నేర పరిశోధనా వ్యవస్థ మనకు ఉందా?

ఎక్కడ చూసినా మహిళలపై శారీరక, మానసిక హింస.. కుటుంబ సభ్యులు సహా ఇరుగుపొరుగు వారి వేధింపులు.. కార్యాలయాల్లో అరాచకాలు.. కనురెప్పలనే నమ్మలేని దురవస్థ.. బయటకు చెప్పుకుంటే వేధింపులు పెరుగుతాయనే భయం.. సంరక్షించేవారు లేరనే ఆవేదన.. చుట్టూ ఉన్నవారు నచ్చచెప్పే ప్రయత్నమే తప్ప- తప్పు చేసిన వారిని నిలదీసే యోచన లేకపోవడం.. అవతలి వారు శక్తిమంతులని తెలిశాక ఏర్పడే నిస్తేజం.. ఇవన్నీ కలసి మానసిక రుగ్మతలకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి తమపై జరిగిన వేధింపులను ధైర్యంగా బహిర్గత పరిస్తే- వారిపై జరుగుతున్న దాడులు లెక్కలేనివి.. సమాజం వారిని ఏకాకిని చేస్తున్న తీరు అందర్నీ కలచివేస్తోంది. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించడమే గొప్ప సవాలు.. వాస్తవ పరిస్థితులను చెప్పుకుంటే దానికి వక్రభాష్యం చెప్పి సరికొత్తగా బెదిరింపులకు దిగడం- సమాజం గాడితప్పిన తీరును స్పష్టం చేస్తోంది.

సంఘటనలు నమోదు కాకుండా నియంత్రించే
సామాజిక స్పృహ, చైతన్యం ప్రజల్లో ఉందా?

మహిళలపై దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులకు సంబంధించి చాలా పకడ్బందీ చట్టాలు, కఠినమైన శిక్షలు ఉన్నాయి. అత్యంత కఠినమైన ఉరిశిక్ష విధించేందుకూ చట్టాలున్నాయి. వీటిపై సమాజంలో పూర్తి అవగాహన లేకున్నా, కొంత మేరకు తెలిసినా.. దాడులు మాత్రం నిత్యకృత్యం. మన దేశంలో ఆరు ప్రధాన చట్టాలు మహిళా సంరక్షణకు ఉద్దేశించినవే. 12 ఏళ్ల లోపు బాలలు, 12 నుండి 16, 16 నుండి 18 ఏళ్ల ప్రాయం, 18 ఏళ్లు మించిన వారి పట్ల జరిగే దాడులకు సంబంధించి వేర్వేరు చట్టాలు వర్తిస్తాయి. భారత శిక్షా స్మృతి-1860, గృహహింస నిరోధక చట్టం-2005, బాలలపై లైంగిక అత్యాచారాల నిరోధక చట్టం -2012(పాస్కో చట్టం), పని ఆవరణలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టం-2013, సామాజిక మాధ్యమాల ద్వారా లైంగిక వేధింపులు, బెదిరింపులను నిరోధించే ఐటీ చట్టం-2000, స్త్రిలను అసభ్యంగా చిత్రీకరించడం, ప్రదర్శించడం నిరోధిస్తూ రూపొందించిన ఐఆర్‌ చట్టం -1987 ఉండనే ఉన్నాయి.

ఇన్ని చట్టాలున్నా మహిళలపై పలు రూపాల్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.  దేశంలో 92 శాతం అత్యాచార కేసులు వీగిపోతున్న తరుణంలో, పది పదిహేనేళ్ల క్రితం లేదా అంతకంటే ముందే జరిగిన లైంగిక ఆరోపణలను రుజువుచేసే నేరపరిశోధనా వ్యవస్థ మనకు ఉందా? అన్నది ఒక ప్రశ్న. కొత్తగా అలాంటి సంఘటనలు నమోదు కాకుండా నియంత్రించే సామాజిక స్పృహ, చైతన్యం ప్రజల్లో ఉందా? అనేది మరో ప్రశ్న. భద్రత ఎంత పటిష్టంగా ఏర్పాటు చేసినా, దేశాల ప్రధానులే తుపాకీ గుళ్లకు బలైపోయినపుడు, చట్టాలు ఎంత పటిష్టంగా రూపొందించినా , విచ్చలవిడితనం పెరిగిపోతున్నపుడు కొత్త కొత్త కమిటీలు ఈ వ్యవహారాలను ఎంత వరకూ నిరోధిస్తాయి? వాస్తవాలు వెలికితీస్తాయి? అనేది ప్రశ్నార్థకమే. బాధితురాళ్ల వేదన, క్షోభను తాను అర్థం చేసుకోగలనని, మరికొంత మంది మహిళలు ముందుకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలను వివరించాలని పాలకులు  పిలుపునిచ్చినా- ఆ ధైర్యం ఎంత మంది మహిళలకు ఉందన్నది అనుమానాస్పదమే.

లైంగిక వేధింపుల కేసులు చాలా కాలంగా ఉన్నా మనం పట్టించుకోవడం లేదన్నది నిర్వివాదాంశం. ఇపుడు బాధితురాళ్లు వాటిని ఎలా నిరూపిస్తారనేదే ప్రశ్నార్థకమే. మంత్రులు, సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలపైనా లైంగిక, అనుచిత ప్రవర్తనలకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాళ్లు చెప్పిన దానిని నమ్ముతున్నా, వారి క్షోభను అర్థం చేసుకోగలిగినా,  ఉద్యమంలో భాగంగా వెలుగు చూస్తున్న ఇలాంటి కేసులు విచారణకు న్యాయనిపుణులతో కమిటీని నియమించాలని కేంద్రం యోచిస్తున్నా- అది ఎంత వరకూ సఫలీకృతం అవుతుంది? లైంగిక వేధింపులపై ఫిర్యాదులను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న న్యాయ, చట్టబద్ధమైన ఏర్పాట్లు పరిశీలించి, వాటిని బలోపేతం చేయడానికి మంత్రిత్వశాఖకు కొత్తగా ఏర్పడే ఆ కమిటీ సూచనలు, సలహాలను ఇస్తుంది. లైంగిక వేధింపుల గురించి పాతికేళ్లుగా వింటున్నా, వాటిని చర్చించడానికి, మాట్లాడటానికి వెనుకాడుతున్నాం. ఇన్నేళ్ల తర్వాత బాధితులు వాటిని ఎలా నిరూపిస్తారనేది పెద్ద ప్రశ్న. వేధించిన వారి పేర్లను నిర్భయంగా బయటపెట్టడం ద్వారా బాధిత మహిళల్లో ఎంతోకొంత సాంత్వన కలగడం ఖాయం. అజ్ఞాతంగా కూడా ఫిర్యాదులను నమోదు చేసే వీలుకల్పిస్తున్నారు. షీ బాక్స్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్‌ సైట్లలో లైంగిక వేధింపులపై ఫిర్యాదులను నమోదు చేసే వీలుంది.

తెలుగు చిత్రపరిశ్రమలో, టీవీ రంగంలో జరుగుతున్న వ్యవహారాలపై  కళాకారులు, టీవీ ఆర్టిస్టులు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అనేక మంది తమిళ, మలయాళ, కన్నడ, హిందీ హీరోయిన్లు కూడా తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. న్యూ యార్క్‌కు చెందిన తరానా బర్క్‌ తొలుతం ‘మీటూ’ కార్యక్రమాన్ని వెలుగులోకి తెచ్చింది. ‘గర్ల్స్‌ ఫర్‌ జెండర్‌ ఈక్విటీ’ సంస్థలో పనిచేసిన ఆమెపై రెండు మార్లు అత్యాచారం జరగడంతో 2006లో ధైర్యాన్ని కూడగట్టుకుని తన బాధను తెలిపే వివరాలను అంతర్జాలంలో పోస్టు చేసింది. అలా ‘మీటూ’ ఉద్యమం మొదలైంది. హిందీ నటి తనుశ్రీ దత్తా ఒక సీనియర్‌ హిందీ నటుడి వల్ల తానెంత బాధలు ఎదుర్కొన్నదీ 15 ఏళ్ల తర్వాత చెప్పింది. క్వీన్‌ దర్శకుడు వికాస్‌ బహల్‌పై కంగనా రనౌత్‌ ఆరోపణలు చేశాక- లైంగికంగా వేధించిన వారి పేర్లు బహిరంగపరిచే వారి సంఖ్య జోరందుకుంది. గాయని చిన్మయి, ఫోరా షైనీ వంటి సెలబ్రిటీలు తమ బాధలను చెప్పుకొచ్చారు. ఇదంతా సమసిపోకముందే ‘మీటూ’ ఉద్యమ కెరటం సినీరంగం నుండి మీడియా, రాజకీయ రంగాలను తాకింది. 1997 నిబంధనావళి స్థానంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టం -2013 రూపొందింది. అప్పట్లోనే భారతీయ శిక్షా స్మృతిలో శిక్షలు పేర్కొంటూ సెక్షన్‌ 354ను చేర్చారు. ఏ పరాయి స్త్రినైనా అపరిచితంగా తాకితే ఐదేళ్ల వరకూ కారాగార శిక్షతో పాటు భారీ జరిమానాకు ఈ సెక్షన్‌ వీలు కల్పిస్తుంది. వేధింపు ఘటనలపై ఆయా సంస్థల యజమానులే ఫిర్యాదు చేసి చట్టపరంగా శిక్షపడేందుకు దోహదపడాలని కూడా సుప్రీం స్పష్టం చేసింది.

కనీస ఆధారాలు దొరికినా వెంటనే చర్యలు తీసుకునేలా విధివిధానాలను నవీకరించాలని సూచించింది. పురుషాధిక్య భావజాలాన్ని అదుపు చేసేందుకు, స్త్రిలపై లైంగిక వేధింపులు, భౌతిక దాడులను అదుపు చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మరింతగా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. పని ప్రదేశంలో దాడి జరిగితే దానిని ఐపీసీ, వర్క్‌ప్లేస్‌ యాక్టు ద్వారా ఎదుర్కోవచ్చు, అదే పెళ్లయిన మహిళ ఇంటివద్ద జరిగితే దానిని ఐపీసీ, డీవీ యాక్టు కింద ఎదుర్కోవచ్చు. బాధితురాలు బాలిక అయితే దానిని పాస్కో చట్టం కింద ఎదుర్కోవచ్చు. ఐపీసీ -1860 సెక్షన్‌ 294 ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలమైన విన్యాసం జరిపినా లేక అశ్లీలంగా మాట్లాడినా, పాటలు పాడినా మూడు నెలల వరకూ జైలు శిక్ష లేదా జరిమానా.. అవసరమైతే రెండూ విధించవొచ్చు. ఈ నేరం బెయిల్‌ ఇవ్వదగిందే, రాజీ పడేందుకు వీలు లేనిది, సమన్లున్న కేసు, మెజిస్ట్రేట్‌ దీనిని విచారిస్తారు. సెక్షన్‌ -354 ఐపీసీ ప్రకారం సబ్‌ క్లాజ్‌ ఎలో లైంగిక వేధింపులు, అందుకు శిక్ష నిర్వచించారు. సబ్‌ క్లాజ్‌-బి కింద మహిళలపై బలప్రయోగం చేయడం, వివస్తన్రు చేయడం , స్త్రిలకు సంబంధించి వారి రహస్య, వ్యక్తిగత చర్యలను చూడటం లేదా ఫొటోలను తీయడం, సబ్‌ క్లాజ్‌- డీలో ఒక మహిళను వెంబడిరచడం, చనువుగా ఉండేందుకు ప్రయత్నించడం లేదా వేధించడం వంటి నేరాలకు శిక్షలు వివరించారు.

సెక్షన్‌ -370లో మహిళలతో అక్రమవ్యాపారం, దోపిడీ నిమిత్తం బెదిరించడం, దౌర్జన్యంగా గానీ మరోవిధంగా గానీ ఎత్తుకుపోవడం, మోసం చేయడం, అధికార దుర్వినియోగం ద్వారా డబ్బు ఇతర ప్రయోజనాలు ఎరగా పెట్టి ప్రభావితం చేసి ప్రలోభ పెట్టడం, సెక్షన్‌ 370(ఎ)లో లైంగిక దొపిడీ ద్వారా అక్రమలాభార్జన, సెక్షన్‌-371లో బానిసలతో వ్యాపారం, సెక్షన్‌ 372లో వ్యభిచారం నిమిత్తం మైనర్లను అమ్మడం, సెక్షన్‌ -373లో వ్యభిచారం చేయించేందుకు మైనర్లను కొనుగోలు చేయడం, సెక్షన్‌ -374 కింద బలవంతంగా శ్రమ చేయించడం, సెక్షన్‌ -375లో మానభంగం, సెక్షన్‌ 376-ఎలో అత్యాచార యత్నంలో బాధితురాలిని హత్యచేయడం, భర్త నుండి దూరంగా ఉంటున్న భార్యతో శారీరక సంబంధానికి సైతం సెక్షన్‌ 376(బి)లో శిక్షలున్నాయి. అయితే ఈ సెక్షన్‌కు సుప్రీం కోర్టు సవరణలు కల్పిస్తూ మహిళ అనుమతితో శారీరకంగా కలవడాన్ని తప్పుగా భావించడానికి వీలు లేదని నిర్వచించింది. సెక్షన్‌ 376-సీ, డీ, ఈ, సెక్షన్‌ -377ల కింద అనేక రకాల నేరాలకు శిక్షలను రూపొందించింది. ఇన్ని చట్టాలున్నా నేరాల సంఖ్య రానురానూ అధికం కావడం దారుణం. సామాజిక వ్యవస్థలో మార్పు రానంత వరకూ , నైతిక విద్యా బోధన ద్వారా స్త్రి, పురుషులు తమ పరిమితులను అర్థం చేసుకునే వరకూ, అవినీతి అంతరించే వరకూ పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశించలేం.

-కల్లూరి రామకృష్ణా రెడ్డి
సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌
సెల్‌ : 9502728827

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page