ఇక వద్దనిపిస్తుంది
బలవంతంగా లాగే తరుణం
చాలనిపిస్తుంది ఉంటాను
తేలికపాటి రెప్పలపై వాలుతాను
ఏ సన్నని తీగలపై వర్షం వెలిసిన
తర్వాత కునికి పాట్లు తీస్తూ
ఏ మూలనో… ఇంకా రాలేదా
తలుపు తీయలేదా ఇంట్లోకి
పిలవలేదా వసంతాలకై
వేటలు.. వెన్నెలకై వెతలు
ఎవరిని చూసినా ఏ తలం
చరిచినా అవే మాటలు
అవే కూతల మూటలు
విసుగు గొలుపే సలహాల
కలహాల కంపలు ఎందుకు
ఎవరు తెచ్చారు ఎవరు ఉంచారు
అమ్మతో ఉండాల్సింది ఏదో
ఒకటి చేస్తూ నేర్చుకునే వాడిని
నిర్మలంగా ఉండేవాణ్ణి తోటలో
పైకి కళ్ళు చెమ్మగిల్లి ఎద
ఎరుపెక్కి పెదాలు ఏడుస్తాయి
ఇప్పుడు చేసిన తప్పులకు
దాటిన దారులకు ఎవరు చెప్పినా
మోసపూరిత కథనం ఇది!
నీకై నువ్వు నీలోంచి పుట్టిన చెట్టు
అది.. దాని కొమ్మలకు కాయలకు
కర్తవి.. రచించావు ప్రదర్శించు
ముగింపు వెతకకు తేలికగా విడువకు
దాన్ని.. దారిలో వస్తుంటది అదే
ఇప్పుడు కావాల్సినవి ఎక్కడ నుండి
మొదలు పెడతావో చెప్పు ముందు..!!!
– రఘు వగ్గు