స్థానికంగా ఉన్న వనరులతో స్థానిక యువతను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి. తక్కువ పెట్టుబడులతో పెద్ద మొత్తంలో ఉపాధికి అవకాశాలను అన్వేషించాలి. విదేశీ పెట్టుబుడులు అనగానే ముఖ్యంగా విద్యుత్, నీటిని వ్యాపారం చేయడం, అడిగిన వారికి భూములు అప్పగించడం, పట్టణ ప్రాంతాల్లో పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు అనువుగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని సవరించడం, వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచడం, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను తగ్గించడం, విదేశీ వ్యాపార సంస్థలకు ఎటువంటి అడ్డంకులూ లేకుండా చేయడం వంటి అంశాలు తెర మీదకు వొస్తున్నాయి.
దావోస్‌లో ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు ఇరు తెలుగు రాష్టాల్ర సిఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు వెళ్లారు. పెట్టుబడులే లక్ష్యంగా వీరు అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్‌తో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఆయనకు రెండో పర్యటనగా కలసి వొస్తుందేమో చూడాలి. చంద్రబాబుకు ప్రపంచంలో సొంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. అమరావతి కొత్త రాజధానిగా అవతరించినందున ఆయనకు సానుకూలత కాగలదు. అయితే ఇదంతా ఒక ఎత్తయితే.. సింగపూర్‌లా రాష్టాల్రను అభివృద్ది చేసేందుకు స్థానికంగా ఉన్న యువతకు ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉంటుంది. స్థానిక వనరులు, స్థానిక యువతను ప్రోత్సహిస్తే ఆదాయవనరులు కూడా పెరగగలవు.
కానీ మేక్ ఇన్ ఇండియా అంటున్న ప్రధాని కూడా పెద్ద ఎత్తున ఈ రకమైన ప్రోత్సాహం ఇవ్వడం లేదు. దేశీయంగా యువతకు ఉపాధి కల్పించడానికి బ్యాంకులను ప్రోత్సహించాలి. విరివిగా రుణాలు ఇవ్వాలి. వ్యవసాయం, వ్యవసాయాధిరత పరిశ్రమలు, కోళ్లు, పశువులు, గొర్లు, మేకల పెంపకం వంటి వాటికి అవసరమైతే వడ్డీరహిత రుణాలను ఇవ్వగలగాలి. యువత విదేశాలవైపు చూడకుండా ఉండాలంటే ఇలాంటి స్వయం ఉపాధి రంగాలను ప్రోత్సహించాల్సి ఉంటుంది. విదేశీ కంపెనీలను, పెట్టుబడులను ఆహ్వానించి పెద్ద ఎత్తున ఏదో చేయాలన్న ఆలోచన కూడా సరికాదు. ప్రభుత్వ రంగాన్ని, ఉద్యోగులను కుదించడం, సంక్షేమాన్ని వదిలేసి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ఇలాంటి వాటిని కొత్తగా పాలసీలు, విజన్ పేరుతో అమలు చేసేందుకు ఎపిలో కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రెగ్యులేటరీ కమిషన్లు, ప్రైవేటీకరణకు వీలుగా ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయబోతు న్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలనలో అన్నిటిలోనూ ప్రపంచబ్యాంకు విధానాలు గోచరిస్తున్నాయన్న విమర్శలు వొస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047, వివిధ రంగాలపై తీసుకొచ్చిన సుమారు 22 పాలసీల్లో గతంలో ప్రపంచబ్యాంకు ఏదైతే చెప్పిందో వాటిని మళ్లీ వేర్వేరు రూపాల్లో తిరిగి తెస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అవి ఎలా వున్నా..
స్థానికంగా ఉన్న వనరులతో స్థానిక యువతను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి. తక్కువ పెట్టుబడులతో పెద్ద మొత్తంలో ఉపాధికి అవకాశాలను అన్వేషించాలి. విదేశీ పెట్టుబుడులు అనగానే ముఖ్యంగా విద్యుత్, నీటిని వ్యాపారం చేయడం, అడిగిన వారికి భూములు అప్పగించడం, పట్టణ ప్రాంతాల్లో పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు అనువుగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని సవరించడం, వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచడం, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను తగ్గించడం, విదేశీ వ్యాపార సంస్థలకు ఎటువంటి అడ్డంకులూ లేకుండా చేయడం వంటి అంశాలు తెర మీదకు వొస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యవసాయ భూములను పారిశ్రామిక ప్రాంతాలుగా మార్చడం, ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు పెంచడం, ఆహార ఉత్పత్తులను తగ్గించడం ఇవన్నీ కూడా ఆందోళనకర అంశాలు మారుతున్నాయి.
ప్రధానంగా వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కుని కార్పోరేట్లకు కట్టబెడు తున్నారు. ఇలాంటి పరిస్థితి పోవాలి. కొత్తగా తీసుకొచ్చే పరిశ్రమలు, పారిశ్రామిక పాలసీల్లో లక్షల మందికి ఉపాధి కల్పన ఉంటుందని పేర్కొంటున్నారు. కానీ ఎక్కడా అలాంటిదేమీ కనిపించడం లేదు. విదేశీ పెట్టుబడులకు దాసోహమంటూ ఇక్కడి వనరులను దోచిపెడుతున్న పాలకులు దేశీయంగా యువత ముందుకు వొస్తే మాత్రం..ఓ పైసా వడ్డీకూడా తగ్గించడం లేదు. ఉచిత విద్యుత్ ఇవ్వరు. భూమలు ఇవ్వరు. నీరు ఇవ్వరు. దీనిని బట్టి ప్రపంచీకరణ ప్రభావంతో దేశంలో విదేశీయుల పెత్తనం పెరగిపోవడం ఖాయం. అదే సమయంలో ఉత్పాదకతలో సాంకేతికతను పెంచాల్సి ఉంది. ఆధునీకరణ పేరిట ఇప్పటికే ఉన్న ఉపాధి పోతుంటే కొత్త ఉపాధి వొస్తుందని మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదు.
వ్యవసాయంలో యాంత్రీకరణ, పారిశ్రామిక ఆధునీకరణ అవసరమే. అయితే అది ఉన్న ఉపాధిని దెబ్బతీయకుండా చూసుకోవాలి. సంస్కరణల్లో భాగంగా ఉద్యోగాలను ప్రైవేటుపరం చేయడం ద్వారా ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర రాష్ట్రల ప్రభుత్వాలు చూస్తున్నాయి. తమపై భారం లేకుండా చూడాలని చూస్తున్నారు. జీతాలు, పెన్షన్లు తగ్గించుకోవాలన్న క్రమంలో ప్రైవేట్ పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నారు. దావోస్ లాంటి సదస్సులు ఇందుకు వేదికగా మారుతున్నాయి. ప్రభుత్వం ప్రైవేటు ఇండిస్టియ్రల్ పార్కులు తెచ్చి రైతులు నేరుగా వారికి భూములు అప్పగించొచ్చనీ ప్రకటించడమే కాకుండా రాయితీలూ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నది. గతంలో తీసుకొచ్చిన సరళీకరణ విధానాల్లో పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా భూములు కేటాయింపులు జరపాలనేది కీలకమైన షరతు.
దీన్ని ఇప్పుడు పాలసీ రూపంలో ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇదంతా చేసే బదులు ఎవరికి వారు స్వయం ఉపాధి రంగాన్ని ఎంచుకుంటే బ్యాంకు రుణాలు, నీటి సదుపాయాలు, విద్యుత్ సౌకర్యాలు ఇస్తే దేశీయంగానే చిన్నచిన్న పరిశ్రమలు స్థాపన సులువు కాగలదు. దానికి దావోస్ లాంటి సదస్సులకు వెళ్లడం, వెంపర్లాడడం, బతిమాడం వంటివన్నీ చేయకుండానే లక్ష్యం నెరవేర్చుకోగలం. కేవలం ఉన్న మానవ వనరులను,సహజ వనరులను ఉపయోగించుకుంటే మంచిది. అలాంటి ప్రయత్నాలు మొదలు కావాలి. ఎన్‌డిఎ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు లాంటి వారు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. దేశీయంగా రుణాలను ఇచ్చేందుకు పారదర్శక విధానం అమలు కావాలి. తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చేలా పాలసీలను రూపొందించాలి. అప్పుడే ఉపాధి పెరుగుతుంది. పరిశ్రమలు వొస్తాయి. స్వయం ఉపాధి పెరుగుతుంది. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. దావోస్ పర్యటనలతో డబ్బు వృధా చేసుకునే బదులు దేశీయ ఆలోచనలతో ముందుకు నడవడం అవసరం.
–ప్రజాతంత్ర డెస్క్
–ప్రజాతంత్ర డెస్క్