తెలంగాణ‌కు కేంద్రం మొండిచేయి : మాజీ మంత్రి హరీష్ రావు

నిధులు తీసుకురావ‌డంతో కాంగ్రెస్‌, ‌బిజెపి నేత‌లు విఫ‌లం

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11: ‌తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు విమర్శించారు. గోదావరి పుష్కరాలకు తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యి చూపడంపై ఎక్స్ ‌వేదికగా ఆయన స్పందించారు. గోదావరి పుష్కరాల కోసం కేంద్రం ఆంధప్రదేశ్‌కి రూ.100 కోట్ల నిధులు ఇచ్చింది.. కానీ తెలంగాణకు గుండు సున్నా ఇచ్చింది. మన రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. ఒక్క రూపాయి కూడా కేంద్రం తెలంగాణకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక నిధుల కింద రూ. 15 వేల కోట్లు మంజూరు కాగా.. తెలంగాణకు మాత్రం దక్కింది గుండు సున్నా అన్నారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ‌బలమైన స్థానంలో ఉండి ఉంటే.. ఈ అన్యాయాన్ని మేము ఎప్పటికీ సహించేవాళ్లం కాదన్నారు. ఎప్పటికైనా ఇంటి పార్టీ బీఆర్‌ఎస్సే తెలంగాణకు రక్షణ కవచం అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ఇప్పటికైనా ఆ పార్టీలు స్పందించాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *