పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర హీనులుగా మిలిగిపోతారు.

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • కురుమూర్తి స్వామి ఆలయానికి రూ.110 కోట్ల‌తో ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్

పాల‌మూరు, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10 : పాలమూరు జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించాల‌ని, అంతేగానీ, ప్రాజెక్టులను, జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు. అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరని, చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని సీఎం రేవంత్ హెచ్చ‌రించారు. పేదల తిరుపతిగా ప్ర‌సిద్ధి చెందిన‌ కురుమూర్తి స్వామి ఆలయం (Turumurthi Temple) అభివృద్ధిపై తెలంగాణ స‌ర్కారు ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఈ ఆల‌యానికి తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేర‌కు ఆదివారం కురుమూర్తి స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధి ప‌నుల‌కు అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా అని అలాంటి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమేన‌ని ఆరోపించారు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయని, జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి పాడి పంటలతో విలసిల్లేలా త‌మ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటోంద‌ని తెలిపారు.

నారాయణ్ పేట‌, కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తామ‌న్నారు. మా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నార‌ని, ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించద‌ని, నాపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించాల‌ని, అంతేగానీ, ప్రాజెక్టులను, జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు. అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని హెచ్చ‌రించారు. జిల్లాలో అమరరాజా బ్యాటరీస్ కంపెనీలో 2వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించార‌ని, ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వొచ్చినా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత త‌మ‌ద‌ని భ‌రోసా ఇచ్చారు. జిల్లాలో గ్రామగ్రామానికి, బీటీ రోడ్లు వేసే బాధ్యత త‌మ‌దేన‌ని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు.విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందామ‌న్నారు. కాళ్లల్లో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *