విపక్షాల విమర్శలు.. స్వీయపార్టీలో కలహాలమధ్య నలుగుతున్న కాంగ్రెస్‌

 ( మండువ రవీందర్‌రావు )
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్న తరుణంలో ఆపార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల మధ్య సమన్వయం పూర్తిగా లోపించడంతో క్యాడర్‌ అయోమయానికి గురవుతున్నది. నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చివరకు దాడులకు దారితీస్తున్నది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఇటీవల నిర్వహించిన వివిధ నియోజకవర్గాలవారీ సమావేశంలోకూడా నాయకుల మధ్య ఉన్న విభేదాలు వెలుగుచూశాయి. ఏఐసిసీ ఇన్‌ఛార్జీ దీపాదాస్‌ మున్షీ ముందే పాత, కొత్త నాయకులు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిషలు కష్టపడినా తమను పార్టీ పట్టించుకోవడంలేదని క్యాడర్‌ వాపోవడం గమనార్హం. కొత్తగా పార్టీ కండువ కప్పుకున్నవారికి పదవుల్లో, టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇవ్వడంపైన వారు తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎవరిది పైచెయ్యి అన్నవిషయంలోనే ఈ తగాదాలకు కారణంగా మారుతున్నది. ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాల్లో పదవులు అనుభవిస్తున్న నాయకులు ప్రోటోకాల్‌ పాటించడంలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలోనే ఇలాంటి ఆరోపణలు తాజాగా వెలుగులోకి వొచ్చాయి.

గ్రేటర్‌ మేయర్‌కు, కార్పోరేటర్లకు మధ్య ఏమాత్రం పొసగటంలేదు. ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ పాటించడంలేదని ఇటీవల ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ నాయకురాలు విజయారెడ్డి మొదలు డిప్యూటీ మేయర్‌ శోభనారెడ్డి, ఆజారుద్దీన్‌ తదితురులు పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదుచేయడం గమనార్హం. ఇక జిల్లాల విషయానికొస్తే అనేక జిల్లాలో ఇలాంటి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గంలో స్థానిక ఎంఎల్‌ఏ మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి మధ్య ఎన్నికల నాటినుండీ పడటంలేదు. అలాగే ఆదిలాబాద్‌లోని నిర్మల్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి స్థానిక కాంగ్రెస్‌ నేత శ్రీహరిరావు మధ్య పొసగటంలేదు. ఖైరతాబాద్‌లో బిఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎంఎల్‌ఏగా గెలిచిన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరారు. అప్పటివరకు అక్కడ కాంగ్రెస్‌ నాయకురాలిగా కొనసాగుతున్న పిజెఆర్‌ కూతురు విజయారెడ్డిల మధ్య ఆదిపత్యపోరు కొనసాగుతున్నది. నిజామాబాద్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసి ఓడిన ఏనుగు రవీందర్‌రెడ్డికి, బిఆర్‌ఎస్‌నుంచి ఎంఎల్‌ఏగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. కాగా పోచారంకు స్థానిక నాయకుడు బాలరాజు తోడవటంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదిలాఉంటే వరంగల్‌ రాజకీయాలు మరింత ఘాటెక్కిస్తున్నాయి. కొండా సురేఖ తీరు ఇటు పార్టీలో అంతర్ఘత విభేదాలకు, అటు పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించేదిగా మారింది. ఆమె ఒకరిని టార్గెట్‌ చేయబోయి, మరొకరిపై అబాండం వేయడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. ఆమె చేసిన ఆరోపణలపై సినీ ప్రముఖుడు అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేయగా, తనపై ఆధారాలు లేని ఆరోపణ చేసిందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్‌కూడా వేసిన పరువునష్టం దావా కాంగ్రెస్‌ పార్టీ పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. కాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని శాసనసభ్యులు పలువురు మంత్రి కొండా సురేఖ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు దిల్లీ  వెళ్ళేందుకు సిద్దమయ్యారు. పిసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ జోక్యంతో తాత్కాలికంగా వారి దిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకులు ఇలా విభేదించుకోవడం మంచిదికాదని మహేష్‌ కుమార్‌గౌడ్‌ వారికి నచ్చజెప్పడంతో వారు శాంతించినట్లు తెలుస్తున్నది. ఇదిలాఉండగా మంత్రి కొండా సురేఖ వరుసగా అనేక వివాదాల్లో ఇరుక్కుపోయింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రి సీతక్క, సురేఖ మధ్య ఆధిపత్యపోరుతో మొదలై, కెటిఆర్‌ను విమర్శించే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని వివాదంలోకి లాగడం,  వరంగల్‌ తూర్పులో మాజీ మంత్రి, ప్రస్తుత ఎంఎల్సీ బస్వరాజు సారయ్యతోపాటు, స్టేషన్‌ ఘణపూర్‌ ఎంఎల్‌ఏ కడియం శ్రీహరితో పొసగకపోవడం, పరకాల ఎంఎల్‌ఏ రేవూరి ప్రకాశ్‌రెడ్డితో బ్యానర్‌ వివాదం, గీసుకొండ సీఐ సీటులో కూర్చోవడంలాంటి విషయాలతో కొండా సురేఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్త చర్చకు కారణంగా మారింది. అధిష్టానంకూడా ఆమె విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇదిలాఉంటే హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన కార్యక్రమాలు కాంగ్రెస్‌ పార్టీని సమస్యల వలయంలో చుట్టుముట్టాయి. విపక్షాలు, అధికార పక్షాలమధ్య ఇవి పెద్ద వివాదానికి దారితీసాయి. దీనిపై ప్రజలనుండికూడా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పెండింగ్ లో  ఉన్న బిల్లులపైన పలు గ్రామాల్లో పంచాయితీ సర్పంచ్‌ల సంఘం పక్షాన సాగుతున్న ఆందోళనలు ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నాయి. ఈ క్రమంలో పంచాయితీ ఎన్నికలు వస్తే పరిస్థితేమిటని కాంగ్రెస్‌ క్యాడర్‌ వాపోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *