ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అంశమే రెఫరెండమా?
బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు
మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం
రాజాసింగ్ హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుడు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోదీది ఏ కులం? రాహుల్ గాంధీది ఏ మతం అనే అంశాలపై చర్చకు తాము సిద్ధమని, ఇదే అంశాన్ని రెఫరెండంగా భావిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి వెళదామా? అంటూ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. కుల గణన తప్పుల తడక అని, బీసీ జాబితాలో ముస్లింలను కలపడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని కులంపై సీఎం రేవంత్ రెడ్డి అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ముస్లింలను బీసీ జాబితాలో కలిపి రిజర్వేషన్ల జాబితాను కేంద్రానికి పంపితే ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘‘మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి పంపితే ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ డ్రామా లాడుతోంది. ప్రజలకు, బీసీ సంఘాలకు ఈ విషయం తెలుసు’’అని వ్యాఖ్యానించారు. ఈరోజు హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో ఎనిమీ ప్రాపర్టీస్ (శత్రు ఆస్తులు)పై కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వివరాలు వెల్లడిరచారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పై విధంగా స్పందించారు. ఏమన్నారంటే… తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్‌పై సమీక్ష నిర్వహించాం. రంగారెడ్డి, హైదరాబాద్, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్ (శత్రు ఆస్తులు) ఉన్నాయి. చాలా ఆస్తులు ఆక్రమణలు జరిగాయి.
వాటిని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా పొజిషన్ లో ఉన్న సామాన్య ప్రజలు, రైతులకు ఇచ్చేందుకు ఉన్న అవకాశాలేమిటి? అనే అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే, రికార్డ్స్ పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరాం. గతంలో పాకిస్తాన్ తో యుద్దం సందర్బంగా ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్లిన ప్రజలు, ఇక్కడ తమ ఆస్తులను వదిలేసి వెళ్లారు. అట్లాగే పాకిస్తాన్ నుంచి ఇండియాకు వొచ్చిన వాళ్లు అక్కడ తమ ఆస్తులను వదిలేశారు. అయితే ఆ ఆస్తులు పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమ్మేసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఎనిమీ ప్రాపర్టీస్ ను కూడా అమ్మేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని నిర్ణయించాం. తెలంగాణలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయని అంచనా వేస్తున్నాం. మార్చి నెలాఖరులోపు ఆయా ఆస్తులకు సంబంధించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
మనిషి పుట్టిన వెంటనే కులం పేరు పెడతామా? రేవంత్ రెడ్డికి అలాగే చేశారా? ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రధానిపై మాట్లాడేటప్పుడు అవాకులు, చవాకులు మాట్లాడతారా? రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నా. మోదీ ముమ్మాటికీ బీసీనే. 1994లోనే గుజరాత్ లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది. ఈ దేశంలోని వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణ పేదలు, దళిత జాతి మొత్తం మోదీ తొలిసారి ప్రధానమంత్రి కాగానే సంబురాలు చేసుకున్నారు. మోదీ సైతం తన తొలి కేబినెట్ లో 27 మంది బీసీలను మంత్రులుగా చేశారు. అలాగే 12 మంది దళితులను, 8 మంది ఎస్టీలను మంత్రులుగా చేశారు.
మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత మంది బీసీలున్నారు? ఇద్దరు మాత్రమే. మరి కుల గుణన సర్వేలో 46 శాతం మంది బీసీలున్నట్లు మీ ప్రభుత్వం లెక్క తేల్చింది. అంతకుముందు కేసీఆర్ హయాంలో సర్వే చేస్తే 51 శాతం బీసీలున్నట్లు తేల్చారు. ఈ లెక్కన మీ ప్రభుత్వంలో ఎంత మంది మంత్రులుండాలి? మరి మీరు ఎంత మందికి అవకాశం కల్పించారు? అసలు మోదీ కులం గురించి చర్చించాల్సిన అవసరం ఏముంది? ఆ విషయానికొస్తే… రాహుల్ గాంధీ కులం, మతం, జాతి గురించి చర్చ చేయాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్. ఆయన తల్లి సోనియాగాంధీ క్రిస్టియన్. ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ ఏ కులమని ప్రోత్సహిస్తున్నారు. రాహుల్ కు ఒక కులం లేదు, మతం లేదు, జాతి లేదు. మరి అట్లా చర్చ చేయాలంటే టెన్ జన్ ఫథ్ నుండే రాహుల్ కులం, మతం గురించి చర్చ చేద్దామా? దీనికి రేవంత్ ఏం సమాధానం చెబుతారు. రేవంత్ తీరు కొరివితో తలగోక్కోవడమంటే ఇదే. రేవంత్ కు దమ్ముంటే… మోదీ బీసీయా కాదా? రాహుల్ గాంధీ కులం, మతంపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెఫరెండంగా భావిద్దామా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు. 6 గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ కు దమ్ముంటే బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించాలి. అట్లాగే పూర్తిస్థాయిలో కులగణన చేసి బీసీ జనాభా లెక్క తేల్చాలి. ఆ తరువాత కేంద్రానికి పంపితే ఒప్పించి ఆమోదింపజేసే బాధ్యత మేం తీసుకుంటాం. అంతే తప్ప బీసీ జాబితాలో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి పంపితే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే ముస్లింలకు మైనారిటీ కోటాలో లాభం చేకూరుస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలోనూ లబ్ది పొందుతున్నారు. మళ్లీ బీసీ జాబితాలో కలపడం ఏంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కులగణన సక్రమమైతే రీ సర్వే ఎందుకు చేస్తున్నారు? తెలంగాణలో 3 కోట్ల 95 లక్షల ఆధార్ కార్డులున్నట్లు నివేదికలున్నయ్. ఆధార్ తీసుకోని వారి శాతం మరో 10 శాతం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన తెలంగాణ జనాభా 4 కోట్ల 30 లక్షలు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన సర్వే చేసి 3 కోట్ల 70 లక్షల జనాభా ఉన్నట్లు తేల్చడమేంది? మిగిలిన 60 లక్షల మంది ప్రజలేమైపోయారు? అని ప్రశ్నించారు.
రాజాసింగ్ మావాడు..
రాజాసింగ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఒక కులానికే బీజేపీలో పదవులిచ్చారని అనడం కరెక్ట్ కాదు. గత ఎన్నికల్లో బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. అట్లాగే అంతకుముందు బీసీనైన నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. బీసీ అయిన లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం తోపాటు పార్లమెంటరీ బోర్డు పదవి ఇచ్చింది. బీసీని సీఎం చేస్తానని ప్రకటించింది కాబట్టి ఓసీ అయిన కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. అయినా పార్టీ నియమనిబంధనల ప్రకారం పదవులిస్తారు. ఏదైనా అభ్యంతరాలుంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలి. అంతే రోడ్డుకు ఎక్కడం సరికాదు. రాజాసింగ్ కు ఇబ్బందులుండొచ్చు. ఆయన కమిట్ మెంట్ ఉన్న నాయకుడు. హిందుత్వవాది. చాలా మంచి వ్యక్తి. అనేక రకాలుగా ధర్మం కోసం పోరాడుతూ ఇబ్బంది పడ్డారు. ఆయన మావాడు. ఆయనతో నిన్న మాట్లాడిన. ఇకపైనా మాట్లాడతానని బండి సంజయ్ పేర్కొన్నారు.





