తెలంగాణ ప్రజల బతుకులు మారాలన్న ఏకైక లక్ష్యంతో పోరాటం చేసి సాకారం చేసుకున్న ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి అయ్యాయి. నిజానికి ఇలాంటి చిన్న రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నా ప్రజల ఆకాంక్షలు తీరలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంలో ఏవీ సాకారం కాలేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పదేళ్లు కల్వంకుంట్ల కుటుంబం రాజభోగాలు అనుభవించింది. గడీల పాలన అందించింది. దీనిని నిందిస్తూ కాలయాపన చేయకుండా ప్రస్తుత రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ సర్కార్ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తామని అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు తగ్గట్లుగా అడుగులు వేయాలి. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ఆకాంక్షలు త్వరగా నెరవేర్చాలి. సాగు, తాగునీటి వనరులతో పాటు, పంటలు పండే భూములకు ఇక్కడ కొదువలేదు. పనిచేయడానికి జనం ఉన్నారు. వీటిని ఎలా ఉపయోగించాలన్నది నేతల సమర్థత విరీద ఆధారపడి ఉంది. పథకాలు, పందేరాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్లడం అసాధ్యం అని గుర్తించాలి. అలాగే గత కెసిఆర్ ప్రభుత్వంలా అభూతకల్పనలు, భ్రమలు కల్పించడం మానుకోవాలి. అప్పుడే గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. పంచాయితీలను పటిష్టం చేసి వాటి ద్వారానే గ్రామాల పురోభివృద్దికి పాటుపడాలి. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను పంచాయితీలకు దఖలు పర్చాలి. ఇదే సందర్భంలో ఇక ఉచిత పథకాలను దరిచేరకుండా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోవాలి. రైతుబంధు, రైతు రుణమాఫీలు, రూపాయికి కిలోబియ్యం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు చెక్ పెట్టాలి.
పంటలను పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధరలకు కొనడమే రైతులను ఆదుకోవడం అవుతుంది. వారికి సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం, పంటరుణాలను అందించడం, నీట వసతి కల్పించడం ప్రధాన ఎజెండా కావాలి. ఇవన్నీ కల్పించి పండిరచిన పంటలను సకాలంలో కొనుగోలు చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ప్రకృతి వైపరీత్యాల్లో ఆదుకునేలా ఉండాలి. చిన్ననీటి వనరులను అభివృద్ది చేయాలి. ఇలా చేస్తే వ్యవసాయంతో పాటు, అనుబంధ రంగాలు కూడా అభివృద్ది చెందుతాయి. గ్రావిరీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అలాగే విద్యావైద్య రంగాలను కూడా గ్రామస్థాయి లో పటిష్టం చేయాలి. గత ప్రభుత్వ తప్పిదాలను సవిరీక్షిం చుకుని ప్రజలు కోరుకుంటున్న విధంగా పాలన సాగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయాలి. అలాగే ఈ పదేళ్లలో తెలంగాణలో ఎవరి బతుకులు మారాయన్నది గమనిస్తే.. రాజకీయ పార్టీల్లో కొందరి బతుకులు మారాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతో ప్రజల బతుకులు అలాగే ఉన్నాయి. ఈ క్రమంలో పదేళ్ల పాలనపైనా, ప్రజల జీవన చిత్రంపైనా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రేవంత్ ప్రభుత్వం గత విధ్వంసాలను గుర్తించి ముందుకు సాగాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చర్చించాలి. మూసపద్దతిలో కాకుండా నిర్మాణాత్మక వైఖరితో ముందుకు సాగితే చిన్నచిన్న దేశాలను అధిమించవొచ్చు. ఉద్యోగాల కల్పన, గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, వ్యవసాయాన్ని బలోపతేం చేయడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగించాలి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరవాత తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు లోనూ.. పథకాలను అమలు చేయడంలోనూ.. అంతకు మించిన స్వార్థ ప్రణాళికతో కెసిఆర్ తొమ్మిదిన్నరేళ్లు పాలించారు.
అందుకే ఆయన రాజకీయ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అప్రతిహతంగా కొనసాగింది. కానీ ప్రజలనే వారు ఎల్లవేళలా డేగకళ్లు పెట్టుకుని చూస్తుంటారని గమనించలేదు. ఇవాళ తెలంగాణ అమరవీరుల కోసం కన్నీరు కారుస్తానంటే ప్రజలు నమ్మరు. తవ్వినకొద్దీ అవినీతి పుట్టలు బయటపడుతున్నాయి. ఒక్కో పథకం తవ్వేకొద్దీ అవినీతే తప్ప ప్రజలకు మేలు చేసిన ఆనవాళ్లు కానరావడం లేదు. కాళేశ్వరంతో పాటు అనేక ప్రాజెక్టులను కట్టినట్లు చెప్పి అవినీతిని పారించారు. చెరువులను పునరుద్దరించి గొలుసుకట్టు చెరువులకు ప్రాణం పోసామని డొల్ల మాటలు ప్రచారం చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేసామని బుకాయించారు. హరితహారంతో పచ్చదనాన్ని పెంచామని చెప్పి పచ్చి అబద్దాలు చెప్పారు. అన్ని పథకాల్లో అవినీతి దాగివుందన్న సత్యం బయటకు రావడంతో ప్రజలతో పాటు ప్రపంచం కూడా విస్తుపోయింది. ప్రజలకు ఆదర్శ నేతగా నిలవాల్సిన కెసిఆర్ కేవలం తన కుటుంబం, తన బంధువుల కోసం స్వార్థ రాజకీయాలు చేసారని చెప్పడంలో సందేహం లేదు. ఓ రకంగా చెప్పాలంటే పదేళ్ల కెసిఆర్ పాలన అంతా గోబెల్స్ ప్రచారంతో సాగింది. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో అదే పనిలో బిఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. నిత్యం ఏదో ఒక ఆరోపణతో తమ గత పాపాలను బయటకు రాకుండా చూస్తున్నారు. తెలంగాణలో కెసిఆర్‌ను మించిన విజినరీ నేత లేడని అప్పుడూ, ఇప్పుడూ భ్రమింప చేస్తున్నారు. కరిమింగిన వెలగ పండులా ఆయన విజినరీ అంతా లోపాలపుట్ట అని తేలింది. అనేక ఆశలు,ఆశయాలతో, అమరుల త్యాగాల తో పురుడుపోసుకున్న తెలంగాణను అభివృద్థిపథంలో తీసుకెళ్లేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నా, స్వార్థమనే పథకంలో కొట్టుకు పోయాయి. ఈ క్రమంలో పదినెలల రేవంత్ ప్రభుత్వం ఆర్భాటాలకు, అనవసర ఖర్చుల కు, ఉచిత పథకాల జోలికి పోకుండా క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టి సారించాలి. తెలంగాణ అభివృద్దిని మళ్లీ పట్టాలకు ఎక్కించాలి. తాము ఇచ్చిన గ్యారెంటీల పేరుతో కాలక్షేపం చేయకుండా గ్రామస్థాయిలో సమస్యలను ఆకళింపు చేసుకోవాలి. గ్రామాలను బలోపేతం చేసి అభివృద్ది చేయాలి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ నినాదాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చామన్న ఘనత సాధించాలి.
-కల్లూరి రామకృష్ణా రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్