అబ్‌కీ బార్‌ ‌బిజెపి సర్కార్‌..?

  “మూడవసారి దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఈ నినాదమివ్వడంతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఇక్కడ బిజెపి సర్కార్‌ ‌పక్కా అన్న ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌, అం‌తే బలంగాఉన్న ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను  వచ్చే ఎన్నికల్లో బిజెపి ఢీ కొట్టడం సాధ్యమేనా అన్నదిప్పుడు ప్రధానాంశంగా మారింది..”  

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఒక పక్క అభివృద్ధి పనులకు  నిధులు సమకూరుస్తూనే, మరో పక్క కావాల్సినన్ని నిధుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిని తన వెంట నడువాల్సిందిగా కోరడం వెనకున్న అర్థం పై రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అనేక విధాలుగా చర్చిస్తున్నారు. దానితోపాటు అబ్‌కీ బార్‌ ‌బిజెపి సర్కార్‌.. అం‌టూ ఆయన ఇచ్చిన నినాదం కూడా తీవ్ర చర్చ నీయాంశంగా మారింది. ఇప్పుడిది తెలంగాణలో బిజెపి నినాదంగా మారింది.

మూడవసారి దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఈ  నినాదమివ్వడంతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఇక్కడ బిజెపి సర్కార్‌ ‌పక్కా అన్న ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌, అం‌తే బలంగాఉన్న ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను  వచ్చే ఎన్నికల్లో బిజెపి ఢీ కొట్టడం సాధ్యమేనా అన్నదిప్పుడు ప్రధానాంశంగా మారింది. అందుకు తాజాగా జరిగిన బెంగాల్‌ ఎన్నికలను ఉదహరిస్తున్నారు. బెంగాల్‌లో బిజెపి అధికారంలోకి వస్తుందని కనీసంగానైనా ఎవరూ ఊహించని విధంగానే తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యావత్‌ ‌దక్షిణాదిని తన ఆదీనంలోకి తీసుకోవాలని చాలాకాలంగా బిజెపి ఆలోచన చేస్తున్నది. దానికి తగినట్లుగా దేశంలో ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్నికలు ఆ పార్టీకి అనుకూల ఫలితాలనిస్తున్నాయి. ఒంటిరిగానో, పొత్తులతోనో, ఎత్తుగడలతోనో ఒక్కో రాష్ట్రాన్ని కాషాయమయం చేయడంలో బిజెపి సఫలీకృతమవుతున్నది. తాజాగా బెంగాల్‌ ‌ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించాయి. బెంగాల్‌లో తిరుగులేని నాయకురాలిగా ఉన్న మమతాబెనర్జీని గద్దెదించడమన్నది సామాన్యవిషయం కాదు. దశాబ్దం క్రితం ముగ్గురు ఎంఎల్యేలున్న బిజెపి ఇప్పుడు రెండు వందల స్థానాలను గెలుచుకోవడమే కాదు, ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయగలిగిందంటే అక్కడి ప్రజలు ఏమేరకు మార్పు కోరుకున్నారన్నది అర్థమవుతున్నది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారంటు బిజెపి కొద్దికాలంగా ప్రచారం చేస్తున్నది. రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్‌ కూడా ఇదే నినాదం ఎత్తుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలియంది కాదు.

తాజాగా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే  విషయాన్ని చెప్పుకొచ్చారు. పాలకుల పట్ల ప్రజల్లో తీవ్ర అశాంతి ఉందని, మార్పు అనివార్యామన్న భావన వారిలో ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ళ బిఆర్‌ఎస్‌, ‌రెండున్నరేళ్ళ కాంగ్రెస్‌ ‌పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగి పోయాయని అందుకే తమ పార్టీపైన ఇక్కడ యువత చూపించే ప్రేమేంటిదో తన కండ్లతో చూస్తున్నానంటూ ఇక్కడి యువతను  ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీలు రెండు కూడా కుటుంబ పార్టీలేనని ఈ రెండు పార్టీలను ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని, ఇలాంటి పరిస్థితిలో రానున్న ఎన్నికల్లో బిజెపిఏ అధికారంలోకి వస్తుందని విశ్వసిస్తూ మోదీ చేసిన ప్రకటన రాష్ట్ర నాయకత్వంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఒకప్పుడు దేశంలో బీజేపీ రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అందులో ఒకటి తెలంగాణనుండన్న విషయాన్ని గుర్తుచేస్తూ, రానున్న ఎన్నికల్లో  బెంగాల్‌ ‌మాదిరిగా ఇక్కడ కూడా తాము కాషాయ జండాను ఎగుర వేస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ ‌పర్యటన తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేదిగా ఉంది. రాజకీయాలు మాట్లాడనంటూనే ఆయన రాజకీయ ప్రసంగం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలగురించి చెబుతూనే వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌పైన ఆయన చేసిన తీవ్ర ఆరోపణలు బిజెపి ఉంది జాగ్రత్త అని తెలంగాణ పార్టీలను హెచ్చరించినట్లుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *