మతోన్మాదానికి వ్యతిరేకంగా కళారూపాలను రూపొందించాలి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు
ఘనంగా ఇండియన్ ప్యూపిల్స్ థియేటర్ అసోసియేషన్ 90 వసంతాల వేడుకలు
దేశంలో ప్రజల సాంస్కృతిక మేల్కొలుపులో ఇప్టా మూలాలు ఉన్నాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు తెలిపారు. హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో బుధవారం ఇండియన్ ప్యూపిల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) 90 వసంతాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఇప్టా, తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల కార్యక్రమానికి అరసం జాతీయ నాయకులూ ఆర్.వి.రామరావు అధ్యక్షత వహించారు. అభ్యుదయ సాంస్కృతికోద్యమ కృషీవలులు నటుడు, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులూ నల్లూరి వెంకటేశ్వర్ రావు, నటుడు, ప్రముఖ అభ్యుదయ రచయిత కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, ప్రముఖ కవి, అభ్యుదయ రచయిత డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ ను శాలువాలు, ఫూలమాలలతో కూనంనేని సాంబశివ రావుతోపాటు పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సామాజిక బాధ్యత, జాతీయ సమైక్యత పై అవగాహన పెంపొందించే లక్ష్యంతో దేశంలోని అభ్యుదయ కవులు, రచయితలు, కళాకారులలో జన్మించిన ఇప్టా, కైఫీ అజ్మీ, మజ్రూహ్ సుల్తాన్‌పురి, సాహిర్ లుధియాన్వీ, బల్‌రాజ్ సాహ్ని, మోహన్ సెగల్, ముల్క్‌రాజ్, షబానా అజ్మీ, ఫరూక్ షేక్, కాదర్ ఖాన్, నాగభూషణం, రాజనాల, అల్లు రామ లింగయ్య వంటి ఎందరో రచయితలను, నటీనటులను చిత్రపరిశ్రమకు అందించిన ఘనత ఇప్టా దే అన్నారు. సామాజిక బాధ్యత, జాతీయ సమైక్యతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో నాటకం, పాటలు, నృత్యాల రూపకాలు రూపొందించి భారత సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించాలని అయన కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల నుంచి ఉద్భవించిన ప్రసిద్ధ పాటలు, నాటకాల గొప్ప సంప్రదాయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలని, పార్టీ సాంస్కృతిక కార్యకర్తలు జైలులో ఉన్నప్పుడు లేదా పరారీలో ఉన్నప్పుడు రాసి, రూపొందించారని, వారు శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వంగా మిగిలిపోయారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం రక్షణకు, రోజురోజుకు పెరుగుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా పాటలు, దృశ్య కళలు రూపొందించి ప్రజలను చైతన్య పరచాలన్నారు. ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమాలలో ఇప్టా, అరసం ముఖ్యమైన పాత్ర పోషించాయని, సామ్యవాద, జాతీయవాద ఉత్సాహంతో స్వేచ్ఛ, ఆర్థిక, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య సంస్కృతి, నాటకం, పాటలు, నృత్యాల రూపంలో కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్టా, అరసం పని చేయాలని కూనంనేని సాంబశివ రావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు మాదాల రవి, సినీ నిర్మాత మద్దినేని రమేష్, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి డాక్టర్ ఎస్వి. సత్యనారాయణ, ఇప్టా రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రావు, జానకిరామ్, తెలంగాణ ప్రజా నాట్య మండలి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలయ్య , అరసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పల్లేరు వీరాస్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి కెవిఎల్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జి. చంద్రమోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.