తిరుమల,అక్టోబరు 05: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం ఉదయం చిన్నశేష వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.
శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే కూచిపూడి నృత్యం, కోస్తా ప్రాంతానికి చెందిన ధరణీ కశ్యప్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, ఒడిస్సాకు చెందిన వాసుకీరావ్ బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం, రాజస్థాన్ రాష్టానికి చెందిన రామ్ బృందం ప్రదర్శించిన జాగో కళారూపం భక్తులను ఆకట్టుకున్నాయి.
కర్నాటకకు చెందిన సుజేంద్ర బాబు బృందం ప్రదర్శించిన భరతనాట్యం, బెంగళూరుకు చెందిన అనన్య ప్రదర్శించిన మహావిష్ణు అవతారం రూపకం, మహారాష్ట్రకు చెందిన రాజేశ్వరి బృందం ప్రదర్శించిన సిమి రూపకం, బెంగళూరుకు చెందిన రక్షాకార్తిక్ బృందం ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యం, అనంతపురానికి చెందిన గీతా బృందం ప్రదర్శించిన దాస సంకీర్తన రూపకం, ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి చెందిన అజయ్ బృందం ప్రదర్శించిన గూమర్ సంప్రదాయ కళా నృత్యం అద్భుతంగా ప్రదర్శించారు.
కర్నాటకకు చెందిన పృద్వీ బృందం సుగ్గికునిత నృత్యం, రైల్వే కోడూరు, అనకాపల్లి, తిరుపతి మరియు తిరుమలకు చెందిన కోలాట నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్న శేష వాహన సేవలో ఆంధ్ర రాష్ట్రంతో పాటు కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్ , రాజస్థాన్, ఒరిస్సా, మహారాష్ట్ర, మణిపూర్, పంజాబ్, రాష్ట్రాల నుండి 18 కళా బృందాలు, మొత్తం 472మంది కళాకారులు తమ తమ కళాకృతులతో స్వామి వారిని ఆట, పాటలతో సేవించున్నారు.