అతడు నవలను జయించాడు

చెమ్మ: వారాల ఆనంద్

తెలుగునవలల్లో గ్రామీణ వాస్తవికతను అస్తిత్వ తాత్వికతతో మిళితం చేసిన రచయితల్లో కేశవరెడ్డి ప్రముఖుడు. కేశవరెడ్డి రచనలు సాధారణంగా రాయలసీమ నేపథ్యంలో సాగుతాయి. ‘అతడు అడివిని జయించాడు’ కూడా ఆ ప్రాంతంలోని గ్రామీణ జీవితాన్ని, ప్రజల కష్టాలను, వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఒక పందిని వెతకడం అనే పైపై సాగే కథగా  కాకుండా, ఒక మనిషి తన ఉనికిని, జీవితాన్ని కాపాడుకోవడానికి చేసేయుద్ధం. ఆయన రచనల్లో పల్లెజీవితం- మానవ ఉనికికి అస్తిత్వానికి మనుగడ పోరాటానికి వేదికగా మారుతుంది. కేశవరెడ్డి నవలలు చదవడం అంటే పల్లె గుండె చప్పుడు వినడం. ఆయన రచనల్లో ప్రకృతి ఒక ప్రతీక. మౌనం తీవ్ర ప్రతిఘటన. పోరాటం గొప్ప అస్థిత్వం.  ఆయన నవలల్లోని హీరోలు విజేతలు కాదు అన్నింటిని తట్టుకునే మనుషులు. వాళ్ళ గెలుపు బయటకు కనిపించక పోయినా లోపల ఒక విజయపు వెలుగు విచ్చుకుంటుంది.

కేశవరెడ్డి  ‘అతడు అడవిని జయించాడు’ అడవిని జయించిన ఒక మనిషికథ కాదు మనిషిని పరీక్షించిన అడవికథ. ఈ కథ ఒక పందిని పెంచుకుంటూ జీవనం సాగించే వృద్ధుడి జీవన పోరాటాన్ని, ఒకరాత్రి అతను ఎదుర్కొన్న సవాళ్లను చిత్రిస్తుంది. పందిని కోల్పోయిన తర్వాత, దానిని వెతకడానికి అతను అడవిలో చేసిన అన్వేషణ, ఆ ప్రయాణంలో ఎదురైన క్రూరత్వం, నీచత్వం, అమాయకత్వం వంటి మానవస్వభావాలను నవల ఆవిష్కరిస్తుంది. అడవి అంటే మనిషిలోని ఒంటరితనం. అడవి సమాజం నిరాకరించిన వర్గాలకిచ్చిన  ఆశ్రయం. అడవి అంటే అస్తిత్వపు శూన్యం. కేశవరెడ్డి ఈ నవల ద్వారా చదువరుల ముందు ఒక ప్రశ్న వేస్తాడు “మనిషి నిజంగా జయించేది ఏమిటి?” అది అడవిని మాత్రమే కాదు. తన లోపలి భయాన్ని. ఆకలిని, ఎదుర్కొన్న అణచివేతను. ఇదే కేశవరెడ్డి చెప్పిన సారం.

ఈ నవలలో అడవి బయటకు కనిపిస్తుంది కానీ అసలు అడవి లోపలే ఉంది. అతడు అడవిని జయించాడంటే ప్రకృతిని కాదు, తనలోని వణుకును జయించాడు. అడవిలో అతనువేసిన ప్రతి అడుగు జీవితంలో ఒక ప్రశ్న. ప్రతి చెట్టు సమాజం కట్టిన గోడ ఇది కేవలం ఒక సాహస కథ కాదు. ఒక అస్తిత్వపుగాథ. ఈ నవల ఆధునిక తెలుగు సాహిత్యంలో అస్తిత్వ తాత్వికత, సామాజిక వాస్తవికత, ప్రతీకాత్మక కథన నిర్మాణం ఈ మూడింటిని కలిపిన సంగమంగా నిలుస్తుంది.

‘అతడు అడివిని జయించాడు’లో పల్లెచివర అరణ్యం ఉంటుంది. పేరు చెబితేనే గ్రామస్థుల గుండెల్లో గుబులు. మృగాలు ఉన్నాయని, వెళ్తే దారి తప్పిపోతారని భయం. వెళ్లి తిరిగివచ్చిన వాళ్లు లేరని ఒక విశ్వాసం. ఒకరోజు అతడు ఆ అడవిలోకి అడుగుపెడతాడు. అతనికి తిరిగి వెనక్కి వెళ్లేదారి లేదు. గ్రామంలో అప్పులు,  అవమానాలు, నిరాశలు నలిపేశాయి. అయితే బతకాలి లేక చావాలి. అతని ముందున్న ఏకైకదారి ఆ అడవి. మొదటి రోజు అతనికి మొత్తం భయం. చెట్లనీడలు మృగాల్లా కదిలినట్టు అనిపిస్తాయి. గాలివాన గర్జనలో తన గుండె దబదబ లాడుతుంది. రెండోరోజు ఆకలేస్తుంది. తినడానికి ఏమీలేక చెట్లపై పండ్లను చూసి ఎక్కి జారిపడిపోతాడు. గాయమవుతుంది. రక్తం కారుతుంది. ఇక అప్పుడు అతనికి తెలిసిందేమిటంటే ఇక్కడ బతకడం అంటే ప్రతిక్షణం పోరాటం. మూడోరాత్రి అతను నక్షత్రాలవైపు చూసి “నేను ఎందుకు వచ్చాను?” అని ప్రశ్నించుకుంటాడు.

“బతకడానికి.” అన్న జవాబు ఒక్కటే అనిపిస్తుంది. అడవి ఊరుకోదు అతన్ని పరీక్షిస్తుంది. దారి తప్పిస్తుంది అనేకమృగాల భీకరకేకలు వినిపిస్తాయి. కానీ వెనక్కిమళ్లడు. ఒక ఉదయాన దూరంగా వెలుగురేఖ కనిపిస్తుంది. అతను పరుగు తీస్తాడు. దట్టంగా వున్న చెట్లు పలుచబడ్డాయి. ముందు ఓ చిన్నప్రవాహం, ఆవలివైపు ఓ పల్లె. అంతే అతడు అడవిని దాటేశాడు. కానీ అసలు జయం అడవిని దాటడంలో లేదు. అతను దాటింది తనలోని భయాన్ని. అతను జయించింది తనలోని ఓటమిని. గ్రామానికి చేరుకున్నప్పుడు అలసిపోతాడు కానీ ఆతనికళ్ళల్లో ఏదో కొత్తవెలుగు. అడవి ఎప్పటిల్లాగే అక్కడే ఉంది. కానీ ఇప్పుడు అతనికి అది శత్రువు కాదు. తనబలాన్ని గుర్తుచేసిన గురువు.

అతడు అడివిని జయించాడు నవలకు ‘ఓల్డ్ మాన్ అండ్ సి’ నవల ప్రేరణ అంటారు. నిజానికి ఈ రెండు నవలలు మనిషి చేసే  రెండు జీవనయాత్రలు, వాళ్ళుచేసే రెండు సంఘర్షణలు. అడవిలోని ఒంటరితనం సామాజికంగా అణచివేతల మధ్య చిక్కుకున్న మనిషి బాధ. కాగా  ఓల్డ్ మాన్ అండ్ సి లో సముద్రంలోని ఒంటరితనం విధి ముందు నిలబడిన మనిషి గౌరవం.

కేశవరెడ్డి నవలలో అడవి గర్జించింది. అతడు భయపడ్డాడు. కానీ ఆతని నడక ఆగలేదు. ఓల్డ్ మాన్ అండ్ సి లో  సముద్రం ఉప్పొంగింది. వృద్ధుడు అలసిపోయాడు. కానీ చేతులు విడువలేదు. ఒకడేమో చెట్లమధ్య తననుతాను కనుగొంటే మరొకడు అలలమధ్య తన గౌరవాన్ని కనుగొన్నాడు. ఇక్కడ అడవిచివర వెలుగు ఉంటుంది. అక్కడ సముద్రంచివర ఉదయం ఉంటుంది. మనిషి జీవితం కూడా అలాంటిదే. చీకటిగుండా నడిచే వెలుగు ఆ ప్రయాణం. అతడు అడవిని జయించినా, సాంటియాగో సముద్రాన్ని గెలిచినా చివరికి గెలిచింది ప్రకృతి కాదు గెలిచింది అసాధ్యాన్ని ఎదుర్కొన్న మనిషి ధైర్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *