చింతల చేను ‘చింత’ తీరింది.

“నా అనుభవంలో నాలుగు ఏకాదశులు చూశాను. కర్నూలు జిల్లా రైతుల ఎర్రగడ్డల ఘాటు ఏడుపులు, కడప జిల్లా అరటి ఆర్తనాదాలు, చిత్తూరు జిల్లా వాడినపూలు, అనంతపురం జిల్లా వేరుశనగ వేదనలు, ఏ రైతూ నేను సుఖంగా ఉన్నానని చెప్పడం లేదే. ఓరి దేవుడా! ఎవరు వస్తారు? ఎవరోచ్చి వీరి బాధలు తీరుస్తారు? ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప రాయలసీమ రైతుల జీవితాల్లో వెలుగు రాదేమో?” బాధగా మనసు మూల్గింది. దృష్టి మరల్చుకోవాలని తలతిప్పాడు” ఇది కథమధ్యలో ‘చింతల చేను’ కథాకథనంలో ప్రధాన పాత్రధారి గుణశేఖరుడు తనలోనే తాను అనుకొంటున్న సందర్భం.

      గుణశేఖరుడిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఊరిపట్టున ఉండేవాడు. నిన్నమొన్నటివరకూ పట్నంలో ఆటో నడిపినాడు. ఇప్పుడు ఆటో నడపటం లేదు. కారణం తెలీదు. వారిది పాత చిత్తూరుకు కూతవేటు దూరంలో ఉన్న రాసపల్లి గ్రామం. విరిగిన ఎముకలకు ప్రకృతివైద్యం ద్వారా నయం చేయడంలో పేరెన్నికగన్న చిన్న ఊరు అది.

      కృష్ణస్వామి రచనల్లో పుత్తూరు రాసపల్లి ఎముకల వైద్య చికిత్స ప్రాధాన్యత ప్రస్తావన ఉండకపోతే ఆశ్చర్యం. కృష్ణస్వామి పేరుకు తిరుపతిలో ఉన్నా ఆయన అంతరంగం చిత్తూరు చుట్టూ ఉండే పల్లెలకు, దేవాలయాలకు, జాతరలకు అల్లుకుపోయి ఉంటుంది. చిత్తూరు పల్లెలపేర్లు, ఆ సుందర ప్రాంతాల వర్ణనలు, అక్కడి పల్లెజీవిత చిత్రీకరణ పాఠకులను ఏదో ‘మధురోహల’లోకి, ‘అందమైన ప్రదేశాల’ విహారానికి తీసుకెళ్తాయి. ఆయన అక్కడి పల్లెటూరి జీవనసౌందర్య వైచిత్రిని ఒడిసిపట్టే రచనా మాంత్రికుడు. గ్రామీణ సౌందర్య ఆరాధకుడు.

     అక్కడ ఊరికి ఉత్తరాన ఉంది మీనాక్షయ్య టీ అంగడి. అక్కడ లభించే వేడి వేడి టీ తాగడానికి జనం మీనాక్షయ్య అంగడి కాడ నిలబడి ఉన్నారు. అక్కడికే వచ్చాడు గుణశేఖరుడు ఉదయాన్నే టీ తాగడానికి. ఇక్కడ అనుకోకుండా జరిగిన సంభాషణ గుణశేఖరుడి జీవితాన్నే మార్చేస్తుంది. అదేమిటంటే ఆ ఊరి వెంకటముని అనే ఇన్సూరెన్స్ ఏజెంట్ టీ తాగుతున్న గుణశేఖరుడిని చూసి, ‘గుణశేఖరా నీకు డ్రైవింగ్ తెలుసుకాబట్టి ఒక ట్రాక్టర్ కొని బాడుగకు తిప్పకూడదా, కాలం కలిసి వస్తే కోటీశ్వరుడవు అయిపోతావు. ఆలోచించు!’ అని అంటాడు. అందుకు మద్దతుగా మీనాక్షయ్య కూడా ట్రాక్టర్ కొనటం వలన ఆదాయం ఎలా సమకూడుతుందో చక్కగా వివరిస్తాడు. వెంకటముని పత్రికలో ఆ రోజు వచ్చిన ఎలక్ట్రికల్ ట్రాక్టర్ ల గురించి, వాటిపై అయ్యే తక్కువఖర్చు గురించి చెబుతాడు. అన్నీ విని గుణశేఖరుడు ఆలోచనలో పడతాడు.

      వారినీ వీరినీ విచారించగా ఊటుకూరు వేణుగోపాలన్న అనే  ఆయన దగ్గరున్న ట్రాక్టర్ ను అయిదు లక్షలకు అమ్మేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అంత డబ్బు గుణశేఖరుడి దగ్గర లేదు. అయినా ‘ఆశ’ అనే ఇంధనం గుణశేఖరుడిని అప్పైనా చేసి ట్రాక్టర్ కొనమని ముందుకు తోస్తుంది. చివరకు ఆ ఊర్లో సిద్దిరాజు అనే వడ్డీవ్యాపారిని బ్రతిమాలితే ట్రాక్టర్ కొనడానికి కావలసిన అయిదు లక్షలు మూడు శాతం వడ్డీపై ఇవ్వడానికి ఒప్పుకొంటాడు. ‘అయితే ప్రతినెలా వడ్డీ పదిహేనువేలు, అసలు పాతికవేలు కలిపి నలభైవేలు కట్టాలి. లేకపోతే బండి ఎత్తుకెళ్ళి పోతాను’ అని నిష్కర్షగా చెబుతాడు. అందుకు గుణశేఖరుడు సిద్ధపడటంతో కాగితం రాయించుకొని, డబ్బులు చేతిలో పెడతాడు సిద్దిరాజు.

       గుణశేఖరుడి అమ్మ పేరు నారాయణమ్మ. భార్యపేరు హైమావతి. కొడుకు పేరు బాలాజీ. ఇవి ప్రధానపాత్రలు. ఇతరపాత్రలు కథానుగతంగా వచ్చిపోతుంటాయి. వాటిలో గుణశేఖరుడికి కొంచెం మేలుకోరే పేరు ఇన్సూరెన్సు ఏజెంట్ వెంకటముని.  ఏ కళనున్నాడో గాని, వెంకటముని ముందుగానే గుణశేఖరుడికి బండి ఇన్సూరెన్స్ విషయం చెప్పి నెలకు పధ్నాలుగు వేలు ఇన్సూరెన్స్ చేయించాడు. లేకపోతే తరువాత గుణశేఖరుడి ట్రాక్టర్ కైన ప్రమాదాలకు ఒక్క పైసా చేతికొచ్చేది కాదు.

       ట్రాక్టర్ కొన్న మరుసటి రోజునుంచే ఆ పని, ఈ పని అని ట్రాక్టర్ కోసం రావటం మొదలెట్టారు ఆ గ్రామాల ప్రజలు. వచ్చినవాళ్లు కొందరు డబ్బు మొత్తం గంట లెక్కన గుణశేఖరుడి చేతిలోబెడితే, కొందరు సగం ఇవ్వటం, మరికొందరు ‘ఇప్పుడు లేవు, ఖాతా రాసుకో, తరువాత ఇస్తాం’ అని చెప్పటం మొదలు పెట్టారు. దీనితో నెల, నెలా వడ్డీ, అసలు సిద్దరాజుకు ఇవ్వటం గగనమైపోయింది గుణశేఖరుడికి.

        బండి తెచ్చే ప్రయత్నంలో ఉన్నప్పుడే గుణశేఖరుడికి రకరకాల మనుషులు తారసపడతారు. వాళ్లలో ఒకడు ట్రాక్టర్ అమ్మేసి మోటర్బైక్ కు ట్రాలీ జోడించి కూలీలను పని చేసే స్థలానికి తీసుకెళ్లే స్నేహితుడు. వాడు చెప్పకనే చెబుతాడు, ట్రాక్టర్ కు డబ్బులు ఇచ్చే వాళ్ళు తక్కువ, బకాయీలు పెట్టేవారు ఎక్కువ ఉంటారని. అలాగే, చిన్ననాటి స్నేహితుడొకడు తెలుగు పండిట్ కోర్సు చేసి, కవిత్వాలు రాస్తూ, టీచర్ ఉద్యోగం చేస్తూ రాష్ట్రం అంతా ప్రసిద్ధుడైనానని చెబుతాడు గుణశేఖరుడికి దారిలో కనపడి. ఇలా బ్రతుకుతెరువుకు వేరే మార్గాలున్నాయని గుణశేఖరుడికి ట్రాక్టర్ ఇంటికి చేరేప్పటికే తెలియచెబుతాడు రచయిత. కానీ , గుణశేఖరుడు వీటి గురించి ఆలోచించినట్టు కనపడదు కథా కథనంలో. అంటే పాఠకుడికి ముందే రచయిత ఒక విషయం స్పష్టంగా చెప్పినట్టు. అదేమిటంటే గుణశేఖరుడు సరైన నిర్ణయం చేయలేదని, ఆ విషయం అతను ట్రాక్టర్ కొనేప్పటికే ఆలస్యంగా తెలిసిందని.

(ముగింపు వచ్చేవారం)

-డా. కొప్పరపు నారాయణ మూర్తి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *