నీ నీడలో
నే నిస్సత్తువగా
కొడిగట్టిన సామర్థ్యంతో
మిణుకు మిణుకుమనే దీపంలా
బంగారు పంజరంలో గాజు బొమ్మలా…
నా ప్రతిభకు సంకెళ్లు పడ్డాయి
నా స్వరం మూగబోయింది,
బంధనాల బందీనై కట్టుబాట్ల భారంతో
నే వంగిపోతున్నా
నే పాతాళం లోకి కుంగి పోతున్నా
నా లోపల్లోపల
కాగే ఆలోచనల సలసల పెరుగుతూ
బలానికి, ధైర్యానికి సరిహద్దులు వీడుతూ
చెప్పని జీవిత తంత్రం అర్ధమవుతూంటే,
నాలో స్థైర్యం తొణికిసలాడింది
రాళ్ళలో, పగుళ్లలో విత్తనాలు మొలకెత్తి
దశదిశలా వ్యాప్తి చెందుతున్నవి
చేదు జ్ఞాపకాలు వదిలి లేచి నుంచున్నా
నే నిటారుగా ఆకాశం కేసి సాగుతున్నా
అవును, ఆ నేనే ఈ నేను
వి . శాంతి ప్రబోధ