కన్నవారి మది “ఆనందడోలికలూగే”
“సిరులొలికించే” మోము,
అరవిందములవంటి
కోమల హస్తాలు కలిగి,
ఆత్మీయ సౌగంధికలను అందించే
అంతఃసౌందర్యం ఆ జవ్వని సొంతం.
అపర “వాగ్దేవి”యైన
ఆమె రసనపై నర్తించే ప్రతి పలుకూ
మధువులొలికే వాగమృతమే,
ప్రతి అడుగూ ఆదర్శభరితమే.
మమతలుపంచే ఆమె లోచనాలు
వెన్నెలకాంతులు కురిపిస్తూ,
అనురాగసుధలనందివ్వగా,
అధరాలపై తారాడే “చంద్రిక”లాంటి
దరహాసంతో భాసించే
సమధిక మనోఙ్ఞ
శిరీషకుసుమఫేశలి అయి
అనురాగ మధురిమలు అందించే
నెచ్చెలి జన్మదినం,
మంచికి కోవెల కట్టిన సుదినం.
సఖీ!
కమలబాంధవుని సుషమ
“నీ యశస్సై జగతిని భాసించాలంటూ”
ఆశించే మనసుల దీవెనలొంది
అందుకో ఉన్నత శిఖరాలు,
కొనియాడుచూ జైకొట్టగ కరాలు.
వేమూరి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం వారి
గిడుగు పురస్కార గ్రహీత
మరియు
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి
సాహితీ పురస్కార గ్రహీత
9912128967
తాడేపల్లిగూడెం