌ని కోరారు. నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారని, మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి? అని ప్ర‌శ్నించారు. కాకా స్పూర్తితో పేదలకు మెరుగైన వసతులు కల్పిద్దామ‌ని,
కేసీఆర్, కేటీఆర్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ లో కొంత భూమిని పేదలకు దానం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మీరు ఫామ్ హౌస్ ల‌లో జమీందారుల్లా బతుకుతారు… పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? అని నిల‌దీశారు.
అవసరమైతే మలక్ పేట్ రేస్ కోర్టును, అంబర్ పేట్ పోలీస్ ఆకాడమీని హైదరాబాద్ బయటకు తరలించి పేదలకు ఇండ్లు కట్టిద్దామ‌న్నారు. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి.. మీ ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదని ధ్వ‌జ‌మెత్తారు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం రూ.11వేల కోట్లు.. నెలరోజుల్లో తాము రూ.18వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామ‌న్నారు. .. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్ ను కలవండి అని రేవంత్ రెడ్డికోరారు. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారని, సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమ‌ని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *