మీట్ ది ఫ్రెండ్!

  • మెరుపు తీగెలు

“అబ్బా… మొత్తానికి యిలాగ యిక్కడైనా కలిశాం… గ్రేట్” నమ్మలేనట్టుగా అన్నాడు శశి, కలిపిన చేతుల్ని అభిమానంగా నొక్కుతూ. “చాలా రోజులయిపోయిందేం?” సుధా ప్రశ్నలో పలుకరింపు కంటే పశ్చాత్తాపమే యెక్కువ. “రోజులూ వారాలూ కాదు, నెలలూ కాదు, సంవత్సరాలైపోయింది…” అన్నాడు శీను, యిది సరిగా లేదన్నట్టు.  “తెలియందేముంది? సిటీలైఫ్… యింట్లోవాళ్ళకే టైమ్ యివ్వలేకపోతున్నాం…” అన్నాడు రాజు, వొప్పుకున్నట్టు. పూల వాసనతో కలిసివచ్చే పొగ వూపిరాడకుండా చేస్తోంది. “ఎలావున్నావ్?” “బాగున్నావారా?” “పిల్లలా?” “స్కూలుకు కూడా వెళుతున్నార్రా”- లాంటి పొడి పొడి మాటలు ముగిశాయి. మామూలయ్యారు.  “అవాళ వీళ్ళావిడ చాలా భయపెట్టేసిందిరా బాబూ… చాలా షాకింగ్‌గా అంది…” యిప్పటికీ మర్చిపోలేకపోతున్నట్టు తలవిదిల్చిమరీ అన్నాడు సుధ.

రాజు సిగ్గుపడ్డాడు అనడం కంటే యంబేరసింగ్ ఫీలయాడు అనడం కరెక్టుగా వుంటుంది.“ఏమందిరా?” శీను చాలా ఆసక్తిగా చూశాడు. “నీకు తెలీదా? మా యింట్లో మా ఆవిడకు చెప్తే నేనూ అదే చెయ్యాలి- అందిరా” అన్నాడు సుధా. ఆగలేనట్టు శీను వేసిన ప్రశ్నే వేశాడు. “నువ్విలా యింటికి ఆపరాత్రీ అర్ధరాత్రీ వచ్చావంటే నేను యెవడితోనో లేచిపోతా…” శశి మాటలు పూర్తికాలేదు, అంతా పగలబడి నవ్వారు. చుట్టూవున్న జనం చూస్తున్నారని బాగోదని అతి కష్టంమీద కంట్రోలు అయ్యారు.

“మా పాపయితే నన్ను గుర్తుపట్టడం లేదురా, యీ క్యాంపులు కాదుగాని…” శీను గిల్టీ ఫీలవుతూ అన్నాడు. “ఒరేయ్… మనం వేరే వేరే వూళ్ళలో వుంటే అప్పుడప్పుడయినా కలిసేవాళ్ళమేమో, సిటీలో వుంటే యింతే…” యేమీ చెయ్యలేమన్నట్టుగా అన్నాడు రాజు. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. దూరంగా యేడుపులు. ప్రపంచం యెవరికోసం ఆగదనడానికి సాక్ష్యంగా పంజాగుట్టా నాగార్జున సర్కిల్ ట్రాఫిక్ రొద కూడా చెవుల్లో వచ్చి చేరుతోంది. “మిమ్మల్నందర్నీ కలపాలంటే నేను చావాల్రా?” ఫ్రెండు మాట వినిపించింది. ఉలిక్కిపడిన నలుగురు మిత్రులూ వొక్కసారిగా తలలు తిప్పి చూశారు.

చితిలో కాలుతూ లేచి మరీ అడిగాడు వాళ్ళ దోస్తు!

 -బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *