హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 20 : ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని, అత్యధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంది యాక్సిడెంట్లలోనేనని నివేదికలు చెబుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. సోమవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్లో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. పిల్లల వేసిన చిత్రాలు, ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.ఇలాంటి ప్రదర్శనలు రాబోయే తరాలకు అందిస్తే యాక్సిడెంట్లు తగ్గే ఆస్కారం ఉందన్నారు.
ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలపరంగా ప్రజలకు చైతన్యం చేస్తూనే వాటిని పరిష్కరించాలని కోరారు. నేషనల్ హైవేస్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దిన తర్వాత వాహనాల స్పీడ్ పెరిగిపోయింది, టెన్షన్ పెరిగిపోయింది దాంతో యాక్సిడెంట్లు కూడా పెరుగుతున్నాయని అన్నారు. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యాక్సిడెంట్ కేసులలో పెద్ద చిన్న తేడా ఉండదని, కుటుంబాలు నాశనమయ్యే ప్రమాదని చెప్పారు. అందుకే ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో కనిపెట్టి దిద్దుబాటు చర్యలుచేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.