సొంత చెల్లెలు జైలులో ఉన్నా ఇక్కడ రాజకీయం
వారిని నమ్ముకుంటే అంతే సంగతులు…
బిఆర్‌ఎస్ తీరుపై మండిపడ్డ సిఎం రేవంత్
సబిత, సునీతలకు సిఎం సుతిమెత్తని హెచ్చరిక
పరోక్షంగా బిఆర్‌ఎస్‌ను వీడాలని సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ రాజకీయ చేస్తుందని..సభను స్తంభింప చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని సొంత అక్కలుగానే భావించానని.. ఓ అక్క తనను నడి బజారులో వదిలేసినా ఏం అనలేదని అన్నారు. మరో అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లానని.. అప్పటి కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు చెప్పారు. ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తేయాలని ఎప్పుడైనా చెప్పారా.? అంటూ సీఎం ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతల మాటలు నమ్మొద్దని ఆ అక్కలకు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ‘పార్టీని వదిలి వెళ్లిన వారిలో ఒకరు మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. నన్ను నమ్ముకున్న ఇద్దరు అక్కలు మంత్రులై ముందు వరుసలో ఉన్నారు. ఇక ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారు.
విూరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తీహాడ్ జైలులో ఉన్నారు.’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యురాలు, ఆదివాసీ బిడ్డ సీతక్కను ఎంతో అవమానకరంగా మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అవమానించేలా సోషల్ విూడియాలో విూమ్స్ పెట్టారని.. ఇదేనా విూ నీతి అంటూ ప్రశ్నించారు. తాను మహిళలను గౌరవిస్తానని.. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులయ్యారని అన్నారు. దళితుడైన స్పీకర్ ముందు కింద కూర్చోవడం ఇష్టం లేకే కేసీఆర్ సభకు రాలేదని ధ్వజమెత్తారు. దళితుడిని అధ్యక్షా అనే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చిందని అన్నారు. ’బీఆర్‌ఎస్ దళిత వ్యక్తిని సీఎంను చేస్తానని మోసం చేసింది.
దళితునికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి చెప్పి బర్తరఫ్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ఏఐసీసీ అధ్యక్షునిగా ఖర్గేను నియమించారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌ను చేశారు.’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మంత్రి సీతక్కపై సోషల్ విూడియాలో అవమానించిన తీరు చూస్తే చెప్పుతో కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి బిడ్డను అవమానిస్తే ఊరుకుందామా అని ప్రశ్నించారు. సునీతా, సబితా ఇంద్రారెడ్డి కోసం నేను కొట్లాడిన అని తెలిపారు. నన్ను నమ్ముకున్న అక్కలు ఇవాళ మంత్రులుగా ఉన్నారని తెలిపారు. సీతక్కను కుటుంబసభ్యురాలిగా చూసుకుంటానని.. ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులు అయ్యారని అన్నారు. దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న విూరు ఏమయ్యారని సునీతా, సబితా ఇంద్రారెడ్డికి హితవు పలికారు.




