‌ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో నీటి సంక్షోభం

భూగర్భజలాలు పడిపోవడం ఆందోళనకరం..
మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : తెలంగాణను భూగర్భ జల సంరక్షణలో ఆదర్శంగా నిలిపిన బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ నీటి ప్రణాళికలు కాంగ్రెస్‌ ‌పాలనలో పూర్తిగా వైఫల్యానికి గురవుతున్నాయని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కేసీఆర్‌ ‌నాయకత్వంలో 2013 నుంచి 2023 వరకు భూగర్భ జలాలు 56% పెరిగాయని మిషన్‌ ‌కాకతీయ ద్వారా 27,000కు పైగా చెరువులను పునరుద్ధరించడంతో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని,   8.93 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని తెలిపారు.  రైతులకు సాగు సౌకర్యం మెరుగుపడి, భూగర్భ జలాల నిల్వ స్థిరంగా ఉండి, తాగునీటి భద్రత బలపడింది. కానీ, కేవలం 14 నెలల కాంగ్రెస్‌ ‌పాలనలోనే ఈ వ్యవస్థ అస్తవ్యస్తం మవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల గణనీయంగా తగ్గడం ఆందోళనకరం.

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వైఫల్యంతో రెండు మీటర్లకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయి. యాదాద్రి భువనగిరిలో 2.71 మీటర్ల భారీ తగ్గుదల నమోదు కాగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఇతర జిల్లాల్లోనూ భూగర్భజలాల స్థాయిలో తీవ్రంగా పడిపోతుంది. 120 కిలోమీటర్ల పొడవున గోదావరి పూర్తిగా నీరు లేకుండా ఎండిపోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ వైఫల్యం కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్‌ ‌సహా ప్రాజెక్టు నీటి భద్రతను నిలబెట్టడంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణ ప్రజలకు తాగునీటిని అందించిన మిషన్‌ ‌భగీరథ ఇప్పుడు పూర్తిగా కుంటుపడింది. ప్రజలు మళ్లీ బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వొచ్చింది. తాగునీటి కోసం ఎక్కువ మోటార్‌ ‌నడిపించు కోవాల్సి రావడం వల్ల కరెంట్‌ ‌బిల్లులు పెరిగి ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుంది. కాంగ్రెస్‌ ‌పాలన తెలంగాణను నీటి సంక్షోభం వైపు నెట్టింది. బలమైన నీటిపారుదల వ్యవస్థను కాంగ్రెస్‌ ‌తన నిర్లక్ష్యంతో పతనం చేస్తోందని, రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటి పరిరక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే నెలల్లో రాష్ట్రం మరింత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వొస్తుందని హరీష్‌ ‌రావు హెచ్చరించారు.

 రామినేని శ్రీనివాస్‌ ‌రావుకు పరామర్శ
మలక్‌పేట్‌ ‌యశోద హాస్పిటల్‌లోఅనారోగ్యంతో చికిత్స పొందుతున్న టీఎన్జీఓఎస్‌ ‌రాష్ట్ర కోశాధికారి, తెలంగాణ ఉద్యమకారుడు రామినేని శ్రీనివాస్‌ ‌రావుని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న హరీష్‌ ‌రావు, వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామినేని శ్రీనివాస్‌ ‌రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page