హైడ్రానా? హైడ్రామానా? హైదరాబాద్ పునర్వైభవమా?

అలా రెండు వేల ఏళ్లుగా మన సమాజం పెంచి పోషించుకుంటూ వచ్చిన వివేకాన్ని గత యాబై సంవత్సరాల దురాశ ధ్వంసం చేసి పారేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వివేకాన్ని పునరుద్ధరించగలమా, పాత గొలుసుకట్టు జలాశయాలన్నిటినీ యథాతథంగా పునర్నిర్మించగలమా అనేది చిక్కు ప్రశ్నే కావచ్చు గాని, కనీసం జలాశయాల అక్రమ ఆక్రమణల గురించి ఆలోచించక తప్పదు.

సాముదాయక స్థలాలను ఆక్రమించి గాని, సక్రమ స్థలమే అనే అబద్ధపు కాగితాల సాయంతో కొనుక్కుని గాని భవనాలు, ఫామ్ హౌజులు, విల్లాలు, వ్యాపార, పారిశ్రామిక ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నవారి నిర్మాణాలను కూలగొట్టినప్పుడు అప్పటివరకూ వారి మిడిమేలపు సంపదను చూసినవారికి అది అన్యాయమని ఏమీ అనిపించదు. ఈ శాస్తి జరగవలసిందే అనిపిస్తుంది. ప్రస్తుత విడత హైడ్రా చర్యలలో ఎక్కువభాగం ఇప్పటివరకు అటువంటి సంపన్నుల మీద, శక్తిమంతుల మీద ఎక్కుపెట్టినవే గనుక ప్రజా స్పందన ప్రభుత్వ చర్యలకు సానుకూలంగానే ఉంటున్నది. లేదా మౌనాంగీకారమైనా కనబడుతున్నది.

 

ఆరు వారాలుగా తెలంగాణ, కనీసం హైదరాబాద్, హైడ్రా అనే మాటతో మారుమోగిపోతున్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న ఏర్పాటు చేసిన ఒక సంస్థ పేరుకు పొడి అక్షరాలు హైడ్రా. అయితే హైడ్రా అనేది గ్రీకు పురాణ గాథలలో తొమ్మిది తలల జల సర్పం. ఆ తలలు నరికిన కొద్దీ పుడుతుంటాయి గనుక హైడ్రా నిరంతరం తన తలలను ఎటు పడితే అటు వ్యాపిస్తూనే ఉంటుంది. ఆ హైడ్రా అనే మాటనే జీవశాస్త్రంలో వెన్నెముక లేని సూక్ష్మ జలచర జీవులలో ఒక జాతికి కూడా పెట్టారు. ఆ జాతి అంగుళం కన్నా ఎక్కువ పెరగని జీవే గాని నాలుగు నుంచి ఇరవై ఐదు దాకా చేతులతో (?) ఎటు పడితే అటు విస్తరిస్తుంది. ఎటు పడితే అటు విస్తరణ, జలం, సర్పం అనే అంశాలలో ఆ పాత హైడ్రాకూ మన హైదరాబాదు హైడ్రాకూ కొన్ని పోలికలున్నమాట నిజమే గాని ఇది పూర్తిగా వేరే.

మన నగరాలన్నిట్లో, ముఖ్యంగా హైదరాబాదులో భూకబ్జాలు, అన్యాక్రాంతాలు, ఒకరి భూములను మరొకరు ఆక్రమించడం, సాముదాయక భూములను వ్యక్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఆక్రమించుకోవడం, ఆ సాముదాయక భూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చి అమాయక కొనుగోలుదార్లకు అమ్మేసి చేతులు దులుపుకొని కనబడకుండా పోయే దొంగ వ్యాపారులు, అక్రమ భవన నిర్మాణాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇందులో కొత్త విషయమేమీ లేదు. ఈ అక్రమ నిర్మాణాల మీద చర్య తీసుకోబోయినప్పుడల్లా అవి కొత్త వివాదాలకు దారి తీయడమూ, కొద్ది రోజుల్లోనే ఆ చర్యలు ఆగిపోవడమూ కద్దు. అక్రమ భవన నిర్మాణాల మీద చర్యలు, ప్రధానంగా కూల్చివేతలు, అప్పటికి అక్కడ ఉంటున్న వారి మీద పిడుగుపాట్లే అవుతాయి. వారు బ్యాంకు రుణాలు తీసుకుని ఆ భవనాల్లో ఫ్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి వారు కావచ్చు. అటువంటి సాముదాయక స్థలాల్లో సొంతంగానో, రాజకీయ నాయకుల ప్రోత్సాహంతోనో గుడిసెలు వేసుకున్న అట్టడుగు వర్గాల వారు కావచ్చు. అటువంటి వారి ఆశ్రయాలను కూల్చివేసి, వారిని నిరాశ్రితులను చేసినప్పుడు తప్పకుండా అది అన్యాయమనే, తీరని లోటనే అనిపిస్తుంది. వారి భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుతుంది.

అలాగే, అటువంటి సాముదాయక స్థలాలను ఆక్రమించి గాని, సక్రమ స్థలమే అనే అబద్ధపు కాగితాల సాయంతో కొనుక్కుని గాని భవనాలు, ఫామ్ హౌజులు, విల్లాలు, వ్యాపార, పారిశ్రామిక ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నవారి నిర్మాణాలను కూలగొట్టినప్పుడు అప్పటివరకూ వారి మిడిమేలపు సంపదను చూసినవారికి అది అన్యాయమని ఏమీ అనిపించదు. ఈ శాస్తి జరగవలసిందే అనిపిస్తుంది. ప్రస్తుత విడత హైడ్రా చర్యలలో ఎక్కువభాగం ఇప్పటివరకు అటువంటి సంపన్నుల మీద, శక్తిమంతుల మీద ఎక్కుపెట్టినవే గనుక ప్రజా స్పందన ప్రభుత్వ చర్యలకు సానుకూలంగానే ఉంటున్నది. లేదా మౌనాంగీకారమైనా కనబడుతున్నది. ముఖ్యంగా నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్, రాజకీయ నాయకుల ఫామ్ హౌజులు, సంపన్నుల విల్లాలు కూలుస్తున్నప్పుడు ప్రజలు స్థూలంగా ఆమోదిస్తున్నట్టే కనబడుతున్నది. హైడ్రా పేరులోనే ఈ సాముదాయక, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనే ఆశయం ఉన్నది.ఇలా రక్షిస్తున్న ఆస్తులలో ప్రస్తుతానికి మిగిలిన సాముదాయక స్థలాల కన్నా ఎక్కువగా చెరువులు, కుంటలు, నాలాలు ఉన్నాయి. ఈ చర్యల సందర్భంలో ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ అనే మాటలు ఎక్కువగా వినబడి అందరికీ తెలిసిపోయాయి. చెరువులు, కుంటలు పూర్తిగా నిండినప్పుడు నీళ్లు ఎక్కడి దాకా వస్తాయో ఆ విస్తీర్ణాన్ని ఫుల్ టాంక్ లెవల్ (ఎఫ్ టి ఎల్) అంటారు. దాన్ని ఆవరించి ఉండే ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. నీళ్లకు చెందిన ఆ స్థలాల్లోకి వెళ్లినవారికి మొన్నటివరకూ నీళ్లు ఆ విషయం గుర్తు చేశాయి, ఇప్పుడు హైడ్రా గుర్తు చేస్తున్నది.

ఇవాళ హైదరాబాద్ మహానగరంగా విస్తరించిన ప్రాంతంలో 1970ల నాటికి కనీసం మూడు వేల చెరువులు, కుంటలు ఉండేవని, అవి యాబై ఏళ్లలో కొన్ని వందల స్థాయికి తగ్గిపోయాయని అనేక అధ్యయనాలు చెపుతున్నాయి. చాల చెరువులూ కుంటలూ అసలు ఆనవాలు కూడా లేకుండా మటుమాయమైపోయాయి. కొన్ని చెరువులూ కుంటలూ ఆయా ప్రాంతాల్లో వాటి పేర్లు మాత్రం మిగిలి కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోయాయి. కొన్ని చెరువులూ కుంటలూ వాటి అసలు విస్తీర్ణంలో సగానికో పావుకో తగ్గిపోయాయి. ఆ మిగిలిపోయిన నీళ్లు కూడా వ్యర్థ పదార్థాలతో, ప్లాస్టిక్ తో, మురికితో, దోమల నిలయాలుగా, విషపూరితంగా మారిపోయాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ, నగరం విస్తరిస్తున్న కొద్దీ, పెరుగుతున్న జనాభా ఆవాస అవసరాలు పెరుగుతున్న కొద్దీ ఇలా చెరువుల నేలను ఆక్రమించక తప్పదని కూడ కొందరు అనుకోవచ్చు. అదే ఆధునికత అనీ, వ్యవసాయం చెయ్యని చోట జలాశయాలు ఎందుకనీ కూడా అనుకోవచ్చు. కానీ జలాశయం అనేది కేవలం వ్యవసాయం కోసం మాత్రమే కాదు. జనావాసాల మధ్య స్వచ్ఛమైన నీరు నిలిచి ఉండడం మంచి గాలికీ, ఆహ్లాదానికీ, భూగర్భ జలాలూ పెరగడానికీ, పశుపక్ష్యాదులకూ, చెట్టుచేమలకూ కూడ అవసరం. జనావాసాల మధ్య ఉద్యానవనాల లాగనే జలాశయాలు లంగ్ స్పేస్ గా పని చేస్తాయి.

అప్పటికి జలాశయాల బహుళార్థ సాధకత తెలియకపోయినా, కేవలం వ్యవసాయ వనరుగా, మంచినీటి వనరుగా వాటి నిర్మాణం దక్షిణ భారతదేశంలో రెండు వేల సంవత్సరాలుగా ఉంది. చోళులు ప్రారంభించిన ఈ సంప్రదాయం బహుశా రాష్ట్రకూటుల ద్వారా కాకతీయులకు చేరి, తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు చెరువుల వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. దక్కన్ పీఠభూమి నైసర్గికతను బట్టి, వర్షపాత లేమిని బట్టి, జనావాసాల ఉనికిని బట్టి గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను తయారు చేశారు. ఆ వ్యవస్థనే విజయనగర, ఖుతుబ్ షాహీ, అసఫ్ జాహీ రాజ్యాలు కూడ కొనసాగించడం మాత్రమే కాదు, అభివృద్ధి చేశాయి.అలా రెండు వేల ఏళ్లుగా మన సమాజం పెంచి పోషించుకుంటూ వచ్చిన వివేకాన్ని గత యాబై సంవత్సరాల దురాశ ధ్వంసం చేసి పారేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వివేకాన్ని పునరుద్ధరించగలమా, పాత గొలుసుకట్టు జలాశయాలన్నిటినీ యథాతథంగా పునర్నిర్మించగలమా అనేది చిక్కు ప్రశ్నే కావచ్చు గాని, కనీసం జలాశయాల అక్రమ ఆక్రమణల గురించి ఆలోచించక తప్పదు.

ఇవాళ నిలిచి ఉన్న నిర్మాణం మీద, భవనం మీద చర్య తీసుకుంటే అందులో నివసిస్తున్నది పేద, మధ్యతరగతి కుటుంబమైతే వారిని నిరాశ్రితులు చేయడం కావచ్చు. ఆ నిర్మాణం విలాసం కోసం నిర్మించుకున్న సంపన్నులదీ, శక్తిమంతులదీ అయితే వారికి ఉన్న డజన్ల కొద్దీ ఆస్తులలో ఒకదాన్ని మాత్రమే నష్టపరచడం కావచ్చు. కాని అసలు చెరువులు, కుంటలు, నాలాలు ఊరుమ్మడి ఆస్తులు గదా, సాముదాయక వారసత్వ సంపదలు గదా, వ్యక్తిగత ఆస్తులుగా, వ్యాపారాలుగా ఎప్పుడు, ఎట్లా మారిపోయాయి అనేది ఆలోచించవలసిన ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు వెతికితే గాని, ప్రస్తుతం తీసుకునే చర్య నిర్మాణం మీద మాత్రమే కాదని, ఆ నిర్మాణానికి దారితీసిన గొలుసుకట్టు నేరస్తుల మీదననీ తేలుతుంది.

చిన్న కుంటలు సాధారణంగా సహజంగా ఏర్పడినవి. లేదా మానవ నిర్మితాలైతే సొంత భూమి మీద నిర్మించినవీ కావచ్చు. కాని పెద్ద కుంటలు, చెరువులు తప్పనిసరిగా ఊరుమ్మడి భూమి మీద మాత్రమే ఉంటాయి. అక్కడ ఎండకాలం నీరు నిలవ ఉండని సమయంలో ఆ సారవంతమైన ఒండ్రు నేలలో పంటలు పండించవచ్చునని, చెరువు షికం (గర్భం) భూమిని హర్రాజు పాడి వ్యవసాయదారులకు ఇచ్చే ఆనవాయితీ ఉండేది. అలాగే చెరువు షికంలో ఆ ఒక్క రుతువులో పంట వేసుకునే, ఫలసాయం అనుభవించే హక్కు ఇస్తూ ఏక్ ఫసల్ పట్టా ఇచ్చే అలవాటు కూడా ఉండేది. ఏక్ ఫసల్ పట్టా పంట వేసే, పంట కోసుకునే హక్కు మాత్రమే గాని, భూమికి సొంతదారును చేసే పట్టా కాదు. హైదరాబాద్ రాజ్యం మీద సైనిక చర్య తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, నిజాం రాజ్యపు రెవెన్యూ పద్ధతులు తెలియని మద్రాసు ప్రాంత, ఆంధ్ర ప్రాంత అధికారులు తెలిసో తెలియకో ఏక్ ఫసల్ పట్టాను పూర్తి హక్కుల పట్టాగా గుర్తించడం మొదలయింది. 1956 తర్వాత హైదరాబాద్ లో వేలాది ఎకరాల సర్ఫెఖాస్, పాయెగా, జాగీర్, ఇనామ్, లావారిస్, వక్ఫ్ వగైరా భూములన్నీ అన్యాక్రాంతమయ్యే ప్రక్రియ మొదలైనట్టుగానే, ఈ ఏక్ ఫసల్ పట్టా ఉన్న చెరువుల భూములు, పట్టా భూములుగా మారి, ఆ పట్టాలున్న స్థానికుల నుంచి అడ్డికి పావుసేరు చొప్పున ఇతరులు కొనడం మొదలయింది. అలా కొన్న భూమిని వ్యవసాయేతర వినియోగ (నాన్ అగ్రికల్చరల్ లాండ్ అసెస్ మెంట్ – నాలా) భూమిగా బదిలీ చేయించి, కాలక్రమంలో వాటిని ఇతరులకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, డెవలప్ మెంట్ వ్యాపారస్తులకు అమ్మడం జరిగింది.

అది మొట్టమొదటి అక్రమం అయితే, ఆ అక్రమాన్ని అప్పుడే అడ్డుకోవలసి ఉండిన, చెరువు షికం భూమినీ, ఎఫ్ టి ఎల్ భూమినీ, బఫర్ జోన్ భూమినీ ఎవరూ సొంత ఆస్తిగా ప్రకటించుకోవడానికి, నాలా కింద బదిలీ చేయడానికీ వీలులేదని అడ్డుకోవలసిన రెవెన్యూ యంత్రాంగం అవినీతి వల్ల ఆ అక్రమం మీద అడ్డుకట్ట పడలేదు. రెవెన్యూ యంత్రాంగం లంచగొండితనం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దురాశ కలిసి హైదరాబాద్ చెరువుల విధ్వంసం ఇష్టారాజ్యంగా సాగిపోయింది. ఆ తర్వాత వచ్చిన వారు భవన నిర్మాణ వ్యాపారులు, కంపెనీలు. వారు ఈ అక్రమ భూములలో లేఔట్లు వేసి, బహు అంతస్తుల భవనాలు నిర్మిస్తూ నగరంలో పెరుగుతున్న మధ్యతరగతి గృహదాహాన్ని తీర్చడం ప్రారంభించారు. ఆ లేఔట్లకూ, భవన నిర్మాణాలకూ అనుమతులు ఇవ్వవలసిన మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ, శివారు ప్రాంత మునిసిపాలిటీలు విచ్చలవిడి లంచగొండితనంతో వెనుకా ముందూ చూడకుండా అనుమతులను అమ్ముకున్నాయి.

ఆ భవనాలలో ఫ్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి వారికి గృహ రుణాలు ఇచ్చిన బ్యాంకులు, గృహ రుణ సంస్థలు తమ చేతికి వచ్చిన కాగితాల చట్టబద్ధతను పరీక్షించి, ఈ అక్రమాన్ని అడ్డుకోవలసి ఉండగా వారూ ఆ పని చేయలేదు. అలా అక్రమంగా కట్టిన ఇళ్లకు, కాలనీలకు ప్రభుత్వమే రోడ్లు వేసింది, ఇంటి నంబర్లు ఇచ్చింది, నీళ్లు, కరెంటు సరఫరా చేసింది, మురుగు నీటి ఏర్పాట్లు చేసింది. పన్నులు వసూలు చేసింది. ఈ మొత్తం క్రమంలో అక్రమాలన్నిటికీ ప్రభుత్వ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మునిసిపల్ సంస్థల, బ్యాంకుల భాగస్వామ్యం ఉంది. అంటే మొదటి అక్రమం నుంచి ఇవాళ్టిదాకా కనీసం డజను మంది నేరస్తులున్నారు.

ఇప్పుడు హైడ్రా ఈ ప్రక్రియలోని మొదటి పదకొండు మంది నేరస్తులలో ఏ ఒక్కరి గురించీ మాట మాత్రమైనా ప్రస్తావించడం లేదు. తల తాకట్టు పెట్టి రుణం తీసుకుని, సొంత ఇంటి కల నెరవేర్చుకుని, ఇంకా వాయిదాలు కడుతూ ఆ ఇంట్లో ఉన్న పాపానికి, ఇంట్లో వాళ్లను వెళ్లగొట్టి, ఆ ఇల్లు కూలగొడుతున్నది. ఈ మొత్తం గొలుసుకట్టు అక్రమాలలో భాగమై ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భవన నిర్మాణ వ్యాపారులు, బ్యాంకు అధికారులు, ప్రభుత్వ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మునిసిపల్ అధికారులు ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక స్థాయిలో చర్యలు తీసుకున్నప్పుడే హైడ్రా అసలు స్ఫూర్తి నెరవేరుతుంది.

ఇంతకూ ఈ హైడ్రా చర్యలు కొనసాగుతాయా, గత ప్రభుత్వాల హయాంలో జరిగినట్టుగానే ఏదో ఒకటి రెండు చర్యలతో, ఒకటి రెండు నెలల హడావుడితో ఆగిపోతాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా హైడ్రా, హైడ్రామా మాత్రమేనా? దేశంలో మిగిలి ఉన్న అతి తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఒకటిగా తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ అధిష్టానం నిధుల కోసం ఎక్కువగా ఒత్తిడి పెడుతున్నదనీ, అలా దిల్లీ కి మూటలు పంపడానికి సంపన్నుల దగ్గర విరాళాల కోసం బెదిరింపుగా ఈ చర్యలను వాడుతున్నారని కొందరు అంటున్నమాటలో ఎంత నిజం ఉందో తెలియదు. చెరువుల, కుంటల, నాలాల ఆక్రమణ వల్ల నగరంలో జల ఉత్పాతాలు సంభవిస్తున్నాయి గనుక ఇప్పటికి ఈ చర్యలు ప్రజామోదాన్ని చూరగొంటూ ఉండవచ్చు. కాని ఇది కేవలం సంపన్నుల, శక్తిమంతుల మీద మాత్రమే కాదనీ, అది కేవలం నమూనా మాత్రమేననీ, చివరికి చెరువులు, కుంటల స్థలాలను ఆక్రమించిన అందరి మీదికీ రావచ్చునని అనుకుంటే ప్రజామోదం కొనసాగుతుందా? ఇంత చేసీ, సరస్సుల నగరంగా హైదరాబాద్ పునర్వైభవం సాధించడం సాధ్యమవుతుందా?

తెలంగాణార్థం

-ఎన్ వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *