- తెలంగాణ అధికారులను నిలదీసిన ఏపీ అధికారులు
- నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం
నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్ 9 : నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది. శనివారం ఉదయం సాగర్ కుడి కాలువ వాటర్ లెవల్స్ తీసుకోవడానికి తెలంగాణ అధికారులు వెళ్లారు. దీంతో ఆంధ్ర అధికారులు వారిని అడ్డుకుని.. ఇక్కడ మీకేం పని అంటూ నిలదీశారు. నీటి విడుదలకు సంబంధించిన లెక్కలు చేప్పేది లేదని, రీడింగ్ తీయొద్దంటూ అడ్డుకున్నారు. మీరు ఎవరికైనా చెప్పుకోండని బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో విషయాన్ని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు, కేఆర్‌ఎంబీ సమాచార గ్రూపులతో పాటు అధికారులకు నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ ఇరిగేషన్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులను కేఆర్‌ఎంబీ అధికారులు సర్ది చెప్పారు. గతేడాది నవంబర్‌లో నాగార్జున సాగర్ డ్యామ్‌పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం తలెత్తడంతో ఏపీ, తెలంగాణ పోలీసులు డ్యామ్‌పై పెద్దఎత్తున మోహరించారు. డ్యాప్‌పై కంచెలు వేసి ఇరువైపులా భారీగా బలగాలను దించడంతో యుద్ధవాతావరణం నెలకొన్నది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ నవంబర్‌లోనే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగడం విశేషం.