వ్యవస్థలకు ఎవరూ అతీతులు కారు…
దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయన సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. సీబీఐ పనితీరుపై విమర్శలు కొత్తేమీ కాదు. దేశంలో 1975 జూన్ 25న ఎమర్జన్సీని విధించాక వ్యవస్థల నిర్వీర్యానికి పాలకులు బరితెగించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్కడో ఒక చోట దర్యాప్తు సంస్థల్లో అపుడప్పుడు చీడపురుగులు చేరి కళంకం తీసుకురావడం సర్వసాధారణమే. ఎప్పటికప్పుడు సీబీఐ లాంటి సంస్థలను ప్రక్షాళన చేసుకుంటూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా పాలకులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నేటి టెక్నాలజీ యుగంలో ప్రతీ అంశం సంచలనమే. దీనికి మీడియా కొంత కారణమవుతోంది.
సీబీఐ అధికారులేమీ దైవంశ సంభూతులు కాదు. సచ్ఛీలురు, చురుకైనవారు, నిష్కలంక చరిత్ర ఉన్న వారిని ఎంపిక చేసి డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, సీనియర్ ఎస్పీ, ఎస్పీ వంటి స్థానాల్లో నియమిస్తారు. సీబీఐలో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రత్యేక రిక్రూట్‌మంట్ ఉంటుంది. దేశం కోసం పనిచేయాలని తపన చెందే వారిని సీబీఐ డిప్యూటేషన్‌పై తీసుకుంటుంది. సీబీఐ డైరెక్టర్ల నియామకంపై 2014లో మోదీ ప్రభు త్వం ‘దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ బిల్లు’కు సవరణలు తెచ్చింది. దీని ప్రకారం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు. అంతవరకూ పనిచేసి పదవీ విరమణ చేసిన సీబీఐ డైరెక్టర్ అభిప్రాయాలను కూడా కొత్త డైరెక్టర్ నియమాకం సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటారు. దేశ ప్రజల్లో ఇప్పటికీ సీబీఐ పట్ల విశ్వసనీయత ఉంది.
కానీ, రాజకీయ పార్టీలు తలదూర్చి సంస్థను భ్రష్టుపట్టిస్తున్నాయి. ఒకటి, రెండు కారణాలతో సీబీఐని, న్యాయవ్యవస్థను ప్రశ్నించే స్థాయికి రాజకీయ పార్టీలు చేరుకుంటే.. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రక్షాళన ఎలా సాధ్యం? న్యాయవ్యవస్థ లేదా పార్లమెంటు లేదా సీబీఐలో ఉండేది మనుషులే. వారికీ బలహీనతలు ఉంటాయి. ఇవి నిజాయితీగా ఉండాలంటే..ఈ వ్యవస్థల్లో ఉన్న కళంకితులను పట్టుకోవాల్సిందే. 1975లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించారు. ఒకసారి ప్రధాని పదవికి, స్పీకర్ పదవికి ఎన్నికైనవారికి న్యాయవ్యవస్థ తీర్పులు వర్తించకుండా రాజ్యాంగానికి సవరణలు చేశారు. కానీ ఈ అధికరణలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇందిరమ్మ హయాంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు జరిగిన ప్రయత్నాలను ‘లోక్‌నాయక్’ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాయి. పార్లమెంటును, న్యాయవ్యవస్థను తన గుప్పెట్లో ఉంచుకునేందుకు ఇందిరా గాంధీ చేసిన ప్రయత్నాలు వమ్మయ్యాయి. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కారు. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, న్యాయవ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ నేతలు సంయమనం పాటించాలి. ఆ వ్యవస్థలను నీరుగార్చితే ప్రజాస్వామ్యానికి చేటు తప్పదు. 2010 నుంచి ఇంతవరకు సీబీఐ డైరెక్టర్లుగా పనిచేసిన వారందరిపైనా ఏదో ఒక విధంగా ఆరోపణలు వస్తున్నా యి. అంతమాత్రాన సీబీఐ భ్రష్టుపట్టిందని ఆరోపణలు చేయడం తగదు.
కాంగ్రెస్ హయాంలో ‘సీబీఐ పంజరంలో చిలుక’ అని ఎన్డీఏ నేతలు ఆరోపించారు. అనేక సంస్కరణలు తెచ్చి, పారదర్శకంగా సీబీఐ డైరెక్టర్‌ను నియమించినా అంతర్గత కుమ్ములాటలు ఆగలేదు. సంస్కరణల వల్ల కళంకితులు చొరబడకుండా నిరోధించలేమని రుజువైంది. సవాళ్లు ఎదురైనప్పుడు చీడపురుగులను ఏరివేయడమే ఏకైక పరిష్కారమా? 1941లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మంట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. యుద్ధం, యుద్ధ సామగ్రి వినియోగంలో అవకతవకలు జరిగితే, దర్యాప్తు నిమిత్తం దాన్ని ఏర్పాటు చేశారు. యుద్ధం ముగిసినా, అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దిల్లీలో ఈ దర్యాప్తు ఏజన్సీని కొనసాగించింది. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌కు చట్టబద్ధతను 1946లో కల్పించి, కేంద్ర హోం శాఖ అధీనంలోకి తెచ్చారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలన కోసం ఈ సంస్థకు అధికారాలు కల్పించారు. 1963లో దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ పేరును ‘సీబీఐ’గా మార్చారు. 1965లో సీబీఐకు ఆర్థిక నేరాల దర్యా ప్తు బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత సంచలనాత్మక హత్యలు, కిడ్నాప్‌లు, ఉగ్రవాద నేరాలపై దర్యాప్తు బాధ్యతలను కేటాయించారు. ఎస్‌పీఈలో జనరల్ ఆఫీసర్స్ వింగ్, ఎకనామిక్ ఆఫీసర్స్ వింగ్ అని రెండు విభాగాలు ఉన్నాయి. ఇందులో మొదటి విభాగం అవినీతి కేసులను, రెండవ విభాగం ఆర్థిక నేరాలను విచారిస్తుంది. 1987లో ఈ రెండు విభాగాలను విలీనం చేసి కొత్తగా రెండు విభాగాలను ఏర్పాటు చేశారు. అవినీతి నిరోధక డివిజన్, ప్రత్యేక క్రైమ్స్ డివిజన్ ఆవిర్భవించాయి. ఈ రెండు విభాగాలకు వేర్వేరుగా డైరెక్టర్లు ఉండేవారు. 1947 నుంచి 1963 వరకు అప్పటి పాలకులు ఈ దర్యాప్తు ఏజన్సీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే వారు కారు.
ఇందిరా గాంధీ హయాంలో 1968 నుంచి సీబీఐ కార్యకలాపాలపై ప్రభుత్వ జోక్యం పెరిగింది. ఎమర్జన్సీలో రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు సంజయ్ గాంధీ సీబీఐను వాడుకున్నారనే అభియోగాలున్నాయి. సీబీఐను ప్రక్షాళన చేసేందుకు 1966లో కె.సంతానం నేతృత్వంలో కమిటీని నియమించారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1977లో సీబీఐకి మరమ్మతు చేసేందుకు ఎల్‌పీ సింగ్ కమిటీని నియమించింది. 1980లో ఇందిరమ్మ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఎల్‌పీ సింగ్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారు. ఈ కమిటీ సీబీఐ పనితీరుపై పార్లమెంటుకు అజమాయిషీ ఉండాలని సిఫార్సు చేసింది. సీబీఐ డైరెక్టర్‌గా ఐపీఎస్ అధికారి ఉండాలనే నియమం లేదని పేర్కొంది. ఒక ఐపీఎస్ అధికారి డైరెక్టర్ స్థాయికి చేరుకునే సరికి రాజకీయ పార్టీలతో ఏదో విధంగా సంబంధం కలిగి ఉంటారు. ఆ సంబంధాలు ఆ అధికారిపై ప్రభావితం చేస్తాయని కమిటీ పేర్కొంది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నేషనల్ పోలీసు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కూడా సీబీఐ పర్యవేక్షణ బాధ్యతను నేషనల్ సెక్యూరిటీ కమిషన్‌కు అప్పగించాలని సిఫార్సు చేసింది.
ఈ నివేదికలను పట్టించుకునే వారే కరవయ్యారు. అమెరికాలో శక్తిమంతమైన ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ను సెనేట్, జ్యూడీషియరీ కమిటీ నియమిస్తాయి. అమెరికా అధ్యక్షుడు సిఫార్సు చేసే వ్యక్తుల వివరాలను ఈ కమిటీ కూలంకషంగా అధ్యయనం చేస్తాయి. ఎఫ్‌బీఐ పర్యవేక్షణ బాధ్యతలు దేశాధ్యక్షుడిపై, సెనేట్‌పై ఉంటాయి. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ను తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉన్నా, ఆ అధికారాన్ని ఇంతవరకు ఎవరూ వినియోగించలేదు. మన దేశంలో 2003 కంటే ముందు సీబీఐ డైరెక్టర్‌ను ప్రధాని నియమించేవారు. ఆ తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చైర్‌పర్సన్, విజిలెన్స్ కమిషన్లు, హోంశాఖ కార్యదర్శి, కో ఆర్డినేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ నియమించే విధానాన్ని వాజపేయి ప్రధానిగా ఉన్నపుడు ప్రవేశపెట్టారు. 2014లో చట్టసవరణ ద్వారా మోదీ సర్కార్ మరో ముందడుగు వేసింది.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉన్న కమిటీ సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేస్తుంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తే రాజకీయ జోక్యానికి తావులేకుండా మరిన్ని సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో ఎంతటి గొప్పవారైనా, ప్రజాభిమానం ఉన్నవారైనా ఉండవొచ్చు. ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసానికి వారు పాల్పడడం శిక్షార్హమే. మనదేశంలో వ్యక్తిగత ఆరాధాన, ప్రాంతీయ దురభిమానం ప్రజాస్వామ్య వికాసానికి అడ్డుపడుతున్నాయి. జాతీయ సర్వీసుల్లో అన్ని ప్రాంతాలకు చెందిన వారుంటారు. వ్యక్తులను, ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు ఏజన్సీలను నిర్వీర్యం చేసే పన్నాగాలకు బలం చేకూర్చే విధంగా ప్రసార సాధానాలు వంత పాడితే పరిస్థితి మరింత దిగజారకుండా ఉంటుందా?!
-డా.సి.వి.రత్నకుమార్