అత్యాచారం, హత్య చేశారని తల్లిదండ్రుల ఫిర్యాదు..
కేసు నమోదు చేసిన దర్యాప్టు చేపట్టిన పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్16 : గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్న అంజయ్యనగర్‌లోని ఓ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన విద్యార్థిని (23). హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి వేడుకలను చూసేందుకు రెండు రోజుల క్రితం ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె నగరానికి వచ్చారు. వీరిలో ఓ యువతి, మరో ఇద్దరు యువకులు ఉన్నారు. వీరంతా చిన్న అంజయ్యనగర్‌లోని హోటల్‌లో దిగారు.ఆదివారం రాత్రి భోజనం ముగించుకుని స్నేహితులు బయటకు వెళ్లారు.
తనకు తలనొప్పిగా ఉందని విద్యార్థిని వారి వెంట వెళ్లకుండా హోటల్ గదిలోనే ఉండిపోయింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు స్నేహితులు తిరిగి వచ్చారు. గదికి లోపలి నుంచి గడియ వేసుకుని ఎంతకీ తీయలేదు. హోటల్ సిబ్బందికి చెప్పడంతో వారు మాస్టర్ కీతో తలుపు తీశారు. విద్యార్థిని లోపల ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై గచ్చిబౌలి పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని యువతి తండ్రి తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పారు. ఆమె స్నేహితులు, హోటల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు.