రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులతో సమావేశం
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 15: ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ఘటనల నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెందిన 10 బృందాలు, తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లోని 10 కంపెనీలను వినియోగించి తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదే అంశం పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం సచివాలయంలో డీజీపీ జితేందర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదనల పై చర్చించారని స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . సుమారు 2000 మందితో కూడిన బలమైన బలగాలను ఏర్పాటు చేసెందుకు, అవసరమైన బడ్జెట్ కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారని సి.ఎస్. తెలిపారు.
వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. వొచ్చేనెల మొదటి వారం నుంచి సిబ్బందికి మొదటి బ్యాచ్ శిక్షణను ప్రారంభించాలని ఆమె తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లకు అవసరమైన వాహనాలు, రెస్క్యూ పరికరాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇతర సాధనాల సేకరణ గురించి కూడా సమావేశంలో చర్చించారు.
అవసరమైన పరికరాలు, శిక్షణ అందించడం ద్వారా అగ్నిమాపక శాఖలోని 10 బృందాలను ఎస్‌డిఆర్‌ఎఫ్ స్టేషన్‌లుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు డిజి ఫైర్ సర్వీసెస్ నాగి రెడ్డి తెలిపారు. అదేవిధంగా టి జి ఎస్ పి బెటాలియన్‌ల నుండి మొత్తం 1000 మంది సిబ్బంది (ఒక్కో సంస్థ 100 మంది సిబ్బందితో కూడినది) అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమానంగా శిక్షణ పొందుతారు. ఈ బృందాలను అత్యవసర పరిస్థితిలో సంబంధిత ప్రదేశాలలో అందుబాటులో ఉంచబడతారు. శిక్షణ కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ సేవలను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు.





