నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీలపై చర్చలేవీ?

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నిత్యం సభలో ప్రధాని మోదీ ఉండడం లేదు. సమస్యలను లేవనెత్తినప్పుడు లేచి సమాధానం ఇవ్వడం బాధ్యత. ఈ సమావేశాల్లో కూడా అధికార పార్టీ తీరు మారడం లేదు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నింపాదిగా, సమయోచితంగా, ప్రజలు మెచ్చుకునేలా సమాధానాలు ఇవ్వడంలో మంత్రులు విఫలం అవుతున్నారు. నీట్‌పై జరిగిన చర్చలో ఇది కనిపించింది.  తెలంగాణకు బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో ఆందోళన వ్యక్తం అవుతున్న వేళ కనీసంగా కేంద్రం బాధ్యతగా ఇంతవరకు సానుకూల సమాధానం ఇవ్వలేదు. నీతి ఆయోగ్‌ సమావేశాల్లో చర్చలు కూడా నిష్ఫలం అవుతున్నాయి. అక్కడ కేంద్ర రాష్ట్రాల సమస్యలపై చర్చించడం లేదు. తాజాగా  జరుగుతున్న నీతి ఆయోగ్‌ సమావేశానికి తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి సహా పంజాబ్‌, కేరళ, జార?ండ్‌ తదితర రాష్ట్రాల సిఎంలు దూరంగా ఉన్నారు. ఇది చాలా సీరియస్‌గా ఆలోచన చేయాల్సిన అవసరం కేంద్రంపై ఉంది.

వారు లేకుంటే ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం లేనట్లుగా గుర్తించి, వారిని పిలిచి మాట్లాడాలి. ఇకపోతే బిజెపియేత రాష్ట్రాల  సిఎంలు లేవనెత్తే సమస్యలపై అధికార బిజెపి పార్టీకి చెందిన  ఎంపిలు, కేంద్ర మంత్రులు ఎదురుదాడితో దాటవేయడం సరికాదు. బడ్జెట్‌లో లోటుపాట్లను గుర్తించి… ప్రధాని మోదీ కూడా ఎందుకు ఇలా జరిగిందో చూస్తానని చెప్పలేక పోయారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటే నిధులు ఇవ్వకూడదా అన్నది చెప్పాలి. విరీరిచ్చే నిధులు కాంగ్రెస్‌ పార్టీకి ఇస్తున్నారా అన్నది చెప్పాలి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీ తదితర సమస్యలపై ఎందుకు చర్చించరో చెప్పడం లేదు. విభజన సమస్యలపై విధివిధానాలు లేకుండా పదేళ్లు గడిపారు. భారతదేశం,ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పడం మనకు బాగా అలవాటయ్యింది. అయితే చట్టసభల్లో చర్చించకుండానే చట్టాలు వస్తున్నాయి. చట్టసభల్లో చర్చించకుండా సమస్యలను దాట వేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నామన్న ఆలోచనచేయడం లేదు.

రాబోయే తరాలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో చెప్పడం లేదు. అధికార, విపక్షాలు తమ రాజకీయ ఎజెండాతో పనిచేయడం వల్లనే ఇలా జరుగుతోంది. ఇలా ఒక్క సమస్యపైనా చర్చించకుండా కాలం గడిపేస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పార్లమెంట్‌ అధికారంలో ఉన్న ఒకరిద్దరు నేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. పార్లమెంటులో చర్చ అన్నది ప్రజలకు సంబంధించిన వ్యవహారం. ఇదేదో అధికార,విపక్షాల సమస్యగా చూస్తున్నారు. ఇక్కడ 140కోట్ల ప్రజలంతా ఆందోళనలతో ఉన్నా పట్టించుకోవడం  లేదు. వరదలతో దేశం మునుగుతున్నా చర్చించడం లేదు. భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మేడిపండు చందంగా మారిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. వ్యక్తిస్వామ్యం, నిరంకుశత్వం ప్రబలి పోతోంది. పార్లమెంట్‌, అసెంబ్లీల్లో ప్రజల సమస్యలపై చర్చ జరగడం లేదు.  అధికార విపక్షాలు కలసి ఇదేదో తమ సొంత జాగీరుగా భావించి.. సమావేశాలను నడుపుకుంటున్నారు.

అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇదే తంతు సాగుతోంది. బిజెపి అధికారం చేపట్టిన తరవాత అసలు సమస్యలపై చర్చ అన్నది మరచిపోయారు. గతంలో వాజపేయ్‌, అద్వానీ, పివి నసింహారావుల హయాంలో కూడా సమస్యలపై చర్చ జరిగేది. వారు నిత్యం  సమావేశాల్లో పాల్గొనే వారు. కానీ ప్రస్తుతం సమస్య ఏద్కెనా పార్లమెంటులో చర్చకు రావడం లేదు. ఈ క్రమంలో అన్నిరాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఇదే పద్దతి సాగుతోంది. రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీ నేతలు చర్చలకు అవకాశం ఇవ్వడం లేదు. నిరుద్యోగం, దేశంలో పెరుగుతున్న ధరలు, జీఎస్టీ పెంపు, వరదలు లాంటి అంశాలపై చర్చించి జవాబివ్వాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించు కోవడం లేదు. ఏటా వరదలు వస్తున్నాయి. నీరంతా వృధాగా సముద్రంలో కలిసి పోతోంది. వరదల్లో ప్రజలు  మునిగి పోతున్నారు. అయినా పట్టింపు లేదు. మోదీ  పదేళ్ల అధికారంలో ఈ సమస్యలపై ఏనాడూ చర్చించ లేదు. సమస్యలను సమస్యగా చూడడం మానేశారు.

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన ప్పుడల్లా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, ప్రధాని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. తొలిరోజు ప్రధాని మోదీ  కూడా సభ సజావుగా సాగాలని, ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. అయితే పార్లమెంట్‌  సమావేశమైన తర్వాత అలాంటి సుహృద్భావ వాతావరణం మాత్రం కనపడడం లేదు.  ఎందరో కొత్త సభ్యులు పార్లమెంట్‌ గడప తొక్కారు. పార్లమెంట్‌ను నడిపించేందుకు రాజనీతిజ్ఞత అవసరం. మనం ఉన్నదే ప్రజల కోసం అన్న కోణంలో అధికార పక్షం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి.. సమస్యలపై చర్చించడం ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వాలి. చట్టసభల్లో ప్రజా సమస్యలను చర్చించేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలి. వారు సమస్యలను ప్రస్తావిస్తే చర్చించాలి.

వారిచ్చే సూచనలను పరిగణన లోకి తీసుకోవాలి. చర్చల ద్వారా ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే చట్టసభల కు విలువ ఉంటుంది. గతంలో ఎప్పుడూ చర్చలకు ప్రాధాన్యం ఉండేది. సమస్యలపై తక్షణ చర్చలు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చట్టసభలకు గౌరవం ఇనుమడిరచేలా  అధికార విపక్షాలు కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చట్టసభలను పాలకులే ఎక్కువగా గౌరవించాలి. ప్రజల సమస్యల పై చర్చించడం అలవాటు చేసుకోవాలి. ప్రజల సమస్యలపై చర్చించిన తరవాతనే విధాన నిర్ణయాలు తీసు కోవాలి. లేకుంటే ప్రజా సమస్యలు పార్లమెంట్‌ దాకా రావు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివిధ రూపాల్లో చర్చించేం దుకు ఉన్న అవకాశాలను వినియోగించు కోవాలి. ఎందుకంటే నిరుద్యోగం వారికి కనపడడం లేదు. ధరల పెరుగుదల వారి లెక్కలోకి రావడం లేదు. వరదలు, ప్రజల బాధలు వారి లెక్కల్లో లేవోమో. ఇలాంటి పరిస్థితులను అధిగమించి కొత్త సంప్రదాయాలను నెల కొల్పాలి. భారత పార్లమెంట్‌ ప్రతిష్టను ఇనుమడిరపచేయాలి.
-సమీర్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *