రెక్కల పురుగుల పాట

ఎక్కడో ఏ మైదానాల్లో మీరు

అర్రులు చాచడం లీలగా గుర్తుంది

పురిటి నొప్పుల వర్ణపు చాయలు

మబ్బుల నీడగా ఎండ వెంట

పరిగెత్తుతూ ఒక ఎకర్లిక్ చిత్రం

అమ్మ కూలీ పనికి వెళ్తూ

విడిచిన పాదముద్రలు

ఆమె మరణాంతరం

ఏ చేతి హృదయం గాఢంగా తగల్లే

విసిగిస్తున్నట్లుగా సాగే  జీవనం

గుమిగూడిన మంది

రెక్కల పురుగుల కోసం ఆకాశం

మింగుతున్నట్టు

కంటిలో విలాపంతో ఒకానొక

దేశంలో మనకోసం కాపుగాసిన

ఆ జొన్న కంకుల వాసన తగిలినప్పుడు

చేతివేళ్ళు వాటంతటవి

పిడికిళ్ళుగా మొలకెత్తుతాయి

పదేపదే పెదాలు ఆ తూర్పు

రంగు పాటే మొదలెడతాయి

శవాలను వాళ్ళు గీశారు

మనమేమో బ్రతుకును వెతుకుటలో

ఇరికించి క్రోడీకరిస్తున్నాం

తటస్థీకరించడం పరిపాటి

ఓ అలసిన జాతి జనులారా

ఒక పాటను రాసి దాన్ని

మీలోకి వదిలారు వాళ్ళు

పదే పదే పాడేట్టు చేశారు కదా అయ్యో

దేనికైతే మనం విరుద్ధంగా పోరాడవల్సిందో

దాన్ని ఈనాడు మీ నెత్తిన నాట్యమాడిస్తున్నారే

లేవండి నా ప్రజలారా

మనల్ని ఆ కొడవళ్ళు పిలుస్తున్నాయి

నాదిస్తున్నాయి

వినే చెవులు పగ పట్టినట్టు దారి తప్పుతున్నాయి

మాటలు వక్రీకరించబడి దుమ్మెత్తి పోస్తున్నాయి

కళ్ళు వెలుగులు జిమ్మే సమానత్వాన్ని నింపుకోక

మైలపడ్డాయి కదా నా జనులారా

మీకు నేను సత్యాన్ని ఒలిచి

ఇంకో పాటగా మలచగలను

మీ గొంతులో ఆ ధ్వనులను ఉబికి తేగలను

అదే నా అంతిమ లక్ష్యం

మీరు వాళ్ళు కాదు

మీలోని చిక్కటి ఎరుపు రంగు దాడిని లేపండి

అది నిద్రావస్థలో ఉంది

అప్పుడు వాటిని తుదముట్టిస్తుంది

ఇకనైనా మన పాటను ప్రారంభించండి

రఘు వగ్గు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *