మూటలు కట్టడం మానేసి గ్యారెంటీలను అమలు చేయాలి
హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హుజూరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : రాష్ట్ర ముఖ్యమంత్రికి అబద్ధాలు ప్రచారం చేయడంలో డబుల్ పిహెచ్‌డి ఇవ్వొచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ పట్టపగలే గోబెల్స్ ప్రచారం చేస్తుంటాడని, కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో మోసం చేశారు. మహారాష్ట్రలోనూ గ్యారెంటీ పేరుతో మోసం చేయబోయారని అన్నారు. అక్కడకు వెళ్లి మహిళలకు 3 వేలు, రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు.
సిఎం, మంత్రులు వెళ్లి ప్రచారం చేసారు. వీరిని చూస్తే తెలంగాణలో చేసిన మోసం గుర్తించారు. గ్రహించారు. బుద్ధి చెప్పారని విమర్శించారు. నూటొక్క దేవుళ్ళ మీద ఓట్లు పెట్టు మోసం చేసారు. మహిళలకు 2500, ఫించన్, భరోసా బోనస్, తులం బంగారం ఇవ్వలేదు. అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారు. రేవంత్, కాంగ్రెస్ నాయకులు ఓటమి తర్వాత అయినా బుద్ధి తెచ్చుకొని, వంద రోజుల్లో చేస్తామన్న హామీలు అమలు చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. హుజురాబాద్ లో దళితబంధు పథకం ప్రారంభించారు. 18,500 కుటుంబాలకు కెసిఆర్ దళిత బంధు ఇచ్చారు. సెకండ్ ఇన్‌స్టాల్ మెంట్ ఇవ్వడం లేదని అడిగితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద అరాచకానికి పాల్పడ్డారు. కొత్త పథకాలు దేవుడెరుగు. మేము ఇచ్చినవి కూడా ఇవ్వడం లేదు. భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు దళితులకు మీరు చేసే మేలు ఇదేనా అని ప్రశ్నించారు. జులై 19న ఫార్మా సిటీ అని గజిట్ ఇచ్చిన రేవంత్ ఇప్పుడు మాట మార్చి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటున్నాడని మండిపడ్డారు. ముందు ఆయన ఇచ్చిన గజిట్ వాపస్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల దగ్గరికి వెళ్లి మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు.
కాళేశ్వరం కూలీ పోతే 20 టిఎంసీ ఎట్లా తీసుకుపోతానంటున్నాడని.. మరి, ఇప్పుడేమో అదే కాళేశ్వరం భాగమైన కొండపోచమ్మ, మల్లన్న సాగర్ల నుంచి హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల తాగునీటిని మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇవ్వాలని ఎలా ప్రణాళిక చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు విఫలమయ్యాయన్న మాటలు అబద్ధమని, కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు మేలు చేశాయని స్పష్టం అయిందన్నారు. అసలు, కాళేశ్వరం ప్రాజెక్టు లేదని, అది కుప్పకూలిందని, లక్ష కోట్ల అవినీతి అని అబద్ధపు ప్రచారం చేసి మీరు సాధించింది ఏంటంటే… కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను మీ మంత్రి మల్లన్న సాగర్ నుంచి, రంగనాయక సాగర్ నుంచి పంట పొలాలకు విడుదల చేసారు. మరో మంత్రి దేశ రాజధాని దిల్లీలో వ్యవసాయ సదస్సులో తెలంగాణ గత పది సంవత్సరాల్లో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందని చెబుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం నీళ్లతో మూసీ పునరుజ్జీవం చేస్తామని చెబుతున్నారు. మళ్లీ ఇవే నీళ్లను హైదరాబాద్ తాగునీటి వసతి కోసం ఉపయోగిస్తామని ప్రకటిస్తున్నారు. ఇందులో ఏది నిజం? మీరు చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోవడం నిజమా? దాని ద్వారా అందిన ప్రతిఫలం నిజమా? గత ప్రభుత్వాల ఘనతను మెచ్చుకొని మెడలో వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అసలు ఏ ఘనత లేదని చెప్పుకోవడమే దుర్మార్గం అని అన్నారు.
కాళేశ్వరం కూలీ పోతే మూసీకి 20టీఎంసీల నీళ్ళు ఎలా చేరవేస్తారని ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చింది కెసిఆర్. కోటి 61 లక్షల మెట్రిక్ టన్నుల పంట మా గొప్పతనం అంటున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే, మేము 141 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాం. ధాన్యాగారం చేశాం. 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, పదహారేళ్లు తెలుగుదేశం పార్టీ పాలనలో ఎందుకని కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే తెలంగాణలో పండింది. ఏ కష్టం చేయకుండా విత్తనం వేయకుండానే అది వృక్షమై ఫలాలను అందించిందా? అని ప్రశ్నిచారు. తెలంగాణ రికార్డు స్థాయిలో కోటి 60 లక్షల ధాన్యం పండిందని, ఇది కాళేశ్వరం గొప్పతనం కాదని, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ గొప్పతనం అని హరీష్ రావు స్పష్టం చేశారు. .
భూమికి బరువయ్యే పంటను పండించాం. మద్దతు ధర ఇచ్చి పండిన ప్రతి గింజలు కొనుగోలు చేసాం. ప్రాజెక్టుల కింద తూములు పెట్టని చరిత్ర కాంగ్రెస్‌ది అని అన్నారు. వరంగల్ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు. రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారం చేసిన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తెలంగాణలో మోసం చేసింది చాలదని, మా వద్దకు వొచ్చారని మహా ప్రజలు తిప్పికొట్టారు. మాటలు, మూటలు కట్టుడు బంద్ చేసి, గ్యారెంటీలు అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు .