Take a fresh look at your lifestyle.

కార్యకర్తలకు కంటికి రెప్పలా…కుటుంబాలకు అండగా..

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ్యత్వమున్న ప్రతీ కార్యకర్తకు ప్రమాద బీమా

6 గురికి రూ.12 లక్షల పార్టీ ఇన్సూరెన్స్ ‌మంజూరు

బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు

త్వరలోనే రెండవ విడత గొర్రెల పంపిణీ ఎశీస్తామని వెల్లడి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 14 : టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతీ కార్యకర్తకు 2లక్షల రూపాయల ఇన్స్‌రెన్స్‌ను కల్పించడం జరిగిందనీ, ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. గురువారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సిద్ధిపేట నియోజకవర్గంకు చెందిన ముగ్గురికి, దుబ్బాక నియోజకవర్గంలోని ముగ్గురు పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక్కొక్కరి కుటుంబానికి 2లక్షల రూపాయల చొప్పున మంజూరైన 12 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు మంత్రి హరీష్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. పార్టీకి చెందిన ప్రతీ కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామనీ, పార్టీ అధినేత, సిఎం కేసీఆర్‌ ‌పార్టీలో పనిచేసే ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ ‌చేసి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తున్నామన్నారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 30 మంది కార్యకర్తల కుటుంబాలకు ఈ ఇన్సూరెన్స్ ‌చెక్కులు అందించామని, కొత్తగా మరో ముగ్గురు కార్యకర్తలకు బీమా మంజూరైందన్నారు. చెక్కులను అందుకున్న వారిలో చిన్నకోడూరు మండలంలోని కస్తూరిపల్లికి చెందిన కేశబోయిన జ్యోతి, ఇబ్రహీంనగర్‌కు చెందిన పంతం రామవ్వ, చిన్నకోడూరుకు చెందిన గొడ్డండ్ల శ్యామల, మిరుదొడ్డి మండలం కూడవెళ్లికి చెందిన ఇనుగంటి బాల్‌నర్సవ్వ, దౌల్తాబాద్‌ ‌మండలంలోని కోనాయపల్లికి చెందిన కలాలి శారద, నార్సింగ్‌కు చెందిన పౌడల మంజుల ఉన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి, సర్పంచి కాముని ఉమేష్‌చంద్ర, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే రెండవ విడత గొర్రెల పంపిణీ : మంత్రి హరీష్‌రావు

త్వరలోనే రెండవ విడత గొర్రెలు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన 15 మంది గొర్లకాపర్లకు మంత్రి చేతుల మీదుగా నష్టపరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మల్యాల గ్రామంలో నెల క్రితం పిడుగుపాటుకు మేతకు వెళ్లిన గొర్రెలు చెల్లా చెదురుగా పడిపోయాయని, ప్రకృతి ప్రకోపానికి ఒకేసారి 153 గొర్రెలు మృతి చెందడంతో వాటితోనే జీవనం సాగిస్తున్న గొర్ల కాపర్లు తీవ్ర ఆందోళనకు గురై, ప్రభుత్వం, అధికార యంత్రాంగం తమకు సహకరించి ఆదుకోవాలని వేడుకున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా మృత్యువాతపడ్డ గొర్ల కాపరులకు ప్రభుత్వం తరపున సాయం అందించాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి సత్యపాల్‌ను ఆదేశించడంతో ఈ సందర్భంగా సాయం కింద గొర్రెకు 3 వేల రూపాయలు అందిస్తున్నట్లు, వీటిని సద్వినియోగం చేసుకోవాలని గొర్లకాపర్లను మంత్రి కోరారు. అయితే పిడుగుపాటుకు 153 గొర్రెలు మృతి చెందాయని, ఒక్కొక్క గొర్రెకు రూ.3 వేల రూపాయల చొప్పున మొత్తం రూ.4.59 లక్షల రూపాయలు చెక్కులను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

 

Leave a Reply