జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం

ఆమోదముద్ర వేసిన‌ కేంద్ర కేబినేట్
వొచ్చే పార్లమెంట్ శీతాకాల‌ ‌సమావేశాల్లో బిల్లు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18:  ‌దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. వొచ్చే పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఎన్డీయే సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఇటీవల స్పష్టంచేశారు. గతనెల స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, త‌ర‌చూ ఎన్నిక‌లు జ‌రగుతుండ‌డ‌తో దేశ పురోగతిపై ప్ర‌భావం పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనినుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వొస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే కోవింద్‌ ‌కమిటీని వేసి నివేదిక రూపొందించారు. దీనిని ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్‌ ‌బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. కేంద్ర సర్కార్‌ ‌వన్‌ ‌నేషన్‌ – ‌వన్‌ ఎలక్షన్‌ ‌ప్రతిపాదన కోసం రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌చర్చించారు.

ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది. సుదీర్ఘ చర్చల అనంతరం రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. జస్టిస్‌ ‌బీపీ జీవన్‌ ‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్‌ ‌మే 1999లో తన 170వ నివేదికలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అధ్యయనానికి కమిటీ వేసి.. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. అంతా సానుకూలంగా తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇకపోతే జమిలితో తరచూ ఎన్నికల నివారణతో పాటు, దేశంపై అధిక ఖర్చుల భారం తప్పనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *